సెప్టెంబర్ 10న చలో హైదరాబాద్
1న రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్
విద్రోహ దినం
ఈనెల27న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు
పీఆర్సీ నివేదిక ఇవ్వడానికి
ఇంకెన్ని రోజులు
ఈహెచ్‌ఎస్‌ను పటిష్టంగా
అమలు చేయాలి
సమస్యల పరిష్కారంలో
అధికారుల అలసత్వం: ఉద్యోగ జేఏసీ చైర్మెన్ జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ శ్రీనివాసరావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దీర్ఘకాలికంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పోరుబాట పట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు తెలంగాణ ఉద్యోగ జేఏసీ ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. ఈనెల 27న అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని తెలిపింది. వచ్చేనెల ఒకటిన పెన్షన్ విద్రోహ దినం పాటించాలనీ, రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని కోరింది. ప్రభుత్వం స్పందించకుంటే వచ్చేనెల పదిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు పిలుపునిచ్చింది. మంగళవారం హైదరాబాద్‌లోని టీఎన్జీవో కార్యాలయంలో ఉద్యోగ జేఏసీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మీడియాతో జేఏసీ చైర్మెన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ జూన్ రెండున ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశారు. రెండు నెలలు గడిచినా ప్రధాన డిమాండ్లు పరిష్కారం కాలేదన్నారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్) సక్రమంగా అమలు కాకపోవడంతో ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఏ ఆస్పత్రిలో ఏ చికిత్స అందిస్తారో తెలియని పరిస్థితి ఉందన్నారు. రూ.70 కోట్లు ఇస్తే కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఈహెచ్‌ఎస్ అమలవుతుందనీ, ప్రభుత్వం రూ.20 కోట్లే ఇచ్చిందని వివరించారు. సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినా అమలు కాలేదంటే దీనికి బాధ్యులెవరని ప్రశ్నించారు. పీఆర్సీ నివేదిక ఇవ్వడానికి ఇంకెన్ని రోజులని అడిగారు. జూన్ రెండున అమలు చేస్తామని సీఎం చెప్పినా నివేదిక కూడా ఇవ్వలేదని చెప్పారు. ఇంకా ఆగే ఓపిక లేదని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లుల కోసం రూ.రెండు వేల కోట్లు సరిపోవడం లేదనీ, నెలకు రూ.మూడు వేల కోట్లు విడుదల చేయాలని కోరారు. ఆరు డీఏలను వెంటనే ప్రకటించాలని చెప్పారు. మెరుగైన ఫిట్‌మెంట్‌తో పీఆర్సీని అమలు చేయాలన్నారు. సమస్యల పరిష్కారంలో ఆర్థిక, విద్య, వైద్య శాఖల అధికారులు తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ఈహెచ్‌ఎస్ పకడ్బందీగా అమలవుతున్నదంటూ సీఎంకు చెప్తున్నారనీ, కింది స్థాయిలో ఏ ఆస్పత్రిలోనూ అమలు కావడం లేదని చెప్పారు. ట్రస్టు సమావేశంలో తాము ఏం చెప్పినా అధికా రులు వినడం లేదని అన్నారు. ఈహెచ్‌ఎస్‌ను పటిష్టంగా అమలు చేయాలని కోరారు. 317 జీవో బాధిత ఉద్యో గులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ రేషనలైజేషన్ కోసం ఇచ్చిన 25 జీవోను సవరించాలని చెప్పారు. 190 జీవోను విద్య, పోలీసు శాఖలతోపాటు అన్ని శాఖల్లోనూ అమలు చేయాలన్నారు. సంఘాల సభ్యత్వం ఆధారంగా ఈహెచ్‌సీటీ సభ్యులను అదనంగా తీసుకోవాలని సూచించారు. వీబీ గ్రామ్‌జీ ఉద్యోగులకు పేస్కేల్ అమలు చేయాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకపోతే వచ్చేనెల పదిన చలో హైద రాబాద్ పేరుతో మహాధర్నా చేపడతామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు జేఏసీ నాయకులు అన్ని జిల్లాల్లో పర్యటించి సన్నాహక సమావే శాలను నిర్వహిస్తారని వివరించారు. ఈ కార్య క్రమంలో ఉద్యోగ జేఏసీ నాయకులు పి దామో దర్‌రెడ్డి, చావ రవి, వంగ రవీందర్‌రెడ్డి, జి సదానం దంగౌడ్, ముజీబ్, బి శ్యామ్, అనిల్‌కుమార్, లింగారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, కృష్ణమూర్తి, ఉమాదేవి, కటకం రమేశ్, ఉపేందర్‌రెడ్డి, బిక్షంగౌడ్, ఎ వెంకట్, గజేందర్, కస్తూరి వెంకట్, స్థితప్రజ్ఞ, రామారావు, కృష్ణయాదవ్, అంజిరెడ్డి, తిరుపతి, సోమయ్య, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగుల పోరుబాట
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



