వదలొద్దు ఈ కప్పు

– ఐసీసీ ప్రపంచకప్‌ ఫైనల్‌ నేడు
– మూడో టైటిల్‌పై ఆతిథ్య భారత్‌ గురి
– ఆరో ట్రోఫీ రేసులో ఆస్ట్రేలియా
– మధ్యాహ్నం 2 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
అహ్మదాబాద్‌ మొతెరా మైదానం. 1.30 లక్షల మంది అభిమానులు. బరిలో 21వ శతాబ్దపు అత్యుత్తమ జట్లు. లక్ష్యం ఐసీసీ ప్రపంచకప్‌ టైటిల్‌. ఆతిథ్య భారత్‌ మూడోసారి ఈ కప్పు కొట్టాలని తలపిస్తుండగా, ఆసీస్‌ ఏకంగా సిక్సర్‌ కొట్టేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఓటమెరుగని జైత్రయాత్రతో ఫైనల్లో ఫేవరేట్‌గా భారత్‌ నిలువగా.. ఈ టోర్నీల్లో విజయం సాధించటం తెలిసిన ఆసీస్‌ మరోవైపు. భారత్‌, ఆస్ట్రేలియా ఐసీసీ 2023 ప్రపంచకప్‌ ఫైనల్‌ నేడు.
అంతిమ సమరానికి రంగం సిద్ధమైంది. అజేయ జట్టు ఆతిథ్య భారత్‌ సొంత అభిమానుల నడుమ దేశం గర్వపడే ప్రదర్శన చేయాలని చూస్తోంది. 120 కోట్ల భారతీయుల గుండె చప్పుడు నేడు మొతెరాలో వినిపిండనుండగా.. ముచ్చటగా మూడోసారి కప్పు కొట్టాలని రోహిత్‌సేన తహతహ లాడుతోంది. ప్రపంచకప్‌లో పది మ్యాచుల్లో ఎదురులేని విజయాలు సాధించిన టీమ్‌ ఇండియా నేడు 11వ గెలుపుతో ప్రపంచకప్‌ ట్రోఫీకి చేరువయ్యేందుకు ఎదురు చూస్తోంది.
ఐసీసీ ట్రోఫీలు నెగ్గటం ఎరిగిన జట్టు ఆస్ట్రేలియా. ఐదుసార్లు ప్రపంచకప్‌ సాధించిన ఆసీస్‌ ఇటీవల టీ20 ప్రపంచకప్‌ను సైతం సొంతం చేసుకుంది. కంగారూల స్థాయికి తగ్గ ప్రదర్శనతో ఫైనల్‌కు చేరకపోయినా.. టైటిల్‌ పోరులో బరిలో నిలిచింది అరివీర భయంకర ఆస్ట్రేలియా. ఆఖరు బంతి వరకు పోరాడటం తెలిసిన పాట్‌ కమిన్స్‌ నేడు టీమ్‌ ఇండియా అత్యంత కఠిన ప్రత్యర్థి.
నవతెలంగాణ-అహ్మదాబాద్‌
అదే జోరు.. రెట్టించిన ప్రేరణ : ప్రపంచకప్‌లో టీమ్‌ ఇండియా ప్రశాంతత బాగా కలసొచ్చింది. నేడు టైటిల్‌ పోరు భావన అదనపు ఒత్తిడి దరిచేరకుంటే రోహిత్‌సేన ఓ మెట్టు ఎక్కినట్టే. బ్యాటింగ్‌ లైనప్‌లో అందరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ నిస్వార్థ ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు. శుభ్‌మన్‌ గిల్‌ కీలక సమయంలో తనదైన ధాటి చూపిస్తున్నాడు. విరాట్‌ కోహ్లి పది ఇన్నింగ్స్‌లో ఏకంగా ఎనిమిది 50 ప్లస్‌ స్కోర్లు సాధించాడు. వాంఖడేలో చారిత్రక 50వ వన్డే సెంచరీతో భీకర ఫామ్‌లో ఉన్నాడు. టాప్‌-3 దండయాత్రకు శ్రేయస్‌ అయ్యర్‌, కెఎల్‌ రాహుల్‌ తోడయ్యారు. అయ్యర్‌ సిక్సర్ల మోత మోగిస్తుండగా, రాహుల్‌ సరికొత్త పంథాలో చెలరేగుతున్నాడు. టాప్‌-5 బ్యాటర్ల మెరుపులతో అదనపు బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ అవసరం ఇప్పటివరకు రాలేదు. నేడు ఆ అవసరం ఏర్పడినా.. సూర్య కుమార్‌ సిద్ధంగానే ఉన్నాడు. మహ్మద్‌ షమి ఆరు మ్యాచుల్లోనే 23 వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. బుమ్రా, సిరాజ్‌ తోడుగా షమి నిప్పులు చెరుగుతున్నాడు. ఈ పేస్‌ త్రయాన్ని ఎదురించి ఏ టాప్‌ ఆర్డర్‌ నిలువలేదు. కుల్దీప్‌, జడేజా మాయజాలం సైతం మ్యాజిక్‌ షో తరహాలో నడుస్తోంది. సమిష్టిగా రాణిస్తున్న టీమ్‌ ఇండియాకు ప్రపంచకప్‌ ట్రోఫీ ప్రేరణ తోడైతే నేడు ప్రత్యర్థి నిలువగలదా?!
చరిత్ర తోడుగా..ఆసీస్‌: కంగారూలకు ప్రపంచకప్‌ ఆరంభం కలిసి రాలేదు. తొలి రెండు మ్యాచుల్లో ఓటములు. కానీ ఆ తర్వాత ఆ జట్టు పుంజుకుంది. వరుసగా ఎనిమిది విజయాలు సాధించింది. ఓటమి తథ్యమనుకున్న మ్యాచుల్లోనూ అసమాన విజయాలు సాధించి ఆశ్చర్యపరిచింది. తాజాగా ఫైనల్లోనూ ఆ జట్టును తక్కువ అంచనా వేస్తుండగా.. అందరికీ షాక్‌ ఇచ్చేందుకు సమాయత్తం అవుతోంది. స్మిత్‌, లబుషేన్‌ అంచనాలను అందుకోలేదు. వార్నర్‌, హెడ్‌ దూకుడులో నిలకడ లేదు. మాక్స్‌వెల్‌ మెరుపులు పరిమితమే. బంతితోనూ కమిన్స్‌, స్టార్క్‌, హాజిల్‌వుడ్‌ స్లో పిచ్‌పై ఏమాత్రం ప్రభావం చూపిస్తారో తెలియని అనిశ్చితి. అయినా, ఐసీసీ ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో ఒత్తిడిని ఎదుర్కొనే అలవాటు ఆసీస్‌ సొంతం. గత చరిత్ర తోడుగా నేడు టైటిల్‌ పోరులో ఆస్ట్రేలియా విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.

ఇదీ గేమ్‌ ప్లాన్‌!
మహ్మద్‌ షమి భారత బౌలింగ్‌ దాడి మొదలుపెట్టనున్నాడు. ఆసీస్‌ ఓపెనర్లు హెడ్‌, వార్నర్‌ ఇద్దరూ ఎడమ చేతి బ్యాటర్లు. లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాటర్లపై ప్రతి ఏడు బంతులకు ఓ వికెట్‌ కూల్చిన రికార్డు షమి సొంతం. ఈ ప్రపంచకప్‌లో ఎడమ చేతి వాటం బ్యాటర్లకు 52 బంతులు సంధించిన షమి 32 పరుగులకే ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. జశ్‌ప్రీత్‌ బుమ్రాకు వార్నర్‌, హెడ్‌పై మంచి రికార్డు లేదు. దీంతో షమి, సిరాజ్‌ రెండు కొత్త బంతులతో వికెట్‌కు ఇరువైపులా ఎదురుదాడి చేయనున్నారు. మిడిల్‌ ఓవర్లలో రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌ కీలకం. జడేజా ఈ ఓవర్లలో 4.25 ఎకానమీ సాధించగా, అందులో కుడి చేతి బ్యాటర్లపై 4.18తో మరింత మెరుగు. ఆసీస్‌లో నం.3 నుంచి నం.7 వరకు అందరూ రైట్‌ హ్యాండ్‌ బ్యాటర్లే. కుల్దీప్‌ యాదవ్‌ ఎకానమీ 4.32 కాగా సగటు 24.53. ఆసీస్‌ ఓపెనర్లలో ఎవరు పవర్‌ప్లే దాటి వికెట్‌ నిలుపుకున్నా.. తొలుత బంతి అందుకునేది కుల్దీప్‌ యాదవే. మిడిల్‌ ఓవర్లతో పాటు డెత్‌ ఓవర్లలో జశ్‌ప్రీత్‌ బుమ్రా బ్రహ్మాస్త్రం ఉండనే ఉంది. స్టీవ్‌ స్మిత్‌ వర్సెస్‌ జడేజా.. గ్లెన్‌ మాక్స్‌వెల్‌ వర్సెస్‌ కుల్దీప్‌ ఆసక్తికరం. రోహిత్‌ శర్మకు లెఫ్ట్‌ ఆర్మ్‌ సీమర్లను ఎదుర్కొవటంలో కాస్త బలహీనత. వన్డే కెరీర్‌లో 22 సార్లు వారికే వికెట్‌ కోల్పోయాడు. ఆ బలహీనత సొమ్ముచేసుకునేందుకు మిచెల్‌ స్టార్క్‌ ఎదురు చూస్తున్నాడు. బంతి స్వింగ్‌ అయితే స్టార్క్‌కు అనుకూలత, లేదంటే రోహిత్‌ శర్మ పవర్‌ప్లేలోనే పవర్‌ఫుల్‌గా దండయాత్ర చేయటం ఖాయం. విరాట్‌ కోహ్లికి హాజిల్‌వుడ్‌ సవాల్‌ విసురుతున్నాడు. గతంలో షార్ట్‌ బాల్స్‌తో కోహ్లిని ఇరకాటంలో పెట్టిన రికార్డు అతడికి ఉంది. అయితే, హాజిల్‌వుడ్‌పై పరుగులు పిండుకోకుండా కోహ్లి ఎప్పుడూ వికెట్‌ పారేసుకోలేదు. మిడిల్‌ ఆర్డర్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ది ఆసీస్‌ స్పిన్నర్‌ ఆడం జంపాపై తిరుగులేని పైచేయి. ఇన్నింగ్స్‌ ప్రతి దశలో ఓ ఎండ్‌లో స్ట్రయిక్‌ రొటేషన్‌ చేస్తుండగా.. మరో ఎండ్‌లో విధ్వంస రచన ఉండనుంది. రోహిత్‌, శ్రేయస్‌, రాహుల్‌, సూర్య కుమార్‌ల బాధ్యత ధనాధన్‌ కాగా.. శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లిలది ఇన్నింగ్స్‌ ఆఖరు వరకూ ఓ ఎండ్‌లో నిలిచి ఇన్నింగ్స్‌ను నడిపించటం. ప్రపంచకప్‌ పది మ్యాచుల్లో విజయవంతమైన ఈ వ్యూహం ఇంకొక్క సారి క్లిక్‌ అయితే.. కప్పు భారత్‌ సొంతమవనుంది.

టాస్‌ నెగ్గు.. ‘ట్రోఫీ’ ఛేదించు!
స్లో వికెట్‌, ప్రపంచకప్‌ ఫైనల్‌ ఒత్తిడి. అదుపు చేయలేని భావోద్వేగాలు. ఈ పరిస్థితుల్లో ఊరించే లక్ష్యాన్ని సైతం ఛేదించటం కష్టం అని చెబుతుంటారు. కానీ ప్రపంచకప్‌ విజేతగా నిలవాలంటే టైటిల్‌ పోరులో లక్ష్యాన్ని ఛేదించాల్సిందే!. గత మూడు ప్రపంచకప్‌ ఫైనల్స్‌ చెబుతున్న గెలుపు రహస్యం ఇదే. 2011, 2015, 2019 ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేసిన జట్లే విజయాలు సాధించాయి. ఈ మూడు ప్రపంచకప్‌లను ఆతిథ్య జట్లే నెగ్గటం మరో విశేషం. నేడు అహ్మదాబాద్‌లోనూ టాస్‌ నెగ్గి తొలుత బౌలింగ్‌ ఎంచుకోవటమే విజయానికి దగ్గరి దారి అవనుంది. గత ప్రపంచకప్‌ ఫైనల్స్‌ గణాంకాలే కాదు అహ్మదాబాద్‌ గ్రౌండ్‌ రికార్దులు సైతం ఛేదనకే ఓటేస్తున్నాయి. ఇక్కడ జరిగిన ప్రపంచకప్‌ గ్రూప్‌ దశలో నాలుగు మ్యాచులు జరుగగా.. మూడింట రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేసిన జట్టు గెలుపొందింది. ఇక్కడ జరిగిన రెండు ఐపీఎల్‌ ఫైనల్స్‌లోనూ తొలుత బ్యాటింగ్‌ జట్టుకు ఓటమి తప్పలేదు. ఎండ బాగా కాసిన సమయంలో బ్యాటింగ్‌ కాస్త కఠినం. అదే రెండో ఇన్నింగ్స్‌లో బంతి మెత్తబడి పరుగులు సులువుగా వస్తాయి. ఆసీస్‌ తొలుత బ్యాటింగ్‌ చేయాల్సి వస్తే ఆ జట్టు ఓటమి ఖారారైనట్టే. కానీ టీమ్‌ ఇండియా తొలుత బ్యాటింగ్‌ చేసినా తక్కువ అంచనా వేయలేని పరిస్థితి. ప్రపంచకప్‌లో సెమీస్‌ సహా పది మ్యాచులు ఆడిన ఆతిథ్య భారత్‌ ఛేదనను సగటు 64.4 బంతులు మిగిలి ఉండగానే పూర్తి చేయగా.. తొలుత బ్యాటింగ్‌ చేస్తే సగటున 175 పరుగుల తేడాతో విజయాలు సాధించింది.

పిచ్‌, వాతావరణం
భారత్‌, పాకిస్థాన్‌ గ్రూప్‌ దశ మ్యాచ్‌ జరిగిన పిచ్‌నే ఫైనల్‌కు సిద్ధం చేశారు. పాకిస్థాన్‌ 191 పరుగులకే కుప్పకూలగా, 30.3 ఓవర్లలోనే భారత్‌ లాంఛనం ముగించింది. ఫైనల్లో మరీ స్వల్ప స్కోర్లు నమోదు కాకపోయినా.. 320 పైచిలుకు స్కోరు గెలుపు దీమా ఇవ్వగలదు. భారత్‌, ఆసీస్‌ టైటిల్‌ పోరుకు ఎటువంటి వర్షం సూచనలు లేవు. కానీ రెండో ఇన్నింగ్స్‌కు మంచు ప్రభావం ఉండనుంది. మంచు ప్రభావాన్ని తగ్గించేందుకు గ్రౌండ్‌ పచ్చికపై రసాయనాలు సైతం వాడారు.

ఎక్స్‌ ఫ్యాక్టర్‌ ‘పవర్‌ప్లే’
ప్రపంచకప్‌ ఫైనల్‌ ఫలితాన్ని పవర్‌ప్లే (తొలి పది ఓవర్లు) శాసించనుంది. 2023 ప్రపంచకప్‌లో పవర్‌ప్లేలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన రెండు జట్లు టైటిల్‌ పోరుకు చేరుకున్నాయి. తొలి పది ఓవర్ల దూకుడులో టీమ్‌ ఇండియా ముందుండగా.. ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది. బ్యాట్‌తో, బంతితో భారత్‌ తొలి పది ఓవర్లు అదరగొట్టింది. పవర్‌ప్లేలో భారత బ్యాటర్లు 6.78 రన్‌రేట్‌తో పరుగులు సాధించగా, బౌలర్లు 4.34 ఎకానమీతో కట్టడి చేశారు. ఆస్ట్రేలియా బ్యాటర్లు 6.55 రన్‌రేట్‌తో మెరువగా.. బౌలర్లు 4.75 ఎకానమీ సాధించారు. భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పవర్‌ప్లేలో అత్యంత విధ్వంసక బ్యాటర్‌గా నిలువగా.. ఆ తర్వాతి స్థానంలో ఆసీస్‌ ఓపెనర్‌ ట్రావిశ్‌ హెడ్‌ నిలిచాడు. ఇటు భారత్‌కు, అటు ఆసీస్‌కు ఈ ఇద్దరిని పవర్‌ప్లేలోనే నిలువరించటం ప్రధానం కానుంది. ఈ ఇద్దరిలో ఎవరైనా పవర్‌ప్లేలో దాటేసి వచ్చారంటే.. అప్పటికే ఆ జట్టు మానసికంగా పైచేయి సాధించినట్టే లెక్క.

గ్రూప్‌ దశ ఐదో మ్యాచ్‌ నుంచి భారత జట్టులో మార్పులు లేవు. నేడు ఫైనల్లోనూ అదే ట్రెండ్‌ కొనసాగే వీలుంది. ప్రత్యర్థి ఆసీస్‌ కావటంతో రవిచంద్రన్‌ అశ్విన్‌ను తీసుకునే యోచన ఉన్నప్పటికీ.. ఇద్దరు సీమర్లతో బరిలో దిగటం సైతం ప్రమాదకరమే. ఆస్ట్రేలియా సైతం తుది జట్టులో మార్పులపై ఆలోచన చేస్తోంది. మార్నస్‌ లబుషేన్‌ స్థానంలో మార్కస్‌ స్టోయినిస్‌ను ఎంచుకునేందుకు మొగ్గు చూపుతోంది. కానీ స్లో పిచ్‌పై లబుషేన్‌ బ్యాటింగ్‌ నైపుణ్యం ఆసీస్‌కు అవసరం. దీంతో సెమీస్‌లో ఆడిన జట్లతోనే ఇరు జట్లు టైటిల్‌ పోరుకు సిద్ధం కానున్నాయి.

తుది జట్లు (అంచనా)
భారత్‌ :
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, కెఎల్‌ రాహుల్‌ (వికెట్‌ కీపర్‌), సూర్యకుమార్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా, మహ్మద్‌ షమి, జశ్‌ప్రీత్‌ బుమ్రా, కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌.
ఆస్ట్రేలియా: డెవిడ్‌ వార్నర్‌, ట్రావిశ్‌ హెడ్‌, మిచెల్‌ మార్ష్‌, స్టీవ్‌ స్మిత్‌, మార్నస్‌ లబుషేన్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, జోశ్‌ ఇంగ్లిశ్‌ (వికెట్‌ కీపర్‌), మిచెల్‌ స్టార్క్‌, పాట్‌ కమిన్స్‌ (కెప్టెన్‌), ఆడం జంపా, జోశ్‌ హాజిల్‌వుడ్‌.

 

Spread the love