సీజనల్ వ్యాధులతో జాగ్రత్తగా ఉండాలి: డాక్టర్ విజయ్ కుమార్

నవతెలంగాణ – అశ్వారావుపేట
వర్షాకాలం వేసవి తర్వాత వచ్చి వేడి గాలులు,ఉక్కపోత నుండి అందరికి ఊరటనిస్తుంది. అయినప్పటికీ ఇది మలేరియా, డెంగ్యూ, చికన్‌గున్యా, ఇతర ప్రాణాంతక వ్యాధుల కలిగి ఉందని మనం మర్చిపోకూడదు. ప్రతి సంవత్సరం వివిధ రకాల దోమలు పుట్టి రోగాల ప్రబలుతున్నాయి. వర్షాకాలంలో దోమల వల్ల కలిగే వ్యాధులు, వాటి లక్షణాలు తెలుసుకుందాం. వర్షాలు ఎక్కువగా పడటం వల్ల దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. భూమి మీద నీరు నిల్వ గా ఉండటం, పాడైపోయిన టైర్లు లో నీళ్ళు చేరడం మొదలగు వాటివల్ల దోమలు ఎక్కువగా పుట్టుకొస్తాయి. అందుకే దోమల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వర్షాకాలంలో దోమల వల్ల వచ్చే మలేరియా, డెంగ్యూ, చికన్ గున్యా వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయా వ్యాధుల లక్షణాలను తెలుసుకుందాం.
చికన్ గున్యా:
దోమ కుట్టిన తర్వాత 4 నుండి 8 రోజుల్లో ఈ వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే, తలనొప్పి, హఠాత్తుగా అధిక జ్వరం, వాంతులు, వికారం, కండ్ల కలక, దద్దుర్లు, కీళ్ళ నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
మలేరియా:
ఆడ ఎనాఫిలిస్ దోమ కాటు కారణంగా మలేరియా కు కారణమయ్యే పరాన్నజీవులు మనుషుల శరీరంలోకి ప్రవేశిస్తాయి. మలేరియా సోకిన వారిలో తీవ్రమైన చలి, జ్వరం, వికారం, తలనొప్పి, వాంతులు, డయేరియా, కడుపు నొప్పి, కీళ్ళ నొపులు, అలసట, శ్వాస వేగం పెరగడం, గుండె కొట్టుకునే వేగం పెరగడం, దగ్గు ఉంటాయి.
డెంగ్యూ:
దోమకాటు తర్వాత 4 నుండి 10 రోజుల కు డెంగ్యూ లక్షణాలు కనిపిస్తాయి. 104 ఫారెన్ హీట్ ఉష్ణోగ్రతతో కూడిన జ్వరం, తలనొప్పి, ఎముకలు, కండరాలు, కీళ్ళ నొప్పులు, కళ్ళ వెనక నొప్పి, చర్మం మీద దద్దుర్లు, వికారం, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి.
ఈ వ్యాధులు సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.
Spread the love