వామపక్షాల పోరాటంతో నాడు యూపీఎ ప్రభుత్వం తెచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) గ్రామీణ భారతావని ఉపాధికి ఎంతగానో భరోసానిచ్చింది. అయితే, దీన్ని నిర్వీర్యం చేయాలన్న కేంద్ర బీజేపీ ప్రభుత్వ ప్రయత్నాలు కొత్తవి కావు. నిధుల కోతలు, వేతనాల చెల్లింపుల్లో జాప్యం, పనిదినాల తగ్గింపు, రాష్ట్రాలపై ఆర్థిక భారం మోపడం వంటి చర్యలతో పదేళ్లుగా ఈ చట్టాన్ని బలహీన పరుస్తూనే వస్తున్నది. ఇప్పుడు ‘వీబీజీ-రామ్‌జీ’ పేరుతో కొత్త వ్యవస్థను తెచ్చి పాత చట్టం స్వరూపాన్నే మార్చింది. హక్కు స్థానంలో దయగా నిలిచే ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా రైతు, కార్మిక, వామపక్ష, ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. కానీ, ఆశ్చర్యకరంగా మన రాష్ట్ర ప్రభుత్వం ‘వీబీజీ-రామ్‌జీని అమలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్తాం’ అని చెప్పడం సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. ఎందుకంటే కేంద్రంపై పోరు సలపకుండా కోర్టు ద్వారా ఒనగూరే ప్రయోజనం శూన్యం. పని అడిగిన ప్రతి గ్రామీణ కుటుంబానికి ఉపాధి కల్పించడం ప్రభుత్వ బాధ్యత. దానికి ‘ఉపాధి హామీ’ హక్కు ఆధారిత చట్టం. అలాంటి చట్టాన్ని కేంద్రం పరిపాలనా ఉత్తర్వులతో మార్చే హక్కు లేదు.
కొత్త పథకం అమలు వల్ల బయోమెట్రిక్ హాజరు, యాప్ ఆధారిత నమోదు, కేంద్రీకృత డేటా నియంత్రణ వంటి నిబం ధనలతో కార్మికులకు కొత్త అవరోధాలు ఏర్పడుతున్నాయి. నెట్‌వర్క్ సమస్యలు, సాంకేతిక లోపాలు, వేలి ముద్రల వైఫల్యం వంటి వాటివల్ల అనేక కుటుంబాలు పని కోల్పోతున్నాయి. పైగా పథకంలోని నిబంధనలు చాలా అస్పష్టంగా ఉన్నాయి. దీని అమలుపై పంజాబ్, కర్నాటక రాష్ర్టాలు బహిరంగంగానే వ్యతిరేకించాయి. జార్ఖండ్ అధికారిక తీర్మానం చేసి వ్యతిరేకించింది. కేరళలోని గత ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం అసెంబ్లీలోనే చర్చకు పెట్టి అమలు చేయబోమని ప్రకటించింది. దీన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. అలాంటప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎందుకు తొందరపడుతోంది? నిజంగా ఈ విధానం రాజ్యాంగ విరుద్ధమని నమ్మితే, దాన్ని అమలు చేయకుండా ఇతర రాష్ట్రాలతో కలిసి కేంద్రంపై రాజకీయ, న్యాయపరమైన పోరాటం చేయాలి. కానీ, అమలు చేస్తూ కోర్టుకు వెళ్తామనడం ప్రజలపక్షాన పోరాడే వైఖరి కాదు, అవకాశవాదమే అవుతుంది.
రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న వాదన ఏమిటంటే, అమలు చేయకపోతే కేంద్రం నిధులు నిలిపివేస్తుందని. కానీ, ఇదే ప్రశ్న గతంలో అనేక కేంద్ర పథకాల విషయంలో వచ్చింది. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తే రాష్ట్రాలు సమిష్టిగా ఎదిరించాయి. అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. కానీ ముందుగా కేంద్రం ఆదేశాలను అమలు చేసి, తరువాత వ్యతిరేకిస్తామని చెప్పిన ఉదాహరణలు చాలా అరుదు. ఈ పథకంలోని కుట్ర నలభై శాతం వాటా రాష్ట్రమే భరించాలనేది. ఇప్పటికే అప్పుల కుప్పతో తిప్పలు పడుతున్న సర్కారు ఎక్కడినుంచి తెచ్చి ఈ భారాన్ని మోస్తుంది? కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకం వ్యతి రేకించాలని ప్రజలకు బహిరంగంగా పిలుపునిచ్చింది. ఇక్కడేమో ఈ విధానాన్ని అనుసరిస్తోంది. ఇదే కాదు, జాతీయ స్థాయిలో బీజేపీని విమర్శిస్తూ, రాష్ట్రంలో మాత్రం కేంద్రం నిర్ణయాన్ని అమలు చేయడాన్ని ఎలా చూడాలి. ఒకవైపు కేంద్రం సమాఖ్య వ్యవస్థను దెబ్బతీస్తోందని ఆరోపించడం, మరోవైపు అదే నిర్ణయానికి తలవంచడం ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తుంది? ఇవి పోరాట రాజకీయాలా? లేక రాజీ రాజకీయాలా? అనే ప్రశ్న ఎదురవుతోంది.
ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏను బలహీనపరచడం వెనుక కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది. గ్రామీణ ఉపాధిపై ప్రభుత్వ బాధ్యతను తగ్గించడం, సంక్షేమ వ్యయాన్ని కుదించడం, కార్పొరేట్ అనుకూల ఆర్థిక విధా నాలకు మరింత స్థలం కల్పించడం దాని లక్ష్యం. గత పదేండ్లుగా బడ్జెట్ కోతలు, పెండింగ్ బిల్లులు, వేతనాల ఆలస్యం ద్వారా ఇదే వ్యూహాన్ని అమలు చేస్తూ వచ్చింది. ఇప్పుడు వీబీజీ రామ్‌జీ ద్వారా సాంకేతికత పేరుతో మరింత కట్టుదిట్టమైన నియంత్రణ తీసుకురావాలని చూస్తోంది. ఇంతటి సంక్షోభం గ్రామీణ వాతావరణాన్ని అలుముకోబోతుంటే ‘మేం కోర్టుకు వెళ్తాం’అని ప్రభుత్వం వాదిస్తే సమస్య తీవ్రతను అర్థం చేసుకోనట్టే. కేంద్రం కుట్రను అడ్డుకోవాలంటే కేవలం కోర్టు కేసులు సరిపోవు. రాజకీయ సంకల్పం, ప్రజా ఉద్యమాలు కావాలి. ఇతర రాష్ట్రాలను కలుపుకుని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. గ్రామీణ పేదల జీవనాధారమైన ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచే ఏ చర్యనైనా బహిరంగంగా తిరస్కరించాలి. అమలును నిలిపివేసి రాజ్యాంగ బద్ధమైన పోరాటానికి సిద్ధమవ్వాలి. కానీ, అమలు చేస్తూ కేంద్రంపై పోరాడుతామంటే బలహీనపడతాము. కేంద్రం ఒత్తిడికి లొంగకుండా ప్రజల పక్షాన నిలబడటమే నిజమైన రాజకీయ ధైర్యం. ఎంజీఎన్ ఆర్‌ఈజీఏ హక్కులను కాపాడే పోరాటంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుండాలి కానీ, బీజేపీ కుట్రకు అమలు యంత్రాంగంగా మారకూడదు. ఇదే ప్రజాస్వామ్యానికి, సమాఖ్య స్ఫూర్తికి, గ్రామీణ భారత భవిష్యత్తుకు అవసరం.
కొమ్ముకాస్తారా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



