నన్ను మేడం అని పిలవొద్దు..

Don't call me madam..– సీతక్క.. అంటేనే ఇష్టం..!
– పదవులు శాశ్వతం కాదు.. విలువలు ముఖ్యం : ప్రజాపాలన ప్రారంభోత్సవంలో సీతక్క
నవతెలంగాణ- ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
”నన్ను మేడం అనొద్దు.. సీతక్క అనే పిలవాలి. అలా పిలిస్తేనే నాకిష్టం.. మేడం అంటే.. దూరం అయిపోతం. సీతక్క అంటేనే మీ అక్క, మీ చెల్లిలాగా కలిసి పోతాం..” అని పంచాయతీరాజ్‌, మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ(సీతక్క) అన్నారు. పదవులు శాశ్వతం కాదని.. విలువలు ముఖ్యమని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని గురువారం ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలం జామ్ని గ్రామంలో ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడి వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడారు. ఇది గడీల పాలన కాదని..గల్లీ బిడ్డల పాలనని గుర్తు చేశారు. అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్‌ లక్ష్యమని, పేదరికాన్ని తరమికొట్టాలంటే సంక్షేమ పథకాలతో పాటు స్వయం ఉపాధి మార్గాలు చూపించాల్సిన అవసరం ఉందని చెప్పారు. చదువుతోనే అభివృద్ధి సాధ్యమని, ప్రతి ఒక్కరూ పిల్లలను ఉన్నతంగా చదివించాలని సూచించారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ఖుష్బూగుప్తా, జైనథ్‌ ఎంపీపీ మార్శెట్టి గోవర్దన్‌, జెడ్పీటీసీ అరుంధతి, డీఆర్‌డీఓ కిషన్‌ పాల్గొన్నారు.

Spread the love