ఇరకాటంలో ఇరాన్
టెహ్రాన్ : చమురు నిల్వ చేసుకునేందుకు ఇరాన్ వద్ద ఇప్పుడు తగినంత స్థలం లేదు. హార్ముజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ ఓడరేవులను అమెరికా నౌకాదళం దిగ్బంధించడంతో టెహ్రాన్ నుంచి చమురు ఎగుమతులు దాదాపుగా నిలిచిపోయాయి. అదే సమయంలో చమురు క్షేత్రాల నుంచి సరఫరాలు కొనసాగుతూనే ఉన్నాయి. చమురు నిల్వకు అవసరమైన ట్యాంకులు, స్థలం ఇరాన్ వద్ద లేకపోవడంతో పరిస్థితి తీవ్రరూపం దాలుస్తోంది. దీంతో చమురు ఉత్పత్తిని తగ్గించుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. రాబోయే వారాలలో ఉత్పత్తిలో మరింత కోత విధించాల్సి ఉంటుందని విశ్లేషకులు హెచ్చరించారు. అంటే చమురు బావులను మూసివేయాల్సి వస్తుంది. ఫలితంగా దీర్ఘకాలిక ఉత్పత్తి సామర్ధ్యం పడిపోతుంది. ప్రస్తుతం ఇరాన్ వద్ద 12-22 రోజుల నిల్వ సామర్ధ్యం మాత్రమే ఉన్నదని కెప్లర్ అనే పరిశోధనా సంస్థ తాజా నివేదికలో తెలిపింది. ఆ తర్వాత చమురు నిల్వకు అవకాశం ఉండదు కనుక ఉత్పత్తిని నిలిపివేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఇరాన్ నుంచి ముడి చమురు ఎగుమతులు బాగా పడిపోవడమే ప్రస్తుత పరిస్థితికి కారణం.
హార్ముజ్ జలసంధి ఇరాన్ దళాల ఆధీనంలో ఉన్నప్పుడు చమురు ఎగుమతులకు ఎలాంటి ఆటంకం కలగలేదు. అయితే ఇరాన్ ఓడరేవులను లక్ష్యంగా చేసుకొని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిగ్బంధం విధించిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లకు చమురును సరఫరా చేయడంలో ఇరాన్ ఇబ్బంది పడుతోంది. చమురు నిల్వ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు 30 సంవత్సరాల నాటి ట్యాంకర్ ‘నాషా’ను సైతం ఇరాన్ వినియోగంలోకి తేవాల్సి వచ్చింది. విదేశాలకు ఎగుమతి చేసేందుకు నౌకలలో చమురును నింపిన ఇరాన్, ఇప్పుడు తిరిగి దానిని దేశీయ స్టోరేజ్ ట్యాంకులకు మళ్లిస్తోంది. అయితే ఇది తాత్కాలిక పరిష్కారం మాత్రమే. దానికి పరిమితులు ఉన్నాయి. ట్యాంకర్లలో చమురును నింపే ప్రక్రియ కూడా నెమ్మదించింది. ఇరాన్ ప్రస్తుతం రోజుకు రెండున్నర మిలియన్ బ్యారల్స్ ముడి చమురును మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. ప్రాంతీయ ఉత్పత్తిదారులైన సౌదీ అరేబియా, కువైట్, ఇరాక్, యూఏఈ కూడా ఉత్పత్తిలో కోత విధించుకున్నాయి. ఓడరేవుల దిగ్బంధం కారణంగా ఇరాన్ చమురు ఉత్పత్తిని త్వరలోనే నిలిపివేస్తామని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్ మంగళవారం హెచ్చరించారు. అయితే పరిస్థితి ఎంత సంక్లిష్టంగా ఉన్నప్పటికీ ఇరాన్‌పై ఇప్పుడప్పుడే ఆర్థిక ప్రభావం పడబోదని కెప్లర్ సంస్థ తెలియజేసింది.
చమురు నిల్వకు చోటేది?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



