గ్రూప్‌ 2 రద్దు చేయాలని రేవంత్‌ రెడ్డి కోరలేదా?

Didn't Revanth Reddy want to cancel Group 2?– శవాల మీద పేలాలు ఏరుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య : కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గ్రూప్‌ 2 రద్దు చేయాలని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి కోరలేదా? అని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. ఈ మేరకు ఆమె శనివారం ట్వీట్‌ చేశారు.శవాల మీద పేలాలు ఏరుకోవడం రేవంత్‌ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. రేవంత్‌ ఆవేదన బూటకం… కాంగ్రెస్‌ ఆందోళన నాటకమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రవళిక ఆత్మహత్య పట్ల ఆమె విచారం వ్యక్తం చేశారు. ఏ తల్లిదండ్రులకు ఇలాంటి పరిస్థితి రావద్దన్నారు. గ్రూప్‌ 2 వాయిదా వేయాలని రేవంత్‌ రెడ్డి, శ్రీధర్‌బాబు డిమాండ్‌ చేశారని ఆమె గుర్తుచేసారు. కాంగ్రెస్‌ కుట్రలను బద్దలు కొట్టి లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత కేసిఆర్‌ దని ఆమె తెలిపారు. బతుకమ్మను కించపరచడం కాంగ్రెస్‌ పార్టీకే సాధ్యమని ఎద్దేవా చేశారు. తమకు బతుకమ్మ చేయడం తెలుసు. బాధలను పంచుకోవడం తెలుసని కవిత స్పష్టం చేశారు. ఆడబిడ్డ ఆత్మహత్య చేసుకుంటే సానుభూతి వ్యక్తం చేయడం పోయి రాజకీయం చేయడం కాంగ్రెస్‌ విధానమా ? అని ఆమె ప్రశ్నించారు.
బతుకమ్మ పాట పాడిన ఎమ్మెల్సీ కవిత
ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై తొమ్మిది రోజుల పాటు తీరొక్క పూలతో ఘనంగా జరుపుకొనే పండుగ సందర్భంగా ఆడబిడ్డలందరికీ ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు.ఈ మేరకు శనివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. మన ఆడబిడ్డల ఆత్మీయ సంగమం, తెలంగాణ ఆత్మగౌరవ సంబరం బతుకమ్మ అన్నారు. ఈ నేపథ్యంలో భారత జాగృతి రూపొందించిన బతుకమ్మ పాటల ఆల్బమ్‌ను కవిత విడుదల చేశారు. మొత్తం 10 పాటలున్న ఈ ఆల్బమ్‌ యూట్యూబ్‌లో అందుబాటులో ఉంచారు. ఇందులో ఒక పాటకు ఎమ్మెల్సీ కవిత కోరస్‌ ఇవ్వడం విశేషం.

Spread the love