జిల్లా ఎంపీ సీటు బీఆర్ఎస్ దే: జీవన్ రెడ్డి

నవతెలంగాణ – ఆర్మూర్
ఒక్క ఆర్మూర్ నియోజకవర్గంలోనే లక్ష ఓట్ల మెజార్టీ ఇచ్చి నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కు అఖండ విజయం చేకూరుస్తామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న  బాజిరెడ్డి గోవర్ధన్ విజయాన్ని కాంక్షిస్తూ  ఆర్మూర్ లో గురువారం జరిగిన నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..నిజామాబాద్ ఎంపీ సీటు బీఆర్ఎస్ దేనని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా వంచకకాంగ్రెస్, రైతు ద్రోహి బీజేపీలకు శృంగభంగం తప్పదన్నారు.ఇక్కడి ఎంపీ అరవింద్ ఒక ఫాల్స్, ఫేక్,ఫ్రాడ్. పసుపుబోర్డు తేకుండా రైతులను నిలువునా ముంచిన వంచకుడు. ఎంపీగా ఆర్మూర్ కు నయా పైస పని చేయలేదు. ఒక్క పేదవాడికి ఇల్లు కట్టివ్వలేదు. ఏనాడూ ప్రజలను కలిసిందిలేదు. వారి బాగోగులు చూసింది లేదు. అలాంటి సైకో అరవింద్ ను ఈ ఎన్నికల్లో  తరిమికొట్టుడే. కోరుట్ల ప్రజలు అరవింద్ కు గట్టి బుద్ధి చెప్పారు. ఇక కాంగ్రెస్ అభ్యర్ధి జీవన్ రెడ్డికి ఇక్కడ పనేమిటి?. జగిత్యాలలో చెల్లని రూపాయి నిజామాబాద్ లో చెల్లుతుందా?. అసెంబ్లీఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు బుట్ట దాఖల య్యాయి. గ్యారంటీలు,వారంటీలు పోయి ఇప్పుడు ఓట్ల మీద ఒట్లు పెట్టుకుంటున్నారు. చెప్పుకోవడానికి ఏమీ లేక బీఆర్ఎస్ పై తిట్ల పురాణం మొదలుపెట్టారు. ప్రజలు,రైతులు,మహిళల్ని మోసం చేసినట్టే దేవుళ్లను కూడా మోసం చేస్తున్నరు. రైతుబంధు 15వేలకు పెంచలేదు. కేసీఆర్ అమలు చేసిన 10వేలు చాలామంది రైతులకు ఇవ్వలేదు.
కళ్యాణలక్ష్మీ లేదు. తులం బంగారం హామీ నెరవేర్చడం లేదు. గృహిణులకు ఇస్తామని హామీ ఇచ్చిన రూ. 2500 లేవు. రైతుల రుణమాఫీ గంగలో కలిసింది.  కరెంట్ కోతలు ప్రజలకు వాతలు పెడుతున్నాయి. తాగేందుకు గుక్కెడు నీళ్లు లేవు. సాగునీళ్ళు లేక భూములు ఎండిపోయాయి.దీంతో ప్రజలు, రైతులు,మహిళలు ప్రభుత్వంపై చాలా కోపంతో ఉన్నరు. ఈ విధంగా అందరికి తీవ్ర అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఆర్మూర్ కు పట్టిన అష్టదరిద్రం ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి అని ఆయన మండిపడ్డారు. నియోజకవర్గ అభివృద్ధికి ఏమాత్రం పాటుపడటం లేదన్నారు. ఒక్క రూపాయికే ఉచిత వైద్యం అందిస్తానన్న హామీ ఏమైందని నిలదీశారు. కనీసం ఒక్క అనారోగ్య బాధితుడినైనా రాకేశ్ రెడ్డి ఆదుకోలేదన్నారు. తన హాయంలోనే ఆర్మూర్ లో అద్భుత అభివృద్ధి జరిగిందన్నారు. కనీవినీ ఎరుగనిరీతిలో నియోజకవర్గాన్ని  అభివృద్ధి చేశా. 62 వేల మందికి రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం అందించాం. ఆర్మూర్ లో వివిధ కులాలకు 17 ఫంక్షన్ హాళ్ల నిర్మాణం చేశా.  సిద్ధులగుట్ట కు రూ. 20కోట్లతో ఘాటు రోడ్డు వేయించా రూ.120 కోట్లతో పంచగూడ వంతెన కట్టించి నిజామాబాద్-నిర్మల్ జిల్లాల మధ్య దూరం తగ్గించా. నియోజకవర్గమంతా రూ. 500 కోట్లతో రోడ్లు వేయించా. ఆర్మూర్- నిజామాబాద్, నిజామాబాద్- మాక్లూర్ కు రోడ్లు నిర్మించా. ఆర్టీసీ, ఆలూరు, వెల్మల్, నందిపేట్ సహా తొమ్మిదికి పైగా బైపాస్ రోడ్లు వేయించా. ఆర్మూర్ కు వంద పడకల ఆసుపత్రి సాధించా. ఇలా నేను చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చెబితే రామాయణమంత.. వింటే భారతమంత అని ఆయన అన్నారు.
బీఆర్ఎస్ కార్యకర్తలు 3-పేజ్ కరెంట్ తీగలు. వారిని ముట్టుకుంటే మాడిమసై పోతారు.
కేసీఆర్ 500-కేవీ సబ్ స్టేషన్, ఎవరైనా టచ్ చేస్తే బ్లాస్టవుతరు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను వేధించే అధికారులను వదిలిపెట్టం. బీఆర్ఎస్ సర్పంచులు చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్నారు. ఇది సరైంది కాదు అని జీవన్ రెడ్డి అన్నారు. పార్టీ కార్యాకర్తలు అధైర్యం చెంద వద్దన్నారు. ఈ ఎన్నికల్లో కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలకు వివరించి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ను గెలిపించే బాధ్యతను తమ భుజాలపై వేసుకోవాలని జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంఛార్జ్,మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు,బోధన్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆయేషా ఫాతిమా షకీల్,జడ్పి ఛైర్మన్ విఠల్ రావు , కూరపాటి అరుణ జ్యోతి ,బిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love