– బడులు, ఆస్పత్రుల్లో పారిశుధ్యంపై కేంద్రీకరించాలి
– పర్యవేక్షణ వ్యవస్థను ప్రభుత్వం మెరుగుపర్చాలి
– తెలంగాణ పౌర స్పందన వేదిక డిమాండ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మానవాభివృద్ధి సూచికల్లో విద్యావైద్యం ముఖ్యమైనవని తెలంగాణ పౌర స్పందన వేదిక (టీపీఎస్వీ) తెలిపింది. ఎక్కడైతే ప్రజలందరికీ విద్యావైద్యం ఉచితంగా అందుబాటులో ఉంటాయో ఆ దేశంగానీ, రాష్ట్రంగా అభివృద్ధి సాధిస్తాయని పేర్కొంది. అవి ప్రభుత్వ ఆధీనంలో ఉంటేనే ప్రజలందరికీ అందుతాయని స్పష్టం చేసింది. కరోనా కరాళనృత్యంతో భీతిల్లిపోయిన సందర్భంలో పేద, మధ్య తరగతి ప్రజలకు దాని ప్రాధాన్యత బాగా అర్థమైందని తెలిపింది. టీపీఎస్వీ ఏర్పడి రెండేండ్ల అవుతున్న సందర్భంగా ఆ సంఘం అధ్యక్షులు, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం రాధేశ్యాం సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యావైద్యం ప్రభుత్వ బాధ్యత అనే నినాదంతో 2021, జులై నాలుగున ఈ సంఘం ఏర్పడిందని గుర్తు చేశారు. ఏడు జిల్లాల్లో కమిటీలు ఏర్పడ్డాయని వివరించారు. పాఠశాలల వారీగా సర్వే ద్వారా సమస్యలను సేకరించి అధికారులకు నివేదికలు సమర్పించామని తెలిపారు. పాఠశాలల్లో పారిశుధ్య పరిస్థితులు, సహాయ సిబ్బంది కొరత, ఉపాధ్యాయుల కొరత వంటి సమస్యలపై అనేక వినతిపత్రాలను ఇచ్చామని పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆరోగ్య కేంద్రాల్లో సర్వేలు నిర్వహించి నివేదికలు రూపొందించి జిల్లా కలెక్టర్లకు, వైద్యాధికారులకు ఇచ్చామని గుర్తు చేశారు. 2023-24 కేంద్ర బడ్జెట్‌లో విద్యకు పది శాతం, వైద్య రంగానికి ఆరు శాతం నిధులను కేటాయించాలంటూ సుమారు 14 వేల మంది ప్రజానీకం వద్ద సంతకాల సేకరణ చేసి ప్రధానికి మెమోరాండం ఇచ్చామని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు 24 శాతం, వైద్యరంగానికి 12 శాతం నిధులు కేటాయించాలని కోరుతూ రెండు వేల మంది సంతకాలతో ఆర్థిక మంత్రికి వినతిపత్రం సమర్పించామని పేర్కొన్నారు. ప్రభుత్వ బడులను ఎవరు కాపాడుకోవాలి, పిల్లలు ఎందుకు రావడం లేదనే అంశంపై ప్రజలను చైతన్యపరచడం కోసం తొమ్మిది చోట్ల రచ్చబండ కార్యక్రమాలను నిర్వహించామని గుర్తు చేశారు. ప్రజలు విస్తృతంగా ప్రభుత్వ విద్యాలయాలు, ఆస్పత్రులను వినియోగించుకుంటేనే వాటి మనుగడ కొనసాగుతుందని తెలిపారు.
ఆస్పత్రుల్లో సిబ్బంది కొరతను తీర్చాలి
వైద్యరంగంలో ఈ మధ్య కాలంలో కొంత మెరుగుదల ఉన్నా ఇంకా జరగాల్సింది చాలా ఉందని నర్సిరెడ్డి, రాధేశ్యాం పేర్కొన్నారు. భారీ పథకాలతో అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మించడం ఆహ్వానించదగిందేనని తెలిపారు. అయితే అవి అందుబాటులోకి రావడానికి చాలా సమయం పడుతుందని వివరించారు. భవనాలు, వసతులున్నా సిబ్బంది లేకపోతే ప్రయోజనముండబోదని పేర్కొన్నారు. రాష్ట్రంలో వైద్యరంగంలో ప్రధాన సమస్య సిబ్బంది కొరతేనని తెలిపారు. కేవలం 40 నుంచి 50 శాతం సిబ్బందితోనే అన్ని స్థాయిల్లో ప్రభుత్వ ఆస్పత్రులు నడుస్తున్నాయని విమర్శించారు. ప్రస్తుతమున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్ల నుంచి ఆశాలు, అటెండర్ల వరకు తగినంత సిబ్బంది నియామకాలు జరిగితే ఉస్మానియా, గాంధీ, నిమ్స్ వంటి ఆస్పత్రులపై ఒత్తిడి చాలా తగ్గుతుందని సూచించారు. ఇంకోవైపు ప్రజలకు అతి చేరువలో నాణ్యమైన వైద్యం అందించొచ్చని కోరారు. అన్ని స్థాయిల్లోని ఆస్పత్రుల్లో పారిశుధ్యంపై కేంద్రీకరిస్తే మధ్య తరగి ప్రజలు కూడా ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తారని వివరించారు.
21 వేల ఉపాధ్యాయ ఖాళీలు
విద్యారంగంలో పర్యవేక్షణ లోపం, పారిశుధ్య లోపం ప్రధానంగా ఉన్నాయని నర్సిరెడ్డి, రాధేశ్యాం తెలిపారు. 33 డీఈవోలకుగాను 29 పోస్టులు, 62 డిప్యూటీఈవోలకుగాను 58 పోస్టులు, 467 ఎంఈవోలకుగాను 467 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. గతంలో అన్ని పాఠశాలల్లో పారిశుధ్య కార్మికులుండేవారని గుర్తు చేశారు. రెండేండ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఆ పోస్టులను రద్దు చేసిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 21 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. విద్యావాలంటీర్లను రెండేండ్లుగా నియమించడం లేదని వివరించారు. మన ఊరు-మనబడి, మనబస్తీ-మనబడితోపాటు సిబ్బంది కొరతపైన, పర్యవేక్షణ అధికారుల కొరతపైన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రీకరిస్తే విద్యావ్యవస్థను మెరుగుపర్చుకోవచ్చని సూచించారు.