‘ఓడ ఎక్కినాక ఓడ మల్లయ్య..ఓడ దిగినాక బోడ మల్లయ్య’ అన్నాడట ఎనుకటికొకడు. ఈ సామెత కాంగ్రెస్‌లో కొంతమంది నాయకులకు కరెక్టుగా సరిపోతుందేమో! ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నమ్ముకున్నవారే ఆయనకు ‘చేయి’స్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అధికారం రాకముందు… వచ్చిన తర్వాత ఆయన వెంట నడిచిన వారే ఇప్పుడు మోసం చేస్తున్నారని చర్చలు జోరుగా నడుస్తున్నాయి. సీఎం క్యాంప్ ఆఫీస్‌కు పొద్దున రమ్మంటే, సాయంత్రం వస్తున్నారట. సాయంత్రం రమ్మంటే తీరికగా బయలుదేరుతున్నారట. మొత్తంగా క్యాంప్‌లో ఆయనకు సహాయ నిరాకరణ చేస్తున్నారనేది సీఎం చెప్పకనే చెప్పారు. అంత్యనిష్టూరం కంటే ఆది నిష్టూరం మేలు అనుకున్నారో ఏమో పార్టీ విస్తృత సమావేశంలో ఈ విషయాన్ని వెల్లగక్కారు. ‘నేను ఢిల్లీకి పోతే ఓ ఎంపీ హైదరాబాద్ వస్తున్నారట. నేను హైదరాబాద్‌కు వస్తుంటే ఆయన ఢిల్లీకి పోతున్నారట’ అని ఆవేదన చెందారట! పక్కింటోడికి కూడా తెలియని ఓ యూత్ కాంగ్రెస్ నాయకున్ని రేవంత్‌రెడ్డి ఒక మాటతో ఆయన్ను ప్రపంచానికి పరిచయం చేశారు. ఉత్తమ్‌కు కాకుండా హుజుర్‌నగర్ టికెట్ తన స్నేహితుడికి ఇవ్వాలంటూ రేవంత్‌రెడ్డి బహిరంగ ప్రకటన చేయడంతో ఆయన రాత్రికి రాత్రే నాయకుడయ్యాడు. ఆ మాటతో ఆయనకు నల్లగొండ జిల్లాల్లో రాజకీయ స్పేస్ దొరికింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎంపీ కూడా అయ్యారు. ఇప్పుడేమో ముఖ్యమంత్రికి దొరక్కకుండా తప్పిం చుకుని తిరుగుతున్నారట. ఆయనే కాదు…ఇద్దరు సలహాదారులు, వ్యక్తిగత సహాయకుడి పరిస్థితి కూడా అలాగే ఉందని సీఎం చెప్పకనే చెప్పారనిపిస్తుంది. అపదలో ఉన్నవారి ఫోన్లు కూడా ఎత్తడం లేదనే విమర్శలున్నాయి. సీఎం అందర్ని కలుస్తున్నారన్న పేరుంది కానీ ఆయన అపాయిమెంట్ కావాలంటే ఆ పీఏ కనికరించాల్సిందే. ఆయన కూడా నచ్చిన వారి ఫోన్లు ఎత్తుతారంతే. వారి వైఖరితో ముఖ్యమంత్రిని బద్నాం చేస్తున్నారా? పార్టీలో ఆయన్ను పలచన చేస్తున్నారా? ఆయన ప్రతిష్టకు సొంతవారే భంగం కలిగిస్తున్నారా? సీఎం అక్టివిటీని బీఆర్‌ఎస్, బీజేపీ నేతలకు చేర వేస్తు న్నారా? ఇలాంటి ప్రశ్నలు ప్రజల్ని తొలిచివేస్తున్నాయి. అందుకే కాబోలు ముఖ్యమంత్రి పార్టీ నేతలందరి ముందు తన గోడు వెళ్లబోసుకున్నారనిపిస్తుంది. ఇప్పటికైనా సీఎం బాధను వారు అర్థం చేసుకుంటారో.. లేదో చూడాలి మరి?
– గుడిగ రఘు