నవతెలంగాణ – జక్రాన్ పల్లి
మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కలిగోట్‌లో విద్యార్థుల సౌకర్యార్థం మాజీ ఎంపీటీసీ శ్రీమతి సునీత కరుణాకర్ గౌడ్ రూ.25 వేల విలువైన 12 సీలింగ్ ఫ్యాన్లను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ పురుషోత్తమచారి అధ్యక్షత వహించారు.
గ్రామ సర్పంచ్ శ్రీ నాయిక రాజు, ఉపసర్పంచ్ శ్రీమతి సత్తెమ్మ, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్‌పర్సన్ శ్రీమతి రామగిరి వజ్రమణి, దాత శ్రీమతి సునీత కరుణాకర్ గౌడ్ మాట్లాడుతూ.. పాఠశాల అభివృద్ధికి సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని, విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ పురుషోత్తమచారి మాట్లాడుతూ.. విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని విలువైన విరాళాన్ని అందించిన దాతకు పాఠశాల కుటుంబం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ ప్రజల సహకారంతో పాఠశాల అభివృద్ధికి మరింత కృషి చేస్తామని అన్నారు. అనంతరం అతిథులందరూ కలిసి పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సమక్షంలో 12 సీలింగ్ ఫ్యాన్లను అధికారికంగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో సిఏలు సుజాత, సాయిరాణి, వీడిసి సభ్యులు, పాఠశాల సీనియర్ ఉపాధ్యాయురాలు శ్రీమతి సురేఖ, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు పాల్గొన్నారు.



