హైదరాబాద్ లో ధార్‌ గ్యాంగ్‌ హల్ చల్

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ లో అంతర్రాష్ట్ర దోపిడీ దొంగల ముఠా ధార్ గ్యాంగ్ హల్ చల్ సృష్టిస్తోంది. ఓవైపు స్థానిక దొంగలు ఎక్కడికక్కడ ఇళ్లను గుల్ల చేస్తుంటే.. ఇతర రాష్ట్రాలకు చెందిన కిరాతక ముఠాలు నగరంలో అలజడి రేపుతున్నాయి. తాజాగా నగర శివారు హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఒక గేటెడ్‌ కమ్యూనిటీలోని 5 ఇళ్లల్లో మధ్యప్రదేశ్‌కు చెందిన ధార్‌ గ్యాంగ్‌ వరుస చోరీలకు తెగబడింది. వరుస అరెస్టులతో మధ్యప్రదేశ్‌కు చెందిన ధార్‌ గ్యాంగ్‌ రెండేళ్లుగా నగరంవైపు చూడలేదు. చివరిసారిగా 2022 ప్రథమార్థంలో సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఈ ముఠా దొంగతనాలు చేసింది. పగటిపూట కాలనీల్లో రెక్కీ చేసి అర్థరాత్రి దొంగతనం చేసే ముఠాలు ఒక్కోసారి దాడులు, హత్య చేసేందుకు వెనుకాడరని పోలీసులు చెబుతున్నారు. ఈ దొంగల మీద పీడీ యాక్టులు ప్రయోగించడం, ఇతరుల్ని పట్టుకొచ్చి జైలుకు పంపడంతో రెండేళ్లు ఇటువైపు రావడం మానేశారు. తాజాగా మరోసారి ఈ ధార్ గ్యాంగ్ నగరంలోకి చొరబడటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Spread the love