– కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు ఆ రెండు పార్టీల కుట్ర : మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు కుట్ర చేస్తున్నాయని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఆ రెండు పార్టీల వైఫల్యాలకు నిరసనగా ఈనెల 14న కరీంనగర్‌లో దీక్ష చేయనున్నట్టు వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ నేతలతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో ఓట్లు అడిగేందుకు మోడీకి ఏం హక్కు ఉందని ప్రశ్నించారు. ‘తెలంగాణకు బీజేపీ చేసిందేంటి? కొత్త రాష్ట్రానికి పదేండ్లలో బీజేపీ ఇచ్చిందేంటి? దేశాన్ని అదాని, అంబానీకి అమ్మడం తప్ప మోడీ ఏం చేశారు? బీజేపీని వ్యతిరేకిస్తే ఈడీ, సీబీఐలతో ఇబ్బంది పెడుతున్నారు. రాముడి ఫోటో పక్కన మోడీ ఫోటో ఎలా పెడుతారు. అభివృద్ధి ఏం చేశారని అడిగితే అది పక్కన పెట్టి గాలి కబుర్లు, సొల్లు కబుర్లు చెబుతున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాముడిని రాజకీయాల కోసం వాడుకోవడం తప్ప అని విమర్శించారు. సికింద్రాబాద్‌కు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. చేనేత కార్మికులకు బీజేపీ అన్యాయం చేసిందని విమర్శించారు. ప్రకృతి వైఫరీత్యాలకు నార్త్ ఇండియాలో ఎలా ఆదుకుంటున్నారో, సౌత్ ఇండియాలో కూడా అలాగే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మిషన్ కాకతీయ నీళ్లు ఎటు పోయాయని ప్రశ్నించారు. మేం తాగినమా,? మీరు తాగారా? అని బీఆర్‌ఎస్ నేతలనుద్దేశించి ఎద్దేవా చేశారు. గుర్తింపు కోసమే కొందరు బీజేపీ నాయకులు కాంగ్రెస్ మంత్రులపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేండ్లు మంత్రిగా ఉన్న హరీశ్‌రావు బుద్ధుండే మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించారు. ‘మాకు ఒక్క వేలు చూపిస్తే.. మేం నాలుగు వేళ్ళు చూపెడుతాం’ అని హెచ్చరించారు. రాష్ట్ర ఏర్పడటంపై మోడీ అవహేళన చేశారనీ, తెలంగాణ అమరులను ప్రధాని అవమానించారనీ, అలాంటి బీజేపీకి ఓట్లు ఎలా వేస్తారని ప్రశ్నించారు.