29న ఎన్నికల క్యాబినెట్‌

Election Cabinet on 29– ఆఖరిసారిగా భేటీకానున్న మంత్రివర్గం
– మరోసారి ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్ల సిఫారసు
– కొత్త పింఛన్లు.. రైతు బంధు పెంపుపై చర్చించనున్న సీఎం
– ఉద్యోగుల డీఏ, నిరుద్యోగుల కోసం పథకం, ఇతర ప్రధానాంశాలపైనా నిర్ణయాలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అక్టోబరు మొదటి వారంలో శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్‌ రానుందనే వార్తల నేపథ్యంలో అధికార బీఆర్‌ఎస్‌ అందుకనుగుణంగా స్పీడు పెంచుతోంది. ఎలక్షన్‌ తాయిలాల్లో భాగంగా సీఎం కేసీఆర్‌ ఓటర్లకు మరిన్ని హామీలివ్వనున్నారు. ఈ హామీలు, తాయిలాలపై చర్చించేందుకోసం ఈనెల 29న రాష్ట్ర మంత్రివర్గం ప్రత్యేకంగా భేటీ కానుంది. ప్రస్తుత సర్కారుకు దాదాపు ఇదే ఆఖరి క్యాబినెట్‌ కానుంది. నామినేటెడ్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా గతంలో మంత్రివర్గం సిఫారసు చేసిన దాసోజు శ్రవణ్‌, కుర్ర సత్యనారాయణ పేర్లను గవర్నర్‌ డాక్టర్‌ తమిళి సై సౌందర రాజన్‌ తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి క్యాబినెట్‌ వారి పేర్లను ఆమోదించి, గవర్నర్‌కు తిరిగి సిఫారసు చేయనుందని సమాచారం. ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఇటీవల ఆరు గ్యారెంటీలను ప్రకటించటంతో గులాబీ పార్టీ ఉక్కిరిబిక్కిరవుతోంది. వాటికి ధీటుగా బీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టోను రూపొందించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. గత ఎన్నికల్లో పింఛన్‌దారులు, రైతులు కారు పార్టీని భుజాన వేసుకుని గెలిపించారు. ఈసారి కూడా వారే తమ పార్టీని ఆదుకుంటారని కేసీఆర్‌ భావిస్తున్నారు. అందువల్ల ఆసరా పింఛన్ల పెంపు, రైతు బంధు కింద ఇచ్చే ఆర్థిక సాయం పెంపు తదితరాంశాలను ఎన్నికల ప్రణాళికలో ఆయన చేర్చనున్నారు. వీటితోపాటు ఉద్యోగుల డీఏ పెంపు, వారికి సంబంధించిన ఇతర ప్రధానాంశాలు ఎన్నికల ప్రణాళికలో ఉండబోతున్నాయి. 2018లో ముందస్తు ఎన్నికల సందర్భంగా బీఆర్‌ఎస్‌ ‘నిరుద్యోగ భృతి’ని ఇస్తామంటూ ప్రకటించింది. కానీ ఇప్పటి వరకూ దానికి అతీగతీ లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం ఏదైనా ఒక పథకాన్ని ప్రవేశపెట్టే అవకాశముంది. దళిత బంధు, బీసీ, మైనారిటీ బంధు పథకాలు తమకు రాజకీయంగా లబ్ది చేకూరుస్తాయని భావిస్తున్న సీఎం కేసీఆర్‌… వాటి తరహాలోనే మహిళా బంధు పథకానికి రూపకల్పన చేయబోతున్నారని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీటన్నింటిపై మంత్రివర్గంలో చర్చించనున్నారు. ఈ రీత్యా 29న నిర్వహించబోయే క్యాబినెట్‌ భేటీ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.

Spread the love