వ్యవసాయానికి పశుపోషణకి విడదీయలేని సంబంధం -ఏడీ జే.హేమంత్ కుమార్

– అవగాహనతో కూడిన యాజమాన్యం పద్దతులతో నే అధికోత్పత్తులు – పశు వైద్యురాలు డాక్టర్ స్వప్న
– జాతీయ సేవా పధకం ఆద్వర్యంలో పశు వైద్య శిబిరం
నవతెలంగాణ – అశ్వారావుపేట
వ్యవసాయానికి,పశు పోషణ కి విడదీయలేని బంధం ఉన్నది అని వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జె.హేమంత్ కుమార్ అన్నారు. స్థానిక వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో చివరి సంవత్సరం వ్యవసాయ విద్యార్ధులచే  నిర్వహిస్తున్న జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరంలో భాగంగా మూడో రోజు గురువారం నారాయణపురం లో పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రైతు సోదరులు పంటల సాగు తో పాటు అనుబంధంగా పశుపోషణ చేపట్టినట్టు అయితే,అదనపు ఆదాయంతో పాటు, తమ అవసరాలకు కావలసిన పాలు, పెరుగు, గుడ్లు లభించడమే కాక, పంట భూములు కావాల్సిన సేంద్రీయ ఎరువు కూడా లభిస్తుంది అన్నారు.గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఈ పశు  పోషణ ఎంతగానో తోడ్పడుతుంది అన్నారు. అనంతరం పశు వైద్యాధికారి డాక్టర్ స్వప్న మాట్లాడుతూ.. పశు పోషణలో అధిక పాల దిగుబడి, మాంసం ఉత్పత్తికి రైతులు పాటించవలసిన మేలైన యాజమాన్య పద్ధతులతో పాటు,వేసవి కాలంలో పశు  పోషణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించారు. రైతులు పెద్ద సంఖ్యలో తమ పశువులను తీసుకువచ్చి, వాటి అనారోగ్య సమస్యలకు తగిన చికిత్సను చేయించుకున్నారు. గ్రామంలోని గేదెలు,ఆవులు, మేకలు, కోళ్లకు వివిధ రోగనిరోధక టీకాలను వేసారు. మధ్యాహ్నం అవగాహన కార్యక్రమంలో వయ్యారి భామ, కలుపు సమగ్ర యాజమాన్యంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ సేవా పథక కార్యక్రమ అధికారులు,శాస్త్రవేత్తలు ఎo.రాంప్రసాద్, పి. రెడ్డి ప్రియ,ఆర్. రమేష్, అధ్యాపకులు ఎస్. జగదీశ్వర్, షేక్ అస్లాం, రైతు సోదరులు, వ్యవసాయ కళాశాల చివరి సంవత్సరం విద్యార్థులు పాల్గొన్నారు.
Spread the love