Thursday, May 28, 2026
E-PAPER
Homeజాతీయంసీబీఎస్‌ఈలో డిజిటల్ గందరగోళం

సీబీఎస్‌ఈలో డిజిటల్ గందరగోళం

- Advertisement -

భారీ వివాదానికి దారితీసిన ఓఎస్‌ఎం మూల్యాంకనం
తారుమారైన ఆన్సర్‌ ‌షీట్లు, క్రాష్‌ అయిన పోర్టళ్లు
భారీ ఫీజులు, 
హ్యాకింగ్‌ ఆరోపణలు
సంక్ష‍ోభంలోకి దేశంలోనే అతిపెద్ద విద్యాబోర్డు విశ్వసనీయత
మోడీ సర్కారు ‘డిజిటల్‌ ఇండియా’ నినాదం ఇదేనా?
విద్యావేత్తలు, 
నిపుణుల విమర్శలు


​న్యూఢిల్లీ : ఈ ఏడాది సీబీఎస్‌ఈ చేపట్టిన డిజిటల్ మూల్యాంకన సంస్కరణలు విద్యార్థులకు ఉపశమనం ఇవ్వాల్సింది పోయి తీవ్ర ఆందోళనకు కారణమయ్యాయి. పరీక్ష‍ ఫలితాలపై అనుమానాలు, సాంకేతిక లోపాలు, సమాధాన పత్రాల గందరగోళం, పోర్టల్‌ ‌వైఫల్యాలతో దేశంలోనే అతిపెద్ద విద్యాబోర్డు ఇప్పుడు విశ్వసనీయత సంక్ష‍ోభాన్ని ఎదుర్కొంటోంది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గత కొన్నేండ్లుగా ‘డిజిటల్‌ ఇండియా’ అనే నినాదాలను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వచ్చింది. కానీ సీబీఎస్‌ఈలో చోటుచేసుకున్న పరిణామాలు ఆ ప్రచారాల అసలు స్థితిని బయటపెట్టాయని విద్యా నిపుణులు విమర్శిస్తున్నారు. 2026ను డిజిటల్ ఆధునీకరణ సంవత్సరంగా మార్చాలని భావించిన సెంట్రల్‌ ‌బోర్డ్‌ ఆఫ్‌ ‌సెకండరీ ఎడ్యుకేషన్‌ (‌సీబీఎస్‌ఈ).. ఇప్పుడు తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఈ ఏడాది మొదటిసారిగా క్లాస్‌ 12 బోర్డ్‌ ‌పరీక్ష‍ల కోసం ‘ఆన్‌-స్ర్కీన్‌ ‌మార్కింగ్‌ (ఓఎస్‌ఎం)’ వ్యవస్థను అమలు చేసింది. దాదాపు 98.66 లక్ష‍ల ఆన్సర్‌ ‌షీట్లను స్కాన్‌ ‌చేసి, దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 70 వేల మంది ఎగ్జామినర్లు ఆన్‌‌లైన్‌ ‌ద్వారా మూల్యాంకనం చేశారు. వాస్తవానికి ఈ విధానం వేగవంతమైన మూల్యాంకనం, తక్కువ మానవ తప్పిదాలు, అధిక పారదర్శకతను తీసుకురావాల్సింది. కానీ ఫలితాలు ప్రకటించిన వెంటనే పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. ఈసారి క్లాస్ 12 ఉత్తీర్ణత శాతం 85.2 శాతానికి పడిపోయింది. గతేడాది ఇది 88.39 శాతంతో పోలిస్తే గణనీయమైన తగ్గుదల కావడం గమనార్హం. దీంతో వెంటనే సోషల్ మీడియాలో విద్యార్థుల అసంతృప్తి వెల్లువెత్తింది. ముఖ్యంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్ వంటి సబ్జెక్టుల్లో అనూహ్యంగా తక్కువ మార్కులు వచ్చాయని వేలాది మంది విద్యార్థులు ఆరోపించారు. మొదట ఇది సాధారణ ‘ఫలితాల అసంతృప్తి’గా కనిపించినా… తర్వాత పరిస్థితి మరింత తీవ్రమైంది.

​అసలు సమస్య ఎక్కడ మొదలైంది?
చాలా మంది విద్యార్థులు తమ సమాధానాలు సరిగా పరిశీలించలేదని, స్కాన్ చేసిన ఆన్సర్ షీట్లు బ్లర్‌గా ఉన్నాయని ఫిర్యాదు చేశారు. “రెండేండ్లు కష్టపడి చదివాం. చివరికి బ్లర్ స్కాన్ ఆధారంగా మా భవిష్యత్తు నిర్ణయించబడుతోంది” అంటూ విద్యార్థులు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఒత్తిడిని తగ్గించేందుకు సీబీఎస్‌ఈ ఈ సారి ఒక కొత్త గ్రీవెన్స్ విధానాన్ని ప్రకటించింది. విద్యార్థులు ముందుగా తమ స్కాన్ చేసిన ఆన్సర్ షీట్లను పొందిన తర్వాతే రీ-వెరిఫికేషన్ లేదా రీ-ఎవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. కానీ ఇదే మరో సంక్షోభానికి దారితీసింది.

​రికార్డు స్థాయిలో 
స్కాన్ కాపీల కోసం దరఖాస్తులు
ఈసారి దాదాపు ప్రతి నలుగురిలో ఒకరు తమ ఆన్సర్ షీట్ల కాపీల కోసం దరఖాస్తు చేసినట్టు సమాచారం. ఇది కేవలం మార్కుల అసంతృప్తి కాదనీ, బోర్డు మూల్యాంకనంపై విద్యార్థుల నమ్మకం దెబ్బతిన్నదనే సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక వేల సంఖ్యలో దరఖాస్తులు రావడంతో సీబీఎస్‌ఈ పోర్టల్ వరుసగా క్రాష్ అయింది. పేమెంట్లు ఫెయిల్ కావడం, అప్లికేషన్లు మధ్యలో నిలిచిపోవడం, కొందరికి ఒకే ఫీజు పలుమార్లు కట్ కావడం వంటి సమస్యలు ఎదురయ్యాయి.

​తారుమారైన ఆన్సర్ షీట్ ఘటన
ఈ వివాదంలో ఒక ఘటన కీలకంగా మారింది. క్లాస్ 12 విద్యార్థి వేదాంత్ తన ఫిజిక్స్ ఆన్సర్ షీట్ స్థానంలో మరో విద్యార్థి సమాధాన పత్రం తన రోల్ నంబర్‌కు అప్‌లోడ్ అయిందని ఆరోపించాడు. ఈ విషయం వైరల్ కావడంతో సీబీఎస్‌ఈ విచారణ జరిపి తప్పు జరిగిందని అంగీకరించింది. తర్వాత సరైన ఆన్సర్ షీట్‌ను అప్‌లోడ్ చేసింది. ఈ ఘటనతో విద్యార్థుల్లో భయం మరింత పెరిగింది.

​హ్యాకింగ్ ఆరోపణలతో కలకలం
ఓ విద్యార్థి తనను ‘ఎథికల్ హ్యాకర్’గా పేర్కొంటూ చేసిన ప్రకటనలు కలకలం సృష్టించాయి. కేవలం 30 నిమిషాల్లో సీబీఎస్‌ఈ మూల్యాంకన వ్యవస్థలోకి ప్రవేశించానని ఆయన చెప్పాడు. ఎగ్జామినర్ స్థాయి ఫంక్షన్లను యాక్సెస్ చేయగలిగానని, మూల్యాంకన వివరాలను మార్చగలిగానని ఆయన పేర్కొన్నాడు. అయితే సీబీఎస్‌ఈ ఈ ఆరోపణలను ఖండించింది. కేవలం టెస్టింగ్ వాతావరణం మాత్రమే ప్రభావితమైందని స్పష్టం చేసింది. అయినప్పటికీ.. విద్యార్థుల్లో అనుమానాలు మాత్రం తగ్గలేదు. ఇక ఈ మొత్తం వివాదంలో హైదరాబాద్‌కు చెందిన ‘కోఎంప్ట్ ఎడ్యూటెక్’ అనే సంస్థ పేరు కూడా చర్చకు వచ్చింది. డిజిటల్ మూల్యాంకన వ్యవస్థలో భాగస్వామ్యంగా పనిచేసిన ఈ సంస్థపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పటివరకు ఆ సంస్థపై అధికారికంగా ఎలాంటి తప్పిదమూ నిర్ధారణ కాలేదు. కానీ దేశంలోనే అతిపెద్ద విద్యా బోర్డు ఇంత పెద్ద స్థాయిలో డిజిటల్ మార్పునకు నిజంగా సిద్ధంగా ఉందా? అనే ప్రశ్నలు మాత్రం సర్వత్రా కొనసాగుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -