– రెస్టాఫ్ ఇండియా 289/4
లక్నో (ఉత్తరప్రదేశ్): ఇరానీ కప్ పోరు రసవత్తరంగా సాగుతోంది. ముంబయి బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ డబుల్ సెంచరీతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 537 పరుగులు చేయగా.. రెస్టాఫ్ ఇండియా సైతం దీటుగా స్పందిస్తోంది. ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ (151 నాటౌట్, 212 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్)తో అభిమన్యు అదరగొట్టాడు. రుతురాజ్ గైక్వాడ్ (9), సాయి సుదర్శన్ (32), దేవదత్ పడిక్కల్ (16), ఇషాన్ కిషన్ (38) అంచనాలను అందుకోలేదు. కానీ ఓ ఎండ్‌లో నిలబడిన అభిమన్యు ఈశ్వరన్ అజేయ సెంచరీతో కదం తొక్కాడు. ధ్రువ్ జురెల్ (30 నాటౌట్, 41 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) అజేయ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెస్టాఫ్ ఇండియా 74 ఓవర్లలో 289/4 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో మరో 248 పరుగుల వెనుకంజలో కొనసాగుతుంది. నేడు నాల్గో రోజు ఆటలో అభిమన్యు, ధ్రువ్ జురెల్ జోడీ మెరిస్తేనే రెస్టాఫ్ ఇండియా గట్టెక్కగలదు.