మొన్న ఢిల్లీ..ఇపుడు రాజ్‌కోట్‌

Yesterday Delhi..now Rajkot– విమానాశ్రయంలో కూలిన క్యానపీ
– ప్రధాని ప్రారంభించిన ఏడాది లోపే ఘటన
– వారంలో మూడోది
రాజ్‌కోట్‌ : భారీ వర్షాలకు ఢిల్లీ విమానాశ్రయంలో టెర్మినల్‌1లో కొంత భాగం కూలిపోయిన ఘటన మర్చిపోకముందే రాజ్‌కోట్‌ హిరసార్‌ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్‌ వద్ద ఏర్పాటు చేసిన క్యానపీ (గుడ్డతో ఏర్పాటు చేసిన పందిరి)లో కొంత భాగం శనివారం కూలిపోయింది. ప్రయాణీకులను పికప్‌, డ్రాప్‌ చేసే టెర్మినల్‌ వెలుపలి భాగం వద్ద ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ప్రమాదంలో ఎవ్వరూ గాయపడ్డం కానీ, మరణించడం కానీ జరగలేదని అధికారులు తెలిపారు. నూతనంగా నిర్మించిన ఈ గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టును గత ఏడాది జులైలో ప్రధాని మోడీ ప్రారంభించారు.ఈ ఎయిర్‌పోర్టును రాజ్‌కోట్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిరసార్‌ గ్రామంలో ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) నిర్మించింది. కాగా, విమానాశ్రయాల్లో ఇలాంటి ఘటన జరగడం వారం రోజుల్లోనే ఇది మూడోది. ఈ నెల 27న మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌ విమానాశ్రయంలోనూ ఫాబ్రిక్‌ కెనోపిలో కొంత భాగం కూలిపోయింది. దాని క్రింద పార్క్‌ చేసిన కారు నుజ్జునుజ్జు అయింద ని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ గాయాలు కాలేదు. ఈ ప్రమాదంపై ప్రాజెక్టు అధికారిని విచారణకు ఆదేశించామని, ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశామని విమానాశ్రయ డైరెక్టర్‌ రాజీవ్‌ రత్న పాండే తెలిపారు.ఢిల్లీ విమానాశ్రయంలో శుక్రవారం టెర్మినల్‌1లో కొంత భాగం కూలిపోవడంతో ఒకరు మృతి చెందగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. నాలుగు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మృతుడి కుటుంబానికి రూ.20 లక్షలు, గాయపడిన వారికి రూ. 3 లక్షల పరిహారాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు ప్రకటించిన విషయం విదితమే. విమానాశ్రయాల్లో కూలుతున్న తీరుపై ప్రయాణీకులకు, వారి బంధువుల్లోనూ భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
గుజరాత్‌లో భారీ వర్షాలు
వాయుగుండం కారణంగా గుజరాత్‌లో గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. దక్షిణ గుజరాత్‌కు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

Spread the love