చర్చలే సమస్యలకు పరిష్కారం… నిర్బంధాలు కాదు

Discussion is the solution to problems... Not restrictions– ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలకు ఫ్రీ కరెంట్‌
– శాఖల వారీగా సంఘాలు ఉండాల్సిందే…
– వారితో మంత్రివర్గ ఉపసంఘం చర్చిస్తుంది : ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సమస్యల పరిష్కారానికి చర్చలే మార్గమనీ, నిర్బంధాలతో ఏదో సాధిస్తామనుకుంటే పొరపాటేనని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి అన్నారు. ఆయా శాఖల్లో సంబంధిత అంశాలపై ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతో చర్చించిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టంచేశారు. గత పదేండ్లుగా కేసీఆర్‌ కుటుంబమే సంఘాలకు గౌరవాధ్యక్షులుగా ఉన్నారనీ, సమస్యలు చెప్పుకునే అవకాశంలేక ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారని అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల సమస్యలను కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రం (ఎమ్‌సీహెచ్‌ఆర్డీ)లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. వారి సమస్యల పరిష్కారాన్ని కోరుతూ తమపార్టీ మ్యానిఫెస్టోలో పెట్టామనీ, అధికారంలోకి వచ్చాక దానికోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు ఉచితంగా విద్యుత్‌ ఇస్తామనీ, కిందిస్థాయి సిబ్బందిని కూడా నియమిస్తామని చెప్పారు. ఉద్యోగుల డిఏ అంశాన్ని మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. వివిధ శాఖల్లో దాదాపు 1,100 మంది రిటైర్డ్‌ ఉద్యోగులు పనిచేస్తున్నారనీ, వారి కొనసాగింపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉద్యోగుల్లో 95శాతం మంది నిజాయితీగా పని చేస్తున్నారని అన్నారు. ఉద్యోగ సంఘాలపై కక్షకట్టి వాటిని రద్దు చేస్తే…ప్రజలు కేసీఆర్‌ ప్రభుత్వాన్నే రద్దు చేశారని తెలిపారు. తెలంగాణ సమాజమంతా పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుందనీ, దీనిలో విద్యార్ధి, ఉద్యోగ, కార్మిక, యువజన సంఘాల పాత్ర కీలకమైందని చెప్పారు. ఏ ఒక్క రాజకీయ పార్టీతోనో రాష్ట్రం సిద్ధించిందనుకోవడం అసంబద్ధ వాదన అని తేల్చిచెప్పారు. రక్తం చిందించకుండా తెలంగాణ సాధించామని మాజీ సీఎం కేసీఆర్‌ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారనీ, కానిస్టేబుల్‌ కిష్టయ్య రక్తం చిందించారనీ, శ్రీకాంతాచారి మాంసపుముద్దలా మారారంటూ వారి త్యాగాలను సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేసుకున్నారు. తనకు తానే తెలంగాణ బాపుగా కేసీఆర్‌ చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ బాపు సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ అని స్పష్టంచేశారు. రాష్ట్రంలో ఆదాయం గణనీయంగా పడిపోయిందనీ, ఛిద్రమైన ఆర్ధికవ్యవస్థను గాడిలో పెట్టేందుకు రోజుకు 18 గంటలు కష్ట పడుతున్నామని తెలిపారు. ఒక్కో చిక్కుముడి విప్పుతూ ఉద్యోగ నియామక ప్రక్రియను కొనసాగిస్తున్నామన్నారు. మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామనీ, 11వేల టీచర్‌ పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేశామని వివరించారు. ప్రభుత్వం మూడు నెలలే ఉంటుందని కొందరు ప్రకటనలు చేస్తున్నారనీ, తాము అల్లాటప్పాగా అధికారంలోకి రాలేదనీ, తమాషాలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం పదేండ్లు అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తంచేశారు. ప్రతిపక్షనేత కేసీఆర్‌కు ప్రజాస్వామ్యంపై గౌరవం, విశ్వాసం ఉండాలని హితవు పలికారు. గవర్నర్‌తో మాట్లాడి ప్రొఫెసర్‌ కోదండరామ్‌ను శాసనమండలికి పంపుతామనీ, ఆయన ఎమ్మెల్సీగా ఉంటే మండలికే గౌరవమని అన్నారు. కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, సీఎం సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి, టీజేఎస్‌ అధ్యక్షులు ప్రొఫెసర్‌ కోదండరామ్‌, ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షులు సంజీవరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌హెచ్‌జీలకు స్కూల్‌ యూనిఫారాలు
విద్యార్థులకు యూనిఫామ్‌తో పాటు పాఠశాలల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు, పర్యవేక్షణను స్వయం సహాయక మహిళా సంఘాలకు అప్పగించే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి సూచించారు. దీనివల్ల స్కూల్స్‌ పైన నిరంతర పర్యవేక్షణ ఉండటంతో పాటు మహిళలకు ఆర్థికంగా చేయూతను అందించినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు. సమావేశానంతరం అక్కడే అయన విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, పలు సూచనలు చేశారు. ప్రభుత్వ పాఠశాల్లో డిజిటల్‌ తరగతి గదులు ఏర్పాటు చేయాలన్నారు. టీ-శాట్‌ ద్వారా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో డిజిటల్‌ పాఠాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో సోలార్‌ ప్యానెల్ల ఏర్పాటుపై దష్టిసారించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు సీఎస్‌ఆర్‌ ఫండ్స్‌ కోసం ప్రయత్నం చేయాలని, సౌకర్యాలు మెరుగుపరిచేందుకు ఎన్‌ఆర్‌ఐల సహాకారం తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని సూచించారు. వేసవి సెలవులు ముగిసేలోగా పాఠశాలల్లో పనులు పూర్తి చేయాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీపై సమగ్ర అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. స్కిల్‌ యూనివర్శిటీ కోసం ఐఎస్బీ తరహాలో గవర్నింగ్‌ బాడీని ఏర్పాటు చేయాలన్నారు. న్యాక్‌ పై పూర్తిస్థాయిలో దష్టిసారించాలన్నారు. సచివాలయం నుంచి కిందిస్థాయి వరకు ఫేషియల్‌ రికగేషన్‌ అటెండెన్స్‌ సిస్టం (ఎఫ్‌ఆర్‌ఎస్‌) తీసుకు వచ్చే యోచన చేస్తున్నామని తెలిపారు.

Spread the love