ఎన్నికలొస్తున్నారు.. దర్యాప్తులు పూర్తి చేయండి

– అన్ని పోలీసు స్టేషన్లకు డీజీపీ కార్యాలయం అంతర్గత ఆదేశాలు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి :
రాష్ట్రంలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికల సైరన్‌ మోగనున్న దృష్ట్యా కేసుల దర్యాప్తులను పూర్తి చేయాలని రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్ల అధికారులకు డీజీపీ కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లాయి. దీనికి సంబంధించిన కార్యాచరణను కూడా హెడ్‌క్వార్టర్స్‌ నుంచి పంపించినట్టు తెలిసింది. వచ్చే ఐదు నెలల్లో రాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరపటానికి ఎలక్షన్‌ కమిషన్‌ (ఈసీ) ఒక పక్క సన్నాహాలు చేస్తున్నది. మరోపక్క, ప్రధానరాజకీయ పక్షాలు సైతం ఎన్నికల శంఖారావాలను పూరించి అందుకు తగిన ఏర్పాట్లను కూడా ప్రారంభించాయి. అయితే, ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతిభద్రతలను కాపాడే కీలకమైన బాధ్యతలు పోలీసుల భుజస్కంధాలపై ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సైరన్‌ మోగించేనాటికి ఆయా పోలీసు స్టేషన్‌ పరిధుల్లో నమోదైన కేసులు, దర్యాప్తులో ఉన్న కేసులను ఒక కొలిక్కి తీసుకురావాలని పోలీసు ఉన్నతాధికారులు ఆశిస్తున్నారు. కారణం.. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైతే దాదాపు రాష్ట్రంలోని పోలీసు యంత్రాంగం ఎన్నికల బందోబస్తుపై దృష్టిసారించాల్సి ఉంటుంది. ప్రచారం మొదలుకొని ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యేంత వరకు వీరు తమ రోజువారి కేసుల దర్యాప్తు నుంచి దూరంగా ఉండే పరిస్థితి ఏర్పడుతున్నది. ఈ నేపథ్యంలో వచ్చే మూడు నెలల్లో ఆయా పోలీసు స్టేషన్ల పరిధులలో పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తులను పూర్తి చేయాలని ఉన్నతాధికారులు దర్యాప్తు అధికారులను ఆదేశించారు. సాధ్యమైనంత వరకు కేసులలో నిందితులను అరెస్టు చేయటం, పెండింగ్‌లో ఉన్న వారెంట్లను జారీ చేయటం, దర్యాప్తులను పూర్తి చేసి చార్జీషీట్లను కోర్టులకు సమర్పించటం వంటి ప్రక్రియలను పూర్తి చేయాలని కూడా ఆదేశించారు. దీనితో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక పెండింగ్‌ కేసుల భారం పడకుండా జాగ్రత్త పడినట్టవుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ విషయంలో ఆయా జిల్లాల ఎస్పీలు, నగర పోలీసు కమిషనర్లు తమ పరిధిలోని పోలీసు స్టేషన్ల దర్యాప్తు అధికారులకు తగిన కార్యాచరణను రూపొందించి ఇవ్వాలనీ, అలాగే ఎప్పటికప్పుడు కిందిస్థాయి అధికారులకు అందుబాటులో ఉంటూ తగిన దిశానిర్దేశం చేయాలని కూడా డీజీపీ హెడ్‌క్వార్టర్స్‌ ఆదేశించినట్టు తెలిసింది.

Spread the love