అర్ధరాత్రి తరువాత ఈదురు గాలులతో బీభత్సం.
లబోదిబోమంటున్న అన్నదాతలు
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలో తాడిచెర్ల, మల్లారం, పెద్దతూండ్ల, కొయ్యుర్, రుద్రారం, నాచారంతో పాటు అన్ని గ్రామాల్లో రబీ సీజన్ వరి పొలాల కోతలు జోరందుకున్నాయి. కొంత ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరుకొంది. మామిడి పంట సైతం కోత దశకు వచ్చింది. మిర్చి పంట కల్లాల్లో గ్రేడింగ్ చేసేందుకు పోశారు. అయితే పంటలు అసలే ఆశాజనకంగా ఉన్న నేపథ్యంలో పెట్టుబడులు వస్తాయో లేదోని రైతులు అయోమయంలో ఉంటె మంగళవారం అర్ధరాత్రి ఈదురు గాలులతో దొంగలా వచ్చిన చెడగొట్టు వాన రైతులను నిండా ముంచి కోలుకోలేని దెబ్బతీసిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కొనుగోలు కేంద్రాల్లో రైతులు విక్రయించడానికి పోసిన ధాన్యం తడిసి ముద్దయింది. కొన్ని కేంద్రాల్లో వరద ఉధృతికి ధాన్యం కొట్టుకపోయిది. కోతకు వచ్చిన వరి పొలాలు నెలవాలాయి. రాలిన మామిడి, తడిసిన మిర్చితో రైతుల ఆశలు ఆడియాసలైయ్యాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు నోట్లోకొచ్చే సమయంలో చెడగొట్టు వానతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పెట్టుబడులు కూడా వస్తాయో లేదోని తమకు ఆత్మహత్యలే శరణ్యమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తడిసిన, రంగుమారిన, మొలకెత్తిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకొంటున్నారు. ప్రభుత్వం సబ్సిడీపై పరదాలు ఇచ్చి ఉంటే కొంతమేర ధాన్యాన్ని రక్షించుకునే వాళ్ళమని చెప్పారు. ఇప్పటికైనా సబ్సిడీపై పరదాలు అందించాలని కోరుతున్నారు.



