ఆమె మొదటిసారి నా గదికి వచ్చిన రోజు.. నేను అసలు సహజంగా ఉండలేకపోయాను. వేలమంది ముందు సభల్లో మాట్లాడేటప్పుడు కూడా అంత టెన్షన్ రాదు. కానీ ఆమె నా వ్యక్తిగత ప్రపంచంలోకి అడుగుపెడుతుందనగానే.. ఎందుకో గుండె తన రిథమ్ మార్చేసింది.
నా గది పెద్దదేమీ కాదు. కానీ అది నా ఆలోచనలతో నిండిపోయిన ప్రపంచం. గోడలకు ఆనించి సర్దిన అలమారల్లో పుస్తకాల వరుసలు… సాహిత్యం, రాజకీయాలు, కవిత్వం, చరిత్ర… ప్రతి విభాగం ఒక ప్రత్యేక ఆలోచనా లోకం. గదిలో చిన్న సోఫా. సాదాసీదాగా ఉన్నా, దానిలో కూర్చుంటే అలసట తేలికగా కరిగిపోతుంది. దాని ఎదురుగా తక్కువ ఎత్తులోని టీ పారు. కొన్ని పుస్తకాలు, ఒక కాఫీ కప్పు, కొన్ని మిగిలిపోయిన ఆలోచనలు. కిటికీ పక్కన వర్షాన్ని చూస్తూ కూర్చోవడానికి ఒక కుర్చీ. ఒక మూలలో సింగిల్ బెడ్.. చదువు తర్వాత నిశ్శబ్దంగా పడుకుని ఆలోచనలు సర్దుకునే స్థలం. గోడపై చె గువేరా పోస్టర్. దాని పక్కన కొన్ని సూక్తులు. అవి అలంకరణలు కాదు… ఒక దక్పథానికి గుర్తులు. ఆమె లోపలికి అడుగుపెట్టి ఒకసారి చుట్టూ చూసింది.
”ఇక్కడ నువ్వు చాలా ఎక్కువగా కనిపిస్తున్నావు రామ్…” అంది. ఆ మాటలో విమర్శ లేదు. ఒక అంచనా మాత్రమే. నా లోపల ఏదో సాఫీగా కదిలింది. ఆమె పుస్తకాల దగ్గరకు వెళ్లింది. ఒక్కోటి తిప్పి చూస్తోంది. మార్క్స్… శ్రీశ్రీ… నెరుడా… మహాశ్వేతాదేవి… చలం… ఫైజ్..
”నువ్వు నిజంగానే ఇవన్నీ చదువుతావా?” అంది. ”కొన్నింటిని చదువుతాను… కొన్నింటిని ప్రేమిస్తాను.. కొన్నింటిలో దాక్కుంటాను.”
ఆమె నన్నే చూస్తూ సోఫాలో కూర్చుంది.
”నిన్ను అర్థం చేసుకోవాలంటే ఈ పుస్తకాలన్నీ చదవాలేమో” అంది నవ్వుతూ. ”లేదు… కొద్దిసేపు నా దగ్గరగా ఉంటే చాలు”… ఆ వాక్యం తర్వాత గదిలో మాటల కంటే శ్వాసలే ఎక్కువగా వినిపించాయి. బయట వర్షం మొదలైంది. కిటికీ అద్దంపై చినుకులు నెమ్మదిగా జారుతున్నాయి. ఆమె లైట్ ఆన్ చేసి చుట్టూ చూసింది. తర్వాత నా డైరీ వైపు చూపించింది.
”ఇది చదవొచ్చా?”
”చదవచ్చు.. కానీ అందులో నన్ను కొంచెం ఎక్కువగా చూస్తావు.”
డైరీ తెరిచింది. కొన్ని పేజీలు చదివింది. తర్వాత ఒక్కసారిగా ఆగిపోయింది. ”ఏమైంది?” అన్నాను. ఆమె తలెత్తి నన్ను చూసింది.
”నువ్వు బయటకు కనిపించేదానికంటే… లోపల చాలా ఒంటరి మనిషివి రామ్.”
ఆ మాటకు నేను బదులివ్వలేకపోయాను. బయట వర్షం మరింత గట్టిగా పడుతోంది. అంతలో కరెంట్ పోయింది. గది ఒక్కసారిగా చీకటిలోకి వెళ్లిపోయింది. ఆమె చిన్నగా నవ్వింది.
”ఇది కూడా నీ ప్లాన్‌లో భాగమేనా?”
”నా ప్లాన్‌లో చీకటి ఉండదు…” అన్నాను. కొవ్వొత్తి వెలిగించాను. మసక వెలుతురు గదిలో నెమ్మదిగా విస్తరించింది. ఆమె సోఫా అంచున కూర్చుంది. నేను ఎదురుగా నిలబడ్డాను. ఆ తర్వాత మాటలు ఆగిపోయాయి. ఆ మౌనంలో వర్షం మాత్రమే మాట్లాడుతోంది.
”నీ గదిలో ఒక సమస్య ఉంది రామ్..” అంది ఆమె.
”ఏంటి?”
ఆమె నా దగ్గరికి వచ్చి నా చొక్కా కాలర్‌ను సరిచేసింది. ఆ స్పర్శలో తొందర లేదు. ఒక అవగాహన ఉంది.
”ఇక్కడ నిశ్శబ్దం చాలా గట్టిగా ఉంది.”
”అవునా?”
”అవును.. కొన్ని నిశ్శబ్దాలు మనుషుల్ని దగ్గర చేస్తాయి. కొన్ని దూరాలను అలాగే ఉండనివ్వవు..” అంటూ ఒక అడుగు వెనక్కి వెళ్లింది. తర్వాత మళ్ళీ దగ్గరికి వచ్చింది.. ఈసారి స్పష్టమైన నిర్ణయంతో.
”ఇప్పుడీ దూరం అలాగే ఉంచాలని అనిపించడం లేదు రామ్…” అంది చాలా మెల్లగా. ఆ మాట తర్వాత మేమిద్దరం మునుపటిలా నిలబడలేకపోయాం. ”అయితే ఎందుకు ఆగావు?” అన్నాను. ఆమె చూపు క్షణం పాటు వర్షం వైపు తిరిగింది. తర్వాత మళ్ళీ నా వైపు వచ్చింది.
”నువ్వు కూడా అదే కోరుకుంటున్నావని నాకు తెలుసు కాబట్టి.”
ఆ క్షణంలో నేను ముందుకు వచ్చాను. మధ్యలో ఉన్న చివరి దూరం కరిగిపోయింది. ఆ స్పర్శలో తొందర లేదు. ఎన్నో రోజులుగా సాగుతున్న ఒక సంభాషణ చివరికి తన సమాధానాన్ని చేరుకున్నట్టుంది. ఆమె కళ్ళు క్షణం పాటు వ¶సుకుంది. తర్వాత నెమ్మదిగా నాకు మరింత దగ్గరగా వచ్చింది. ఆమె చేతులు నా మెడ చుట్టూ సున్నితంగా చేరాయి. నేను ఆమెను మరింత హత్తుకున్నాను. బయట వర్షం అదే వేగంతో ఉంది. లోపల మాత్రం సమయం ఆగిపోయింది. కొద్దిసేపటికి ఆమె నా ఛాతీకి తల ఆనించి అంది..
”తెలుసా రామ్.. నీ గదిలోకి వచ్చిన తర్వాత బయటకు వెళ్లాలనే ఆలోచన తగ్గిపోతోంది.”
నేను ఏమీ చెప్పలేదు. ఆ మాటను అలాగే ఉండనిచ్చాను. కొవ్వొత్తి వెలుతురు గోడలపై మెల్లగా ఊగుతోంది. పుస్తకాలు ఎప్పటిలాగే అక్కడే ఉన్నాయి. కానీ ఇప్పుడు అవి కేవలం పుస్తకాలు కావు. ఇద్దరి మధ్య కరిగిపోయిన దూరానికి సాక్ష్యాలు. ఆ గదిలో ఇప్పుడు నా ఒంటరితనం ఒక్కటే లేదు. ఆమె ఉనికి కూడా ఉంది. అందుకే.. ఆ తర్వాత అది మునుపటిలా అనిపించలేదు. బయట వర్షం నెమ్మదిగా తగ్గుతోంది. కొద్దిసేపు ఇద్దరం అలాగే ఒకరికొకరం దగ్గరగా ఉన్నాం. ఆ క్షణంలో మాటలకు మించి ఏదో మాలో స్థిరపడిపోయింది. బయట వర్షం తగ్గింది. ఆ రాత్రి తర్వాత మేమిద్దరం మునుపటిలా లేమనిపించింది.
నేను డైరీలో ఒక వాక్యం రాశాను.. ”ఇక ఈ గదిలో నేను ఒంటరిని కాను.” ఆమె దాన్ని చదివి కొద్దిసేపు మౌనంగా నిలబడింది. తర్వాత నన్ను చూస్తూ చాలా మెల్లగా అంది.. ”ఇప్పుడు ఇది నీ గది కాదు రామ్… మన గది.” ఆ మాట వినగానే.. గోడలు కూడా కొంచెం దగ్గరైనట్టు అనిపించింది.
రామ్
వర్షంలో కరిగిన దూరం
- Advertisement -
- Advertisement -



