హార్ముజ్ మా నియంత్రణలోనే : ఇరాన్ సైన్యం హెచ్చరిక
వాషింగ్టన్: ఇరాన్-అమెరికా మధ్య కొనసాగు తున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ సైన్యం కీలక వ్యాఖ్యలు చేసింది. అమెరికాతో యుద్ధం ఇంకా ముగియలేదని స్పష్టం చేసింది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ, పరిస్థితిని యుద్ధంగానే పరిగణిస్తున్నామని సైన్య ప్రతినిధి అమీర్ అక్రమినియా తెలిపారు. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రసార సంస్థ, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్‌కాస్టింగ్ (ఐఆర్‌ఐబీ) తెలిపింది. సౖౖెనిక దృక్కోణం నుంచి చూస్తే పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉందని అక్రమినియా తెలిపారు. పరిస్థితి ఇంకా యుద్ధంగానే ఉందని, లక్ష్యాలు, సైనిక సామగ్రి ప్రణాళికలను నవీకరించామని చెప్పారు. ఇది ఇరాన్ సైన్యం పూర్తి సిద్ధతలో ఉందని సూచిస్తుందని పేర్కొన్నారు. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిపై ఇరాన్ పూర్తి నియంత్రణ కలిగి ఉందని ఆయన చెప్పారు. పశ్చిమ భాగాన్ని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నిర్వహిస్తుండగా, తూర్పు భాగాన్ని సాధారణ సైన్యం పర్యవేక్షిస్తోందని వివరించారు. ఎన్ని బెదిరింపులు వచ్చినా, శత్రువులు భూభాగంపై దాడి చేయడానికి ధైర్యం చేయలేదని అక్రమినియా పేర్కొన్నారు. ఇరాన్ భూసేనల సిద్ధత, ఐఆర్‌జీసీతో సమన్వయం కారణంగానే ఇది సాధ్యమైందని చెప్పారు.
భూభాగంపై దాడికి శత్రువులు ధైర్యం చేయలేదన్న వ్యాఖ్య
ఇంటెలిజెన్స్ అంచనాల మేరకు ముందుగానే సైన్యాన్ని దేశవ్యాప్తంగా మోహరించినట్టు అక్రమియా తెలిపారు. ఏదైనా దాడి ఎదురైతే తక్షణ ప్రతిస్పందనకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. విరోధ దేశాలు పలు హెచ్చరికలు చేసినప్పటికీ భూభాగంపై దాడి చేయడానికి ధైర్యం చేయలేదని ఆయన అన్నారు. ఇరాన్ భూసేనల ఉన్నత స్థాయి సిద్ధత, ఐఆర్‌జీసీతో సమన్వయం దీనికి కారణమని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఘటనలో, అమెరికాకు చెందిన శత్రుత్వ విమానంపై ఇరాన్ దళాలు వేగంగా స్పందించాయని తెలిపారు. ఆ చర్యతో శత్రువు ఆపరేషన్ విఫలమైందని అన్నారు. ఇక ఇరాన్ అధికారి మొహమ్మద్ హుస్సేన్ జియాయీనియా దేశం విజయంపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. కచ్చితంగా తామే గెలుస్తామని అన్నారు. ప్రభుత్వానికి, సైన్యానికి ప్రజల మద్దతు బలంగా ఉందని చెప్పారు.
అమెరికా నౌకలను తగలబెట్టేస్తాం : ఐఆర్‌జీసీ వార్నింగ్
అమెరికాకు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్? (ఐఆర్‌జీసీ) గట్టి హెచ్చరికలు చేసింది యూఎస్ తిరిగి సైనిక చర్యలకు దిగితే, పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయని ఐఆర్‌జీసీ నావికాదళానికి చెందిన ఒక సీనియర్ అధికారి తెలిపినట్టు కథనాలు వెలువడ్డాయి. అమెరికా మళ్లీ దాడులకు పాల్పడితే, పశ్చిమాసియా వ్యాప్తంగా ఉన్న ఇరాన్‌కు అనుకూలమైన గ్రూపులు రంగంలోకి దిగుతాయని పేర్కొంది. అమెరికాకు చెందిన భారీ నౌకలను సముద్రంలోనే తగలబెట్టేస్తామని ఐఆర్‌జీసీ హెచ్చరించింది.
మా నౌకల సీజ్ సముద్రపు దొంగతనమే : ఇరాన్
గల్ఫ్ సముద్ర జలాల్లో తమ దేశ నౌకలను సీజ్ చేయడం ద్వారా అమెరికా సముద్రపు దొంగతనాని(పైరసీ)కి పాల్పడుతోందని ఇరాన్ ఆరోపించింది. తమ నౌకలపై సైనిక శక్తిని ప్రయోగించడం ద్వారా అంతర్జాతీయ చట్టాలను అమెరికా కాలరాస్తోందని, నేరపూరిత చర్యలకు పాల్పడుతోందని పేర్కొంది. దీనిపై ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్‌తో భద్రతా మండలికి యూఎన్‌లోని ఇరాన్ రాయబారి అమీర్ సయ్యిద్ ఇరావని ఫిర్యాదు చేశారు. ఈమేరకు సమాచారంతో కూడిన ఫిర్యాదు లేఖలను ఆయన అందజేశారు. అమెరికా ఇలాంటి కవ్వింపు చర్యలనే కొనసాగిస్తే గల్ఫ్‌లో అంతర్జాతీయ వాణిజ్య నౌకల రాకపోకలకు ముప్పు పెరుగుతుందని హెచ్చరించారు. ఇరాన్ నౌకలను అమెరికా సీజ్ చేయడం అనేది అంతర్జాతీయ వాణిజ్య చట్టాలకు విరుద్ధమని అమీర్ సయ్యిద్ ఇరావని చెప్పారు.



