సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌కు ఈడీ సమన్లు

నవతెలంగాణ  – చెన్నై: మనీలాండరింగ్‌ కేసులో ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్‌ రాజ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) గురువారం సమన్లు జారీచేసింది. వచ్చే వారం చెన్నైలోని ఈడీ కార్యాలయంలో దర్యాప్తు బృందం ముందు హాజరుకావాలని సమన్లలో పేర్కొన్నది. ఆయన బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న తమిళనాడుకు చెందిన ‘ప్రణవ్‌ జ్యువెలరీ’పై ఈడీ కేసులకు సంబంధించి ఆయన్ని విచారించబోతున్నది. పోంజీ స్కీమ్‌లో రూ.100 కోట్ల మనీలాండరింగ్‌ పాల్పడ్డారని ప్రణవ్‌ జ్యువెలరీ యజమాని మదన్‌, ఆయన భార్యపై ఈడీ లుకౌట్‌ నోటీసులు జారీచేసింది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ సినిమాల్లో తనదైన నటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు అందుకున్న ప్రకాశ్‌ రాజ్‌, ప్రధాని మోదీ, బీజేపీ విధానాలను సునిశితంగా విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఈడీ సమన్లు జారీచేయడం చర్చనీయాంశం అయింది.

Spread the love