– కొత్త ప్రభుత్వంపైనే రైతుల ఆశలు
నవతెలంగాణ – మల్హర్ రావు
రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలోనైనా డ్రిప్ పథకం అమలు చేస్తారనే ఆశతో రైతులు ఎదురుచూస్తున్నారు. బిందు సేద్యం ద్వారా పంటలకు నీటి తడులను అందించేందుకు వీలుగా ప్రభుత్వం సబ్సిడీపై అందించే డ్రిప్ పరికరాల పథకం ఐదేళ్ల కాలం నుంచి నిలిచిపోయింది. గత ప్రభుత్వం ఈ పథకాన్ని పరిమితం చేయడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.దీంతో పంటల సాగు రైతులకు భారంగా మారింది. మండలంలో రైతులు పంటలకు నీరు అందించేందుకు గాను డ్రిప్ సహాయానికి అలవాటు పడ్డారు. రెండు దశాబ్దాల కాలంగా రైతులకు అవగాహన కల్పించి డ్రిప్ విధానంలో పంట సాగును ప్రభుత్వాలు ప్రోత్సహించాయి. ఎస్సి, ఎస్టీ రైతులకు వంద శాతం చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం సబ్సిడీ ఇవ్వగా పెద్ద రైతులకు 12 ఏకరాలకే పరిమితం చేయడంతో పాటు 80 శాతం మేర సబ్సిడీ ఇస్తూ వచ్చింది. ఈ విధానానికి 5 సంవత్సరాల కాలంగా బ్రేక్ పడింది.మండలంలో అత్యధికంగా పెద్దతూoడ్ల, మల్లారం, తాడిచెర్ల, గాధంపల్లి, అడ్వాలపల్లి, దుబ్బపే ట, కిషన్ రావు పల్లి గ్రామాల్లో డ్రిప్ ద్వారా అత్యధికంగా మిర్చి పంటలు సాగు చేస్తుంటారు.
దరఖాస్తులు పెండింగ్ లో…
సబ్సిడీ కింద డ్రిప్ కోసం ప్రతియేటా రైతులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకుంటూ వస్తున్నారు.ఇప్పటి వరకు 43 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది.2019 డ్రిప్ పరికరాల పంపిణీ నిలిపి వేశారు.అధికారులు మాత్రం 10 దరఖాస్తులు మాత్రమే పెండింగ్ లో ఉన్నట్లుగా చెబుతున్నారు.2017 సంవత్సరం నుంచి రైతుల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి.డ్రిప్ ఎప్పుడు వస్తోంధోని ఎదురుచూస్తున్నారు.
ఆయిల్ పామ్ సాగుకె పరిమితం..
ప్రస్తుతం సబ్సిడీ కింద అందిస్తున్న డ్రిఫ్ పథకాన్ని కేవలం ఆయిల్ పామ్ పంటల సాగుకే ప్రభుత్వం పరిమితం చేసింది.ఈ ఏడాది మండలంలో 880 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగులోకి తేవాలని లక్ష్యం పెట్టుకున్నందున ఈ పంట సాగుకు ముందుకు వచ్చే రైతులకు మాత్రమే డ్రిప్ ను అందించాలని ఉద్యానవన శాఖ నిర్ణయించింది. ఈ పంట సాగు కోసం పరికరాలు అందించాలని కోరుతూ 57 మంది రైతులు సబ్సిడీ కోసం దరఖాస్తులు చేసుకున్నారు.ఇందులో ఇప్పటి వరకు 30 దరఖాస్తులకు మంజూరు లభించగా 20 ఎకరాలకు సంబంధించిన సబ్సిడీ అందిస్తున్నారు. కొద్దీ రోజుల్లో మరికొంత మంది రైతులకు అందించే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
ప్రయివేటుగా కొనుగోళ్లు…
ప్రభుత్వం డ్రిప్ పరికరాలను సబ్సిడీపై నిలిపి వేయడంతో రైతులు విధిలేని పరిస్థితుల్లో ప్రయివేటుగా డ్రిప్ పరికరాలు కొనుగోలు చేస్తున్నారు. ఇందుకోసం ఎకరాకు డ్రిప్ కోసం రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.