అంగన్వాడీల సంక్షేమానికి పెద్దపీట

– ఎమ్మెల్సీ కవిత
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అంగన్వాడీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉద్యోగ విరమణ వయస్సు 65కు పెంచి, ఆర్థిక సాయం చేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని చెప్పారు. మినీ అంగన్వాడీలను మెయిన్‌ అంగన్వాడీలుగా అప్‌ గ్రేడ్‌ చేయడం చరిత్రాత్మక నిర్ణయమన్నారు. శనివారం బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి ఎల్‌ రూప్‌సింగ్‌, మినీ అంగన్వాడీ టీచర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు ఆడపు వరలక్ష్మి తదితరులు ఆమెను కలిశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ అంగన్వాడీలకు సంబంధించి తాను ప్రస్తావించిన సమస్యల్ని పరిష్కరించిన సీఎం కేసీఆర్‌కు కతజ్ఞతలు తెలిపారు.ఉద్యోగ విరమణ సమయంలో అంగన్వాడీ టీచర్లకు రూ. లక్ష, హెల్పర్లకు రూ. 50వేలు అందించాలని నిర్ణయించడం శుభపరిణామం అని చెప్పారు. ఉద్యోగ విరమణ తర్వాత వారికి ఆసరా పెన్షన్‌ కూడా మంజూరు చేయాలని సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం అంగన్వాడీల భవిష్యత్తుకు భరోసా ఇస్తుందని అన్నారు.

Spread the love