– తెలుగు అత్యంత లలితమైన భాష
– రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్
– ఘనంగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం
నవతెలంగాణ-కల్చరల్
మారుతున్న కాలానికి అనుగుణంగా తరగతి గది నుంచి సాంకేతిక ప్రపంచ దృష్టితో విద్యా విధానం మారాలని రాష్ట్ర గవర్నర్ డా.తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఇందుకు అనుగుణంగానే నూతన విద్యావిధానం -2020ను కేంద్రం ప్రభుత్వం తెచ్చిందన్నారు. విద్యావంతులు కావటానికి సులువు దారులు ఉండవని లక్ష్య శుద్ధిగా కృషి చేయటమే ఏకైక మార్గం అని చెప్పారు. హైదరాబాద్ రవీంద్ర భారతి ప్రధాన వేదికపై బుధవారం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 16వ స్నాతకోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రనాట్య గురువు కళా కృష్ణకు గౌరవ డాక్టరేట్, విశ్వవిద్యాలయం పట్టభద్రులకు ఎంఫిల్, పీహెచ్‌డీలు, స్వర్ణ పతకాలను బహూకరించారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ.. మాతృ భాష ఆత్మగౌరవం పెంచుతుందని చెప్పారు. దేశ భాషల్లో తెలుగు అత్యంత లలితమైన భాష అని, మాట్లాడటం, వినడంలో ఆసక్తి కలిగిస్తుందని అన్నారు. ఇతర భాషల వారికి తెలుగు భాషా పరిమళం చేరాలన్నారు. సామాన్యులకు అందుబాటులో ఉండేలా చిన్న చిన్న పుస్తకాలు విశ్వవిద్యాలయం ద్వారా ముద్రిస్తామని గవర్నర్ తెలిపారు. విశ్వ విద్యాలయం నుంచి పట్టా పొందిన వారు వారి రంగాల్లో అభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించారు.
విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు ఆచార్య తంగెడ కిషన్‌రావు మాట్లాడుతూ.. బోధన, పరిశోధన, ప్రచురణ, విస్తరణ.. సేవ ద్వారా తెలుగు భాష సంస్కృతి, సాహిత్యం, చరిత్రల పరిరక్షణ, అభివృద్ధికి విశ్వవిద్యాలయం కృషి చేస్తుందని చెప్పారు. విశ్వవిద్యాలయంలో 30 బోధన అంశాలు, 52 సర్టిఫికేట్ డిప్లొమా, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, పరిశోధన విభాగాలు రెగ్యులర్‌గానే కాక కొన్ని సాయంకాలపు కోర్సుల బోధన జరుగుతుందని తెలిపారు. గ్రంథ ప్రచురణ చేయడంలో అంబేద్కర్ ప్రసంగాలు, రచనలు కూడా ఉన్నా యని వివరించారు. విశ్వవిద్యాలయం ప్రధాన బ్రాంచ్‌ని బాచుపల్లికి తరలించినా నాంపల్లి ప్రాంగణంలో డిప్లొమా, సర్టిఫికేట్ కోర్స్‌లు ఉప కేంద్రంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. గౌరవ డాక్టరేట్ అందుకున్న కళా కృష్ణ స్నాతకోపన్యాసం చేస్తూ.. గురు ముఖంగా గురుకులాలలో నేర్చుకునే లలితకళలు ఆశ్రమాలు దాటి విద్యాలయాలు, విశ్వవిద్యాలయ లకు చేరటం గొప్ప మార్పు అన్నారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరి జ్ఞానంతో నృత్య కళా రంగాలలో అధ్యయనం సులువు అవుతుందన్నారు. సంప్రదాయ కళలను డిజిటల్ రూపంలో సంరక్షించి భావితరాలకు అందజేయాలని కోరారు.
1189 మందికి డిగ్రీలు, 78 మందికి ఎంఫిల్, పీహెచ్‌డీలు, 30 మందికి ఎంఫిల్ పీహెచ్‌డీలకు స్వర్ణ పతకాలను, వివిధ విభాగాలలో మరో 31 మందికి కూడా స్వర్ణ పతకాలు బహుకరించారు. రిజిస్టర్ ఆచార్య భట్టు రమేష్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగు విశ్వవిద్యాలయంలో విఖ్యాత గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు పేరిట వంశీ ఆర్ట్స్ అధినేత రామరాజు ఏర్పాటు చేసిన తొలి స్వర్ణ పతకం ఎంఏ సంగీతంలో అత్యధిక మార్కులు పొందిన మొహమ్మద్ లాయక్ అహ్మద్ అందుకున్నారు.