ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రయివేట్ కంపెనీలకు అవకాశం ఇవ్వొద్దు

– వాటికి కేటాయించిన మండలాలను తిరిగి ఆయిల్ ఫెడ్ స్వాధీనం చేసుకోవాలి..
– గత మూడేళ్ళ సరాసరి ఓ.ఈ.ఆర్ నే గరిష్టంగా పరిగణించి ఫార్ములా నిర్ధారించాలి..
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆయిల్ ఫాం సాగు అత్యధికంగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాను ప్రయివేట్ కంపెనీకి కేటాయించొద్దని  తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫాం గ్రోవర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు ఆలపాటి రామచంద్ర ప్రసాద్, కోటగిరి సీతారామస్వామి లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం కేవలం 6 మండలాల్లో మాత్రమే ప్రయివేట్ కంపెనీ సాగును చేపడుతుందని, అవసరమైతే ప్రయివేట్ కంపెనీ పరిధిలో ఉన్న మండలాలను ఆయిల్ఫెడ్ సంస్థ స్వాధీనం చేసుకోవాలని వారు డిమాండ్ చేసారు. మండలంలోని నారంవారిగూడెం సమీపంలో గల ఆయిల్ ఫెడ్ కేంద్రీయ నర్సరీలో ప్రాంగణంలోని డివిజనల్ కార్యాలయంలో శుక్రవారం సంఘం బాధ్యులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయిల్ ఫాం రైతులు ఎదుర్కోంటున్న పలు సమస్యలపై చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఫార్ములా నిర్ణయంలో గడిచిన మూడేళ్ళు గరిష్టాన్ని పరిగణనలోకి తీసుకుని ఓ.ఈ.ఆర్ పర్సంటేజ్ ను ప్రకటించాలని కోరారు. మార్కెట్లో ఆయిల్ విక్రయాలు ఆధారంగా గెలలు ధర నిర్ణయించటం లో మాత్రం ఎటువంటి అభ్యంతరం లేదని,ఓ.ఈ.ఆర్ పర్సంటేజ్ ప్రకటనలో ఆయిల్ ఫాం రైతు సంఘం డిమాండ్ ను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.దీనివల్ల ఆయిల్ ఫాం రైతులకు టన్ను గెలలు ధరలో స్వల్పంగా ధర పెరిగే అవకాశం ఉంటుందని,కనీస భరోసా ధర పామాయిల్ రైతులకు లభిస్తుందని వివరించారు.లేనిపక్షంలో పెరిగిన ధరల తో రైతులు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.పామాయిల్ రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సంఘం విజ్ఞప్తికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు.సమావేశంలో సంఘం బాధ్యులు జూపల్లి కోదండ వెంకట రమణారావు,మొగళ్ళపు చెన్నకేశవరావు,పిన్నమనేని మురళి,మలి రెడ్డి పూర్ణ చంద్రారెడ్డి, బండి భాస్కర్, బుద్దే కోటేశ్వరరావు,కేదాసీ వెంకట సత్యనారాయణ,అంకత మహేశ్వరరావు,దొడ్డ ప్రసాద్, యర్రా వసంతం, తదితరులు పాల్గొన్నారు.
Spread the love