Monday, July 13, 2026
E-PAPER
Homeజాతీయంమైనారిటీలపై అసమాన ప్రభావం

మైనారిటీలపై అసమాన ప్రభావం

- Advertisement -

‘సర్‌’ ‌తొలగింపులపై యూఎన్‌ ఆందోళన
కేంద్రానికి ముగ్గురు ప్రత్యేక ప్రతినిధుల లేఖ

న్యూఢిల్లీ : భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) దేశవ్యాప్తంగా చేపట్టిన సర్‌ ప్రక్రియపై అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్నది. ఈ ప్రక్రియలో భాగంగా దేశంలో కోట్లాది ‌మంది ఓటర్ల పేర్లు తొలగిపోవటంతో పాటు మైనారిటీ వర్గాలు, ముఖ్యంగా ముస్లింలు అసమానంగా ప్రభావితమయ్యారనే ఆరోపణలపై ఐక్యరాజ్యసమితి (యూఎన్‌) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు యూఎన్‌‌కు చెందిన ముగ్గురు ప్రత్యేక ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ అంశంపై తమకు అందిన సమాచారంపై ఆందోళన వ్యక్తం చేస్తూ వివరణ కోరారు. యూఎన్‌‌కు చెందిన ముగ్గురు ప్రత్యేక ప్రతినిధులు భారత ప్రభుత్వానికి పంపిన అధికారిక సమాచారంలో ‘సర్‌’ ప్రక్రియపై 
పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఎన్నికల జాబితాల సర్‌ ప్రక్రియలో జాతి, మత, భాష, మైనారిటీలు, ముఖ్యంగా ముస్లిం సమాజం ఎక్కువగా ప్రభావితమైనట్టు తమకు సమాచారం అందిందని పేర్కొన్నారు. ఈ లేఖలో ప్రధానంగా ఏప్రిల్‌లో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు
చేపట్టిన సర్‌ ప్రక్రియను ‌వారు ప్రస్తావించారు. అలాగే గతేడాది బీహార్‌లో నిర్వహించిన ‘సర్‌‌’పై వచ్చిన ఫిర్యాదులు కూడా ఉదహరించారు. పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా నుంచి తొలగించబడిన వారిలో చాలామంది వద్ద చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాలు ఉన్నప్పటికీ, వారికి ఓటు హక్కు వినియోగించే అవకాశం లేకుండా పోయిందని యూఎన్‌ ‌ప్రతినిధులు పేర్కొన్నారు. నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గంలో తొలగించబడిన పేర్లలో 95 శాతం ముస్లిం ఓటర్లవేనని తమకు అందిన సమాచారం ఆధారంగా కేంద్ర ప్రభుత్వానికి యూఎన్‌ ‌ప్రతినిధులు తెలియజేశారు. అయితే దీనిపై కేంద్రం కానీ, ఎన్నికల సంఘం కానీ స్పందించలేదు. ఇప్పటికే వివాదాస్పద సర్‌‌పై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనడుస్తోంది. సర్‌‌పై ప్రతిపక్ష‍ాల నుంచి వ్యతిరేకత కూడా వస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌‌లో నిర్వహిస్తున్న సర్‌ అంశం యూఎన్‌‌కు చేరడం, దానిపై సంస్థ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేయడంతో అంతర్జాతీయ సమాజంలో దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -