దేశంలోనే అతిపెద్ద విద్యా బోర్డు అయిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఈసారి అమలు చేసిన డిజిటల్ మూల్యాంకన విధానం తీవ్ర వివాదాలకు కేంద్రబిందువైంది. “డిజిటల్ ఇండియా”, “న్యూ ఇండియా”, “టెక్నాలజీ విప్లవం” అంటూ కేంద్ర ప్రభుత్వం చేసే ఆర్భాట ప్రచారానికి భిన్నంగా వాస్తవ పరిస్థితులు మాత్రం దేశ విద్యా వ్యవస్థలోని ప్రమాదకరమైన బలహీనతలను బయటపెట్టాయి. విద్యార్థుల జీవితాలతో నేరుగా సంబంధం ఉన్న పరీక్షా మూల్యాంకన ప్రక్రియను సరైన సన్నద్ధత లేకుండా డిజిటల్ ప్రయోగంగా మార్చడం వల్ల లక్షలాది కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురయ్యాయి.ఈ ఏడాది క్లాస్ 12 బోర్డు పరీక్షల కోసం తొలిసారిగా “ఆన్-స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎం) విధానాన్ని అమలు చేశారు. కోటి సంఖ్యలో సమాధాన పత్రాలను స్కాన్ చేసి దేశవ్యాప్తంగా వేలాది ఎగ్జామినర్లతో ఆన్‌లైన్ మూల్యాంకనం నిర్వహించారు. అధికారికంగా చూస్తే ఇది పారదర్శకత, వేగం, సాంకేతిక ఆధునికత పేరుతో తీసుకొచ్చిన సంస్కరణ. కానీ ఫలితాలు వెలువడిన వెంటనే దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆవేదన వెల్లువెత్తింది.ప్రత్యేకంగా ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, బయాలజీ వంటి సబ్జెక్టుల్లో అనూహ్యంగా మార్కులు తగ్గిపోయా యని వేలాది మంది విద్యార్థులు ఆరోపించారు. “రెండేళ్లు కష్టపడి చదివాం… కానీ బ్లర్ అయిన స్కాన్‌ల ఆధారంగా మా భవిష్యత్తును తీర్పు చెప్పారు” అంటూ విద్యార్థులు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు.
ఈసారి ఉత్తీర్ణత శాతం గణనీయంగా పడిపోవడం కూడా అనుమానాలకు బలం చేకూర్చింది.అసలు సమస్య సాంకేతికతలో కాదు, దాన్ని అమలు చేసే ప్రభుత్వ ధోరణిలోనే ఉందని నిపుణులు చెబుతున్నారు. లక్షలాది ఆన్సర్ షీట్లను స్కాన్ చేసే ప్రక్రియలో నాణ్యత నియంత్రణ లేకపోవడం, పోర్టల్ సామర్థ్యం తక్కువగా ఉండటం, ఎగ్జామినర్లకు తగిన శిక్షణ లేకపోవడం వంటి అంశాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. “డిజిటల్” అనే పేరుతో వ్యవస్థను ప్రకటించడం సులువు. కానీ దాన్ని ప్రజల నమ్మకాన్ని దెబ్బతీయకుండా అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత. అదే బాధ్యతలో సీబీఎస్ఈ విఫలమైంది.రికార్డు స్థాయిలో విద్యార్థులు రీ-వెరిఫికేషన్, ఆన్సర్ షీట్ కాపీల కోసం దరఖాస్తు చేయడం సాధారణ విషయం కాదు. ఇది విద్యార్థుల్లో బోర్డుపై పెరుగుతున్న అనిశ్చితికి నిదర్శనం. పోర్టళ్లు వరుసగా క్రాష్ కావడం, ఫీజులు పలుమార్లు కట్ కావడం, అప్లికేషన్లు మధ్యలో ఆగిపోవడం వంటి ఘటనలు “డిజిటల్ ఇండియా” ప్రచారానికి అసలు అద్దం పట్టాయి. ప్రభుత్వ ప్రకటనల్లో కనిపించే సాంకేతిక విజ్ఞానం, ప్రజల అనుభవాల్లో మాత్రం గందరగోళంగా మారుతోంది.ఇక తారుమారైన ఆన్సర్ షీట్ ఘటన పరిస్థితిని మరింత దిగజార్చింది.
ఒక విద్యార్థి రోల్ నంబర్‌కు మరో విద్యార్థి సమాధాన పత్రం అప్‌లోడ్ కావడం చిన్న పొరపాటు కాదు. ఇది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్నట్టే. తర్వాత సీబీఎస్ఈ తప్పును అంగీకరిం చినా… అప్పటికే వేలాది కుటుంబాల్లో భయం వ్యాపించింది. “మా ఆన్సర్ షీట్ నిజంగానే మాదేనా?” అనే అనుమానం విద్యార్థుల్లో పెరిగింది.హ్యాకింగ్ ఆరోపణలు పరిస్థితిని మరింత ఆందోళనకరంగా మార్చాయి. ఒక విద్యార్థి తాను కేవలం అరగంటలో మూల్యాంకన వ్యవస్థలోకి ప్రవేశించానని చెప్పడం దేశ విద్యా భద్రతపైనే ప్రశ్నలు లేవనెత్తింది. సీబీఎస్ఈ ఈ ఆరోపణలను ఖండించినా, విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఉన్న అనుమానాలు తొలగలేదు. ప్రజల వ్యక్తిగత డేటా, విద్యా రికార్డులు ఎంత భద్రంగా ఉన్నాయన్న ప్రశ్న ఇప్పుడు మరింత తీవ్రమైంది.ఈ మొత్తం వ్యవహారం మరో ప్రమాదకర ధోరణిని కూడా బయటపెట్టింది. ప్రభుత్వ విద్యా వ్యవస్థలను బలోపేతం చేయకుండా, ప్రైవేట్ ఎడ్యూటెక్ కంపెనీలు, కార్పొరేట్ సాంకేతిక వ్యవస్థలపై ఆధారపడటం పెరుగుతోంది. విద్యను హక్కుగా కాకుండా మార్కెట్ ఉత్పత్తిగా మార్చే విధానాల ఫలితమే ఈ పరిస్థితి.
సాంకేతికతను విద్యలో ఉపయోగించడం తప్పు కాదు. కానీ విద్యార్థుల భవిష్యత్తును కార్పొరేట్ ప్రయోగాలకు అప్పగించడం ప్రమాదకరం.ఇది కేవలం సాంకేతిక వైఫల్యం మాత్రమే కాదు. ఇది దేశ విద్యా విధాన దిశను ప్రశ్నించే సంఘటన. విద్యార్థులను “డేటా”గా చూసే విధానం, ఉపాధ్యా యుల పాత్రను తగ్గించే విధానం, ప్రభుత్వ బాధ్యతలను ప్రైవేటు కంపెనీలకు అప్పగించే విధానం ఇవన్నీ కలిసి ఇప్పుడు విద్యా వ్యవస్థను సంక్షోభంలోకి నెడుతున్నాయి. మోడీ ప్రభుత్వం “డిజిటల్ ఇండియా” పేరుతో ప్రచారం చేస్తున్న అభివృద్ధి నమూనా వాస్తవానికి ప్రజల అనుభవాల్లో ఎంత బలహీనంగా ఉందో సీబీఎస్ఈ ఘటన మరోసారి నిరూపించింది. ప్రజా వ్యవస్థలను బలోపేతం చేయకుండా కేవలం యాప్‌లు, పోర్టళ్లు, ప్రకటనలతో దేశం ముందుకు సాగదు. ముఖ్యంగా విద్య వంటి అత్యంత కీలక రంగంలో ప్రయోగాలు కాదు, బాధ్యతాయుతమైన విధానాలు అవసరం.విద్యార్థుల భవిష్యత్తు ప్రభుత్వ ప్రచార నినాదాల కంటే గొప్పది. “డిజిటల్ ఇండియా” నిజంగా ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవాలంటే ముందుగా విద్యా వ్యవస్థలో పారదర్శకత, బాధ్యత, మానవీయ దృక్పథం ఉండాలి. లేకపోతే ఈ డిజిటల్ సంస్కరణలన్నీ కార్పొరేట్ ప్రకటనలుగానే మిగిలిపోతాయి.
టి.నాగరాజు
9490098292



