– నైపుణ్యాభివృద్ధి కోసం ప్రత్యేక శిక్షణా కేంద్రలు ఏర్పాటు చేయాలి
– ఎన్పీఆర్డీ క్యాలెండర్ ఆవిష్కరణలో పఠాన్ ఉమర్ఖాన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వికలాంగుల హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వాలు కృషి చేయాలని హెలెన్ కెల్లర్ విద్యాసంస్థల అధినేత పఠాన్ ఉమర్ ఖాన్ కోరారు. గురువారం హైదరాబాద్‌లోని హెలన్‌కెల్లర్ విద్యాసంస్థల ప్రాంగణంలో ఎన్పీఆర్డీ ముద్రించిన 2024 క్యాలెండర్‌ను ఆయన అవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల హక్కుల పరిరక్షణ కోసం కనీసం ఉన్నచట్టాలనైనా అమలు చేయాలని కోరారు. సమాజంలో వివక్షతకు, చిన్న చూపుకు వారు గురవుతున్నారనీ, అందువల్ల వారిలో మనోధైర్యం కల్పించాల్సిన బాధ్యత సమాజంపై ఉందని తెలిపారు. వికలాంగుల్లో అక్షరాస్యత పెంచేందుకు ప్రత్యేక విద్యాసంస్థలు ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలని తెలిపారు. ఎన్పీఆర్డీ ముద్రించిన క్యాలెండర్ విజ్ఞాన దాయకంగా ఉందన్నారు. సమస్యలపై పోరాడుతూనే వికలాంగులను చైతన్యపరిచేందుకు ఆ సంస్థ నాయకులు కృషి చేస్తున్నారని తెలిపారు. సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం అడివయ్య, కార్యక్రమంలో హెలెన్ కెల్లర్ పీజీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ అర్ముఘం, హెలెన్ కెల్లర్ రెహబిలిటేషన్ సెంటర్ డైరెక్టర్ ఎం శశిధర్ రెడ్డి, సిబ్బంది గౌస్, ఎన్పీఆర్డీ రాష్ట్ర కోశాధికారి ఆర్ వెంకటేష్, రాష్ట్ర సహాయ కార్యదర్శి కె నాగలక్ష్మి, నాయకులు అమరావతి, చంద్రశేఖర్, అనిల్‌తో పాటు విద్యార్థులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.