వదలొద్దు ఈ కప్పు!

Don't give up this cup!– ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ నేడు
– టైటిల్‌ వేటలో భారత్‌, దక్షిణాఫ్రికా ఢీ
– రాత్రి 8 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ ఆఖరు ఘట్టానికి చేరుకుంది. గ్రూప్‌, సూపర్‌8 దశల్లో అజేయంగా నిలిచిన రెండు జట్లు టైటిల్‌ పోరుకు చేరుకున్నాయి. బ్రిడ్జ్‌టౌన్‌లో నేడు ఎవరు నెగ్గినా.. అజేయంగా టీ20 ప్రపంచకప్‌ టైటిల్‌ సాధించిన రికార్డు సృష్టించనున్నారు. తొలిసారి ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌కు చేరుకున్న దక్షిణాఫ్రికాతో తొలి ఎడిషన్‌ చాంపియన్‌ టీమ్‌ ఇండియా అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. భారత్‌, దక్షిణాఫ్రికా టీ20 ప్రపంచకప్‌ టైటిల్‌ వేట నేడు.
2014.. చివరగా ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో టీమ్‌ ఇండియా పోటిపడిన ఏడాది. సరిగ్గా పదేండ్ల తర్వాత భారత్‌ మళ్లీ టైటిల్‌ వేటకు సిద్ధమైంది. దశాబ్దం క్రితం శ్రీలంక, ఏడాది క్రితం ఆస్ట్రేలియా మిగిల్చిన గాయాలు మానేందుకు బ్రిడ్జ్‌టౌన్‌లో ఓ సువర్ణావకాశం లభించింది. అహ్మదాబాద్‌లో ఓ టైటిల్‌ చేజార్చుకున్న రోహిత్‌, ద్రవిడ్‌ ద్వయం.. నేడు బార్బడోస్‌లో పొట్టి కప్పును వదలొద్దు!.
నవతెలంగాణ-బ్రిడ్జ్‌టౌన్‌
గ్రూప్‌, సూపర్‌ 8 దశల్లో అజేయంగా నిలిచిన రికార్డు. ఫైనల్‌కు చేరుకునే క్రమంలో భీకర ఫామ్‌. టైటిల్‌ పోరు ముంగిట ఇరు జట్ల శిబిరాల్లో చారిత్రక భావోద్వేగం!. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ సమరానికి ఇంతకుమించిన స్ఫూర్తి ఏముంటుంది!. భారత్‌, దక్షిణాఫ్రికా నేడు ప్రపంచకప్‌ ఫైనల్లో ఢకొీట్టనున్నాయి. పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ వంటి అగ్రశ్రేణి, కఠిన ప్రత్యర్థులను దాటుకుంటూ టీమ్‌ ఇండియా ఫైనల్‌కు చేరుకోగా… దక్షిణాఫ్రికా ప్రతి మ్యాచ్‌లోనూ ఒత్తిడిని జయిస్తూ ఉత్కంఠ విజయాలు సాధించి ఇక్కడికి వచ్చింది. 2007లో తొలిసారి టైటిల్‌ అందుకున్న టీమ్‌ ఇండియా.. మళ్లీ ట్రోఫీ ముద్దాడేందుకు కసితో కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఐసీసీ ప్రపంచకప్‌ను అందుకోని దక్షిణాఫ్రికా..తమ దేశ క్రికెట్‌ చరిత్రను తిరగరాసేందుకు పట్టుదలగా కనిపిస్తుంది. వర్షం ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో బ్రిడ్జ్‌టౌన్‌లో భారత్‌, దక్షిణాఫ్రికా నేడు టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి.
దశాబ్ద దాహం తీరేనా?
ప్రపంచ క్రికెట్‌ పవర్‌హౌస్‌ భారత్‌. అభిమానులకు క్రికెట్‌ ఓ ఆట కంటే ఎక్కువ. ద్వైపాక్షిక సిరీస్‌ల్లో దుమ్మురేపినా.. ఐసీసీ ఈవెంట్లలో కప్పు కొట్టడం లేదని అభిమానుల ఆవేదన. 2011 ఐసీసీ వరల్డ్‌కప్‌, 2013 ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ తర్వాత భారత్‌ మరో టైటిల్‌ సాధించలేదు. 2014, 2023లలో వరుసగా టీ20, వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్స్‌కు చేరినా నిరాశే ఎదురైంది. టీ20 ప్రపంచకప్‌లో 2016, 2022లో సెమీస్‌కు చేరింది. వన్డే వరల్డ్‌కప్‌లో 2015, 2019లో సెమీఫైనల్స్‌కు చేరుకుంది. కానీ, భారత క్రికెటర్లు.. అభిమానుల టైటిల్‌ దాహం తీరలేదు. నిరుడు నవంబర్‌లో టైటిల్‌ వేటలో విఫలమైన రోహిత్‌ సేన నేడు మరోసారి పొట్టి ఫార్మాట్‌లో ఈ ప్రయత్నానికి సిద్ధమైంది.
అజేయంగా టైటిల్‌ పోరుకు చేరుకున్న భారత్‌కు స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి ఫామ్‌ మినహా ఏ ఆందోళన లేదు. గ్రూప్‌ దశ నుంచి విరాట్‌ కోహ్లి పరుగుల వేటలో నిరాశపరుస్తున్నాడు. నేడు ఫైనల్లోనైనా కోహ్లి కసితీరా కొడతాడనే అంచనాలు భారీగా ఉన్నాయి. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ దూకుడు భారత్‌కు అతిపెద్ద బలం. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌పై రోహిత్‌ శర్మ ఉప్పెనలా విరుచుకుపడ్డాడు. మెగా మ్యాచుల్లో ఎదురుదాడి వ్యూహం అమలు చేసే రోహిత్‌ శర్మ నేడు ముందుండి దాడి చేయనున్నాడు. రిషబ్‌ పంత్‌ గత మ్యాచుల్లో టచ్‌ కోల్పోయాడు. పంత్‌ తనదైన విలక్షణ షాట్లతో మెరిస్తే టాప్‌ ఆర్డర్‌లో ఎదురుండదు. సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్య, శివం దూబె మంచి ఫామ్‌లో ఉన్నారు. రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌ సైతం బ్యాట్‌తో మెరుస్తున్నారు. నలుగురు స్పెషలిస్ట్‌ బ్యాటర్లు, నలుగురు ఆల్‌రౌండర్లు భారత ఇన్నింగ్స్‌ను 20 ఓవర్ల పాటు దూకుడుగా నడిపించటం గతంలో ఎన్నడూ చూడనిది. బంతితో భారత్‌ జోరు మామాలుగా లేదు. జశ్‌ప్రీత్‌ బుమ్రా, అర్ష్‌దీప్‌ సింగ్‌ల పేస్‌కు.. కుల్దీప్‌, అక్షర్‌ పటేల్‌ స్పిన్‌ మాయ జతకలిసింది. ప్రత్యర్థి బ్యాటర్లు మన బౌలర్లను ఎదుర్కొనేందుకు తంటాలు పడుతున్నారు. ఈ ప్రపంచకప్‌లో భారత్‌, దక్షిణాఫ్రికా తలపడటం ఇదే తొలిసారి.
ఇంకొక్క అడుగే
ప్రపంచ క్రికెట్‌ అగ్రజట్లలో దక్షిణాఫ్రికా ఒకటి. దక్షిణాఫ్రికా క్రికెట్‌లో చీకటి అధ్యాయాలు సైతం ఉన్నాయి. కానీ దిగ్గజ క్రికెటర్లు ప్రాతినిథ్యం వహించినా.. ఇప్పటి వరకు ఓ ఐసీసీ ప్రపంచకప్‌ టైటిల్‌ సాధించకపోవటం ఆ జట్టుకు తీరని వేదన. 1992, 1999, 2007, 2015, 2023 వన్డే వరల్డ్‌కప్‌లో.. 2009, 2014 టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌ ఇప్పటి వరకు సఫారీలకు వరల్డ్‌కప్‌లో ఉత్తమ ప్రదర్శన. ఆ జట్టు తొలిసారి ప్రపంచకప్‌ ఫైనల్‌కు చేరుకుంది. తుది అడుగులోనూ విజయవంతమై చాంపియన్‌గా నిలవాలని దక్షిణాఫ్రికా పట్టుదలగా కనిపిస్తుంది. 1998 ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ విజయం ఒక్కటే సఫారీ చరిత్రలో అత్యుత్తమం. ఇప్పుడు ఆ రికార్డును అధిగమించే అవకాశం ముంగిట నిలిచింది మార్‌క్రామ్‌ సేన. నిజానికి దక్షిణాఫ్రికా ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. సెమీఫైనల్లో అఫ్గాన్‌తో మ్యాచ్‌ మినహా అన్ని మ్యాచుల్లోనూ ఆఖరు వరకు పోరాడి విజయాలు సాధించింది. ఇది సఫారీలకు నేడు కలిసి రానుంది.
దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌, బౌలింగ్‌ ఎప్పటిలాగే బలోపేతంగా ఉంది. క్వింటన్‌ డికాక్‌, రీజా హెండ్రిక్స్‌ ఫామ్‌లో ఉన్నారు. కెప్టెన్‌ ఎడెన్‌ మార్‌క్రామ్‌, ట్రిస్టన్‌ స్టబ్స్‌ ప్రతికూల పరిస్థితుల్లో నిలబడే బ్యాటర్లు. హెన్రిచ్‌ క్లాసెన్‌, డెవిడ్‌ మిల్లర్‌ ఊచకోతకు మారుపేరు. బౌలింగ్‌ విభాగంలో మార్కో జాన్సెన్‌ భీకర ఫామ్‌లో ఉన్నాడు. కగిసో రబాడతో కలిసి కొత్త బంతితో నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. స్పిన్నర్లు కేశవ్‌ మహరాజ్‌, షంశిలతో కలిసి బంతి పంచుకుంటున్న ఎన్రిచ్‌ నోకియా మిడిల్‌ ఓవర్లలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయగలిగితే దక్షిణాఫ్రికా తొలి ఐసీసీ వరల్డ్‌కప్‌ వేటలో భారత్‌కు దీటుగా పోటీ ఇవ్వగలదు.
పిచ్‌ స్వభావం
ఈ వరల్డ్‌కప్‌లో ఇక్కడ జరుగుతున్న తొమ్మిదో మ్యాచ్‌ ఇది. ఈ పిచ్‌పై భారీ స్కోర్లు నమోదైన రికార్డు ఉంది. కానీ ప్రపంచకప్‌లో పెద్దగా పరుగులు రాలేదు. అఫ్గాన్‌పై భారత్‌ చేసిన 181 పరుగులే ఇప్పుడు అత్యధికం. దక్షిణాఫ్రికా గ్రూప్‌, సూపర్‌8 దశల్లో ఇక్కడ ఆడలేదు. ఆ జట్టుకు ఈ పిచ్‌పై ఇదే తొలి మ్యాచ్‌ కానుంది. టాస్‌ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది.
వర్షం ముప్పు?!
భారత్‌, ఇంగ్లాండ్‌ సెమీస్‌ మ్యాచ్‌కు వరుణుడు తీవ్ర ఆటంకం కలిగించాడు. నేడు ఫైనల్‌ మ్యాచ్‌కు సైతం వర్షం ప్రమాదం పొంచి ఉంది. రాత్రి నుంచి ఉదయం వరకు భారీ వర్షం సూచనలు ఉన్నప్పటికీ.. మ్యాచ్‌ షెడ్యూల్‌ సమయం (స్థానిక కాలమానం) 10.30 గంటలకు వర్షం సూచనలు 30 శాతం మాత్రమే ఉన్నాయి. మ్యాచ్‌ షెడ్యూల్‌ సమయానికి మొదలైనా.. వర్షం అడ్డంకితో అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. టైటిల్‌ పోరుకు రిజర్వ్‌ డే ఉంది. కనీసం పది ఓవర్ల మ్యాచ్‌ సాధ్యపడని పరిస్థితుల్లో మ్యాచ్‌ ఆదివారానికి వెళ్లనుంది.
తుది జట్లు (అంచనా) :
భారత్‌ : రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), విరాట్‌ కోహ్లి, రిషబ్‌ పంత్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, శివం దూబె, హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, కుల్దీప్‌ యాదవ్‌, జశ్‌ప్రీత్‌ బుమ్రా.
దక్షిణాఫ్రికా : క్వింటన్‌ డికాక్‌, రీజా హెండ్రిక్స్‌, ఎడెన్‌ మార్‌క్రామ్‌, ట్రిస్టన్‌ స్టబ్స్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, డెవిడ్‌ మిల్లర్‌, మార్కో జాన్సెన్‌, కేశవ్‌ మహరాజ్‌, కగిసో రబాడ, ఎన్రిచ్‌ నోకియా, తంబ్రియజ్‌ షంశి.

Spread the love