బాలింత కడుపులో కత్తెర వదిలేసిన డాక్టర్లు..

నవతెలంగాణ-హైదరాబాద్ : ఏపీలోని ఏలూరు బోధనాస్పత్రి డాక్లర్ల  నిర్లక్ష్యం ఓ మహిళ ప్రాణాలమీదికి తెచ్చింది. బాలింత కడుపులో కత్తెర వదిలేసి కుట్లు వేశారు. దీంతో ఆ మహిళ తీవ్ర ఆనారోగ్యానికి గురైంది. ప్రస్తుతం బాధితురాలు విజయవాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈఘటనపై డాక్లర్లు స్పందించారు. ఈనెల 10న ఏలూరు నుంచి స్వప్న అనే మహిళను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారని వైద్యులు తెలిపారు. సర్జికల్‌ ఫోర్‌సెప్‌ (కత్తెర)ను కడుపులో వదిలేశారని, దాని పరిమాణం రెండు ఇంచులు ఉంటుందన్నారు. కడుపులో వదిలేసిన కత్తెర పేగుకి అతుక్కుని పేగు కుళ్లిపోయిందని వైద్యులు వెల్లడించారు. విజయవాడ ఆస్పత్రికి వచ్చేసరికి రోగి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, కుళ్లిపోయిన పేగుని తీసేసి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నామని తెలిపారు. రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు ప్రభాకర్‌, సర్జరీ విభాగాధిపతి అప్పారావు వివరించారు.
పెదపాడు మండలం ఎస్.కొత్తపల్లి గ్రామానికి చెందిన జి.స్వప్న ప్రసవం కోసం ఏప్రిల్ 19న ఏలూరు బోధనాస్పత్రిలో చేరింది. ఆమెకు సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీశారు. డిశ్చార్జి అయిన తర్వాత స్వప్న ఇంటికి వెళ్లిపోయింది. అయితే, తరచూ ఆమెకు కడుపు నొప్పి వచ్చేది. సాధారణంగా వచ్చే నొప్పే అనుకుని మందులు వాడేది. ఈనెల 8న స్వప్నకు విపరీతమైన కడుపు నొప్పి రావడంతో తిరిగి ఏలూరులోని బోధనాస్పత్రికి వెళ్లింది. అక్కడ వైద్యులు పరీక్షించి విజయవాడ ఆస్పత్రికి సిఫార్సు చేశారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఆమె కడుపులో కత్తెర ఉన్నట్లు ఎక్స్‌రే ద్వారా బయటపడింది. ఏలూరు బోధనాస్పత్రిలో సిజేరియన్ చేసి బిడ్డను బయటికి తీసిన డాక్టర్లు.. ఆపరేషన్‌కు ఉపయోగించిన కత్తెరను కడుపులో ఉంచి కుట్లు వేశారు. దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శశిధర్‌ను వివరణ కోరగా ఈ విషయం వాస్తవమేనని తెలిపారు. ఆస్పత్రిలో జరిగిన సంఘటనపై ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్‌ స్పందించి విచారణ కమిటీ వేశారు.

Spread the love