Saturday, June 13, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిగందే నాలేమే కీడే

గందే నాలేమే కీడే

- Advertisement -

గందేనాలేమే కీడే అని హీరో అమితాబ్ ను ఓ విలన్ తిడతాడు ఓ సినిమాలో. ఇక మురికివాడలో పుట్టి, పెరిగి, కష్టాలెన్నో పడుతూ కూలీనాలీ చేసుకొని బతుకు భారంగా గడుపుతున్న ఆ మనిషికి కోపం రాదా? వస్తుంది వచ్చితీరాలి కూడా. ఒక సాటి మనిషిని ఇంకొక మనిషి ఇంతమాట అనేయగలడా, అదీ చదువుకున్న వాడు, పెద్దపెద్ద వ్యాపారాలు చేస్తున్నవాడు ఎంతమాట అన్నాడు, అసలలా అనగలడా అన్న అనుమానం ఎక్కడో ఉండింది. అది పటాపంచలైపోయింది ఇప్పుడు. ప్రస్తుతానికొస్తే యువకులను బొద్దింకలనడం, పరాన్నజీవులనడం చూస్తుంటే నాజీల మాటలు కూడా అలాగే ఉండేవన్న విషయం గుర్తొస్తుంది. వాళ్ళూ సేం టు సేం యువకులను బొద్దింకలన్నారు. ఆంగ్లేయులు ఒకటేసారి మనల్ని కుక్కలు అన్నారు. రెండూ తప్పే. సరే నాజీలు వాళ్ళను వాళ్ళు అనుకున్నారు, మనల్ని అనింది తెల్లోళ్ళు అనుకుంటే ఇప్పుడు మనోళ్ళు మన యువతనే బొద్దింకలనడం దారుణం బాధాకరం. అందుకే యువత సి.జె.పి, కాక్రోచ్ జనతా పార్టీ అనిపెట్టుకొని కోటి, కోటిన్నర, ఇప్పుడు రెండుకోట్లు దాటిన సభ్యత్వంతో దూసుకుపోతున్నది. అబ్బే అది అంత సంఖ్యలో లేదని బుకాయిస్తున్నారు కొందరు. బి.బి.సి వాళ్ళే రెండుకోట్లు దాటిందని నిర్ధారించారు. ఇక మన మీడియా సంగతి మనకు తెలుసు, కొందరు మినహా నిజాలు రాయడానికి అందరూ ముందుకు రారు. ఈ బొద్దింకల పార్టీ విషయంలో కూడా ఇదే జరుగుతోంది. బొద్దింకలకున్న ధైర్యం మీడియా, పత్రికల అధినేతలకు లేదు.

సి.జె.పి మ్యానిఫెస్టో చూస్తే యువతని బొద్దింకలన్న పెద్దమనిషి కూడా బిత్తరపోవాలి. ప్రభుత్వ పదవులు, పార్టీ ఫిరాయింపులు ఇలా కొన్నింటిపైన స్పష్టమైన అవగాహనతో ముందుకు పోతున్నారు. వీళ్ళవెనక ఫలానా పార్టీవాళ్ళున్నారు అందుకే ఇదంతా ప్రచారమవుతోంది, దీన్ని నమ్మకండి అని కొందరు పెద్దలు చెప్పినా సత్యమేమో వాళ్ళకీ తెలుసు. బొద్దింకలు, కీచురాళ్ళు, దోమలు, ఈగలు, సాలెపురుగులు, పీతలు, తేనెటీగలు, జిరిటెలు, జీకంటెలు, కందిరీగలు, మిడుతలు ఇలా ఎన్నోరకాల కీటకాలు సమావేశమైనాయి. కారణం బొద్దింకల్ని అవమానకరంగా, “అన్యాయం”గా ఆడిపోసుకోవడమొకటైతే, ఇన్ని కీటకాలుండగా ఒక్క బొద్దింకనే పేర్కొనడంవల్ల దానికి వచ్చిన ఖ్యాతి తమకు రాలేదేనన్న దుగ్ధ ఒకవైపు. ఇంతలో బొద్దింకల లీడర్ లేచి, మిత్రులారా మమ్మల్ని అన్నా, ఇతర కీటకాలని అన్నా మొత్తంగా మనందరినీ అన్నట్టే. కాబట్టి ఇక్కడ ఎవరి పేరొచ్చింది, పార్టీ ఎవరిపేరున ఉంది అన్నది పక్కనబెట్టి మన కీటకాలందరమూ ఈ పార్టీని బలోపేతం చేయాలి. చిన్న జీవులమని మనల్ని పరాన్నజీవులమని అనడం అన్యాయం. ఈ ప్రపంచంలో ప్రతి జీవికి ఒక ప్రత్యేకమైన పని ఉంటుందని తెలియనివాళ్ళు కాదు వీళ్ళు. ఇలా ఎన్నో జీవ జాతుల్ని, వృక్షజాతుల్ని నాశనం చేసి, చెట్లను నరికేసి, కొండల్ని కొట్టేసి భూమిపైన ఉష్ణోగ్రతని పెంచుతున్నారు ఈ మానవులు. మనం ఈ ప్రకృతిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుంటాం.

అలాగే సి.జె.పి కూడా సమాజంలోని కుళ్ళును కడగడానికి సిద్ధమయ్యింది. దానికి మనం గర్వించాలి కాలి, అందరం సమిష్టిగా ఉండి మానవులకు కూడా మంచి సందేశమివ్వాలి. అదొక్కటేకాదు బురదలో పుట్టిన కొన్ని జీవులు, పువ్వులు పవిత్రమైనప్పుడు మనమూ అంతకన్నా పవిత్రులమని మరవకండి. ఎక్కడికక్కడ ఎండగట్టండి. అసలు గందేనాలేమే కీడే ఉండేది మురుగు కాలువల్లోనో, మహానగరాల చివరలో ఉండే మురికికూపాల్లోనో ఉండవు. మంచి మంచి భవనాల్లో, చదువుకున్న జనాలమెదళ్ళలోనే అవి నివశిస్తున్నాయని ఇప్పుడర్ధమైపోయింది. అసలు మనిషి శరీరంనుండైనా, ఏ ప్రాణి శరీరంనుండైనా వ్యర్ధపదార్ధాలు బయటకు పోవలసిందే. ఇప్పుడు మెదళ్ళలోని గలీజును తొలగించాల్సిన సమయం వచ్చింది. అంతెందుకు సెల్లుఫోన్లు, ట్యాబులు, ల్యాప్‌టాపులు, కంప్యూటలు, ప్రింటర్లను కూడా ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తుండాలి. ప్రకృతిలో ఇది సహజంగా జరుగుతోంది. పళ్ళుతోముకునే బ్రష్షు, స్నానంచేసే సబ్బు ఎంత ముఖ్యమో ఫినాయిలు, చీపుర్లు కూడా అంతే ముఖ్యం.

సార్ సార్ సాంబారులో బొద్దింక పడింది, సర్వర్ గబగబా వచ్చి మేనేజరుతో చెప్పాడు. బతికిందా? అన్న ప్రశ్నకి అవునన్నాడు సర్వర్ . బతుకుతుందయ్యా బతుకుతుంది, నన్ను చంపేవరకు బతుకుతుంది. రాత్రంతా ఒకటే కల బొద్దింకల కల. వేలు లక్షల బొద్దింకలు మనకు ఊపిరాడకుండా చేస్తున్నట్టు. చిన్నప్పుడు చదివిన మల్లాది నవల నత్తలు గుర్తొస్తోంది. మన ఓనరేమో హిట్ పార్టీలో ఉంటానని వద్దన్నా వినకుండా ఉన్నాడు. నాకు తెలిసి ఏ హిట్టులు ఈ బొద్దింకల్ని ఏమీ చేయలేవనిపిస్తోంది. పోయేకాలమొస్తే ట్రంపంతటివాడినే రక్షించలేరని తెలుస్తూనే ఉంది. ఈ హిట్టులన్నీ ఫట్టవుతాయి బొద్దింకల దండుముందు. అదీకాక ఈ బొద్దింకలతో పాటు కీటకాలన్నీ ఐక్యమవుతున్నాయన్న సమాచారమొస్తోంది.

జంధ్యాల రఘుబాబు 9849753298

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -