బీర్కూర్ లో సభ్యత్వ నమోదు
పీఆర్టీయూ మండల అధ్యక్షుడు దుర్గాప్రసాద్
నవతెలంగాణ-బీర్కూర్, నసురుల్లాబాద్
ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతున్న పీఆర్టీయూను మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఉపాధ్యాయుడు సభ్యత్వం నమోదు చేసుకోవాలని పీఆర్టీయూ బీర్కూర్ మండల అధ్యక్షుడు దుర్గాప్రసాద్ పిలుపునిచ్చారు.
2026–27 సంవత్సరానికి సంబంధించిన పీఆర్టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పీఆర్టీయూ దత్తత పాఠశాల అయిన ఎంపీపీఎస్ బీర్కూర్ (గర్ల్స్)లో మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కామారెడ్డి జిల్లా ఏర్పడినప్పటి నుంచి జిల్లా శాఖ నిర్వహించే ప్రతి ముఖ్య కార్యక్రమాన్ని బీర్కూర్ మండలం నుంచే ప్రారంభించడం ఆనవాయితీగా కొనసాగుతోందని తెలిపారు. అదే సంప్రదాయంలో భాగంగా ఈ ఏడాది సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా బీర్కూర్ నుంచే ప్రారంభించడం సంతోషకరమని పేర్కొన్నారు.
పీఆర్టీయూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, వృత్తిపరమైన హక్కుల సాధన, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తోందని, సంఘం మరింత బలోపేతం కావాలంటే ప్రతి ఉపాధ్యాయుడు సభ్యత్వం నమోదు చేసుకొని సంఘానికి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర బాధ్యులు చంద్రశేఖర్, విఠల్, రాజు, పాఠశాల ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం ఫణిశ్రీ, ఉపాధ్యాయులు భీమ్‌రావు, రజిత తదితరులు పాల్గొన్నారు.



