ఈసీని ఆదేశించలేం

EC cannot be ordered– సుప్రీంకోర్టు స్పష్టం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
లోక్‌సభ ఎన్నికలు మధ్యలో ఉన్నందున ఓటింగ్‌కు సంబంధించిన తుది సమాచారాన్ని పోలింగ్‌ కేంద్రాల వారీగా వెబ్‌సైట్‌లో ఉంచేలా ఎన్నికల సంఘాన్ని (ఈసీ) తాము ఆదేశించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఓటింగ్‌కు సంబంధించిన తుది సమాచారాన్ని పోలింగ్‌ కేంద్రాల వారీగా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ప్రస్తుతం పరిగణనలోకి తీసుకునేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. శుక్రవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ సతీశ్‌ చంద్ర శర్మలతో కూడిన వెకేషన్‌ బెంచ్‌ పేర్కొంది. అలా ప్రచురించేందుకు ఈసీ భారీ స్థాయిలో మానవ వనరులను సమకూర్చుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. ఇప్పటికే ఐదు దశల పోలింగ్‌ ముగిసిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఈసీని అలా ఆదేశించలేమని తెలిపింది. అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) దాఖలు చేసిన ఈ అంశంపై ఎన్నికలు పూర్తైన తరువాత సాధారణ ధర్మాసనం విచారణ చేస్తుందని పేర్కొంది. పోలింగ్‌ జరిగిన 48 గంటల్లోగా ప్రతి పోలింగ్‌ స్టేషన్‌లో ఎన్ని ఓట్లు పోలయ్యాయనే అంశంపై బూత్‌ ఓటర్ల డాటాను ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఉంచేలా ఆదేశించాలని తమ పిటిషన్‌లో సుప్రీంకోర్టును ఏడీఆర్‌ కోరింది. తాత్కాలిక ఆదేశాలివ్వాలని తెలిపింది. దీనిపై ధర్మాసనం తీర్పును వెలువరిస్తూ, అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని, బూత్‌ డాటాను అప్‌లోడ్‌ చేయడం వల్ల ఓటర్లు అయోమయానికి లోనయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఇదే అంశంపై మరో పిటిషన్‌ కూడా 2019 నుంచి పెండింగ్‌లో ఉన్నట్టు ధర్మాసనం తెలిపింది.

Spread the love