సాగర్‌ క్లబ్‌ని ప్రయివేట్‌ వ్యక్తులకు కేటాయించడంపై ధర్నా

Dharna against allotment of Sagar Club to private individuals– ఎన్‌ఎస్పీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు
నవతెలంగాణ-నాగార్జునసాగర్‌
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ హిల్‌ కాలనీలోని క్లబ్‌ను ప్రయివేట్‌ వ్యక్తులకు కేటాయించడాన్ని నిరసిస్తూ గురువారం ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ నాయకులు, యువకులు నాగార్జునసాగర్‌- హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై బైటాయించారు. అనంతరం పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు మాట్లాడుతూ.. నాగార్జునసాగర్‌ హిల్‌ కాలనీలోని క్లబ్‌ డ్యామ్‌ నిర్మాణం చేపట్టినప్పటి నుంచి ఎన్‌ఎస్పీ అధికారులకు స్థానిక యువకులకు, విశ్రాంత ఉద్యోగులకు ఆటవిడుపుగా, ఫంక్షన్లకు అనువుగా ఉండేదని తెలిపారు. అలాంటి క్లబ్‌ను ప్రయివేట్‌పరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయివేట్‌పరం కాకుండా క్లబ్‌ను మినీ స్టేడియంలా మార్చాలని సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ను కోరారు. ఎన్‌ఎస్పీ అధికారులు క్లబ్‌ను నందికొండ మున్సిపాలిటీకి అప్పజెప్పకుండా తమకు ఇష్టమైన వాళ్లకు కేటాయిస్తున్నారని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు కర్ణ బ్రహ్మానందరెడ్డి, నందికొండ మున్సిపాలిటీ వైస్‌ చైర్మెన్‌ మంద రఘువీర్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు రామ్మోహన్‌, కాంగ్రెస్‌ నాయకులు ఉంగరాల శ్రీనివాస్‌, యువకులు పాల్గొన్నారు.

Spread the love