ఆగం కావద్దు.. ఆలోచించి ఓటేయండీ

Don't be aghast.. think and vote– ఓటు తలరాత మార్చే ఆయుధం
– గొప్ప ఎజెండాతో ముందుకు పోతున్నం.. బీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించండి: హుస్నాబాద్‌ సభలో సీఎం కేసీఆర్‌
నవతెలంగాణ – మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
”ఎన్నికలు రాగానే ఆగం కావద్దు.. చుట్టపొడు, పక్కింటోడు చెప్పిండని ఓటెయ్యదు.. ఓటు అనేది తలరాతను మార్చే ఆయుధం. స్పష్టమైన అవగాహనతో ఆలోచించి ఓటేయాలి.. గొప్ప ఎజెండాతో ముందుకు పోతున్న బీఅర్‌ఎస్‌ను ఆశీర్వదించి గెలిపించండి” అని బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన తొలి ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్‌ హాజరై మాట్లాడారు. 2018లో హుస్నాబాద్‌ నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి 88 సీట్లు గెలిచామని గుర్తుచేశారు. ఈసారి కూడా హుస్నాబాద్‌ నుంచే ఆచారాన్ని మొదలుపెట్టినందున 100 సీట్లు గెలిచి తీరుతామని తెలిపారు. తొమ్మిదిన్నర ఏండ్ల కిందట నీళ్లు లేవు, నిధులులేవు, కరువు కాటకాలు, వలసలు, కరెంట్‌ లేదు, ఆకలి ఆత్మహత్యలతో బాధపడ్డామని పాత రోజులను గుర్తు చేశారు. తెలంగాణ వచ్చాక బాధ్యతగా ఆర్థిక నిపుణులతో మేధోమదనం చేసి పనిచేయడంతో ఇప్పుడు దేశ తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్‌ వన్‌గా ఉన్నదన్నారు. అంతేకాదు.. తలసరి విద్యుత్‌ వినియోగంలో, మంచినీళ్ల సరఫరాలో, పచ్చదనం, పారిశుధ్య పరిరక్షణలో, పెట్టుబడులు రాబట్టి 25 లక్షల ఉద్యోగాల కల్పనలో తెలంగాణ నెంబర్‌ వన్‌గా నిలిచిందన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకరించక పోయినా ప్రతి పక్షాలు కేసులు వేసి ఆటంకాలు సృష్టించినా అన్నింటినీ అధిగమించి ముందడుగు వెస్తున్నామన్నారు.
పదిసార్లు అధికారమిస్తే ఏం చేశారు..?
కొన్ని పార్టీలు ఒక్క ఛాన్స్‌ ఇవ్వమని అడుగుతున్నాయని.. ఒక్కటేమిటి.. పదిసార్లు అధికారమిస్తే ప్రజలకు ఏం చేశారని నిలదీశారు. 75 ఏండ్లు గడిచినా దళితులు ఇంకా పేదలుగానే ఉన్నారంటే కాంగ్రెస్‌ కారణం కాదా.. అని ప్రశ్నించారు. దళిత బంధు అప్పుడే ఇచ్చి ఉంటే దళితులు ఎప్పుడో బాగుపడేవారన్నారు. పింఛన్లు అనేవి విధి వంచితులు, ఒంటరి మహిళలు, అసరాలేని వృద్ధులకు భరోసా ఇవ్వడమని, అది మాకు సామాజిక బాధ్యత అని తెలిపారు. అందుకే ఈ రోజు పింఛన్‌ను రూ.5 వేలు ఇస్తామని ప్రకటించామన్నారు. నాణ్యమైన కరెంట్‌తో రైతు కంటినిండా నిద్రపోతున్నాడని తెలిపారు. నీళ్లు, కరెంటు ఇవ్వడం వల్ల ఎంత కొలిచినా వడవని వడ్లు పండుతున్నాయన్నారు.
కరువుతో అల్లాడిన హుస్నాబాద్‌ నియోజకవర్గం ఇప్పుడు పచ్చటి పంటలతో కళకళలాడున్నదని చెప్పారు. గౌరవెళ్లి ప్రాజెక్ట్‌ను ఎన్నికలైన మూడు నెలల్లో పూర్తి చేసి నీళ్లిచ్చే బాధ్యత నేను తీసుకుంటానని తెలిపారు. హుస్నాబాద్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సతీష్‌ కుమార్‌ని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి సతీష్‌ కుమార్‌కు సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా బీ ఫామ్‌ అందజేశారు. కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కేశవరావు, మాజీ ఎంపీ వినోద్‌ కుమార్‌, పాతూరి సుధాకర్‌, శ్రీనివాస్‌, సుధీర్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.

Spread the love