‘ఉపాధి’ వేతనాలు ‘ఆధార్‌’తో చెల్లింపు తగదు

'ఉపాధి' వేతనాలు 'ఆధార్‌'తో చెల్లింపు తగదు– కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలి
– కూలీలను కుదించే కుట్ర దుర్మార్గం
– మ్యానువల్‌ పద్ధతిలోనే వేతనాలు చెల్లించాలి : వ్యకాస
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఉపాధి హామీ చట్టం కింద పనిచేసే కూలీలకు ఆధార్‌కార్డు, బ్యాంక్‌ అకౌంట్‌, ఉపాధిజాబ్‌ కార్డు అనుసంధానం ఆధారంగా వేతనాలు చెల్లించడం సరిగాదనీ, కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.నాగయ్య, ఆర్‌.వెంకట్రాములు డిమాండ్‌ చేశారు. ‘ఉపాధి’ కూలీలను కుదించే కుట్ర దుర్మార్గపూరితమని పేర్కొన్నారు. మ్యానువల్‌ పద్ధతిలోనే వేతనాలు చెల్లించాలని కోరారు. మంగళవారం ఈ మేరకు వారు ఒక ప్రకటన విడుదల చేశారు. ఓవైపు బడ్జెట్‌లో నిధులు సరిగా కేటాయించకుండా, మరోవైపు ఉపాధి హామీ చట్టాన్ని కుదించే ప్రయత్నాన్ని కేంద్రం చేస్తోందని విమర్శించారు. పని ప్రదేశంలో ఉదయం, సాయంత్రం రెండుసార్లు ఫోటోలు దింపి నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ సిస్టం అనే ప్రత్యేక యాప్‌లో అప్‌డేట్‌ చేసే క్రమంలో ఇంటర్నెట్‌ సౌకర్యం లేక కోట్లాది మంది కూలీలు వేతనాలు అందక ఎదురుచూస్తున్న తీరును వివరించారు. తెలంగాణలో గతేడాది పనిచేసిన కూలీలకు పదివేల కోట్ల రూపాయలకుపైగా బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఈ నెల నుంచి డ్రోన్‌ సాయంతో కూలీల పనిని ఫొటోల ద్వారా క్యాప్చర్‌ చేయడం, బ్యాంకు అకౌంటు, జాబ్‌ కార్డు నెంబరు, ఆధార్‌ కార్డు నెంబరు లింకైన వారికి మాత్రమే ఆన్‌లైన్‌ చెల్లింపులు చేస్తామని చెప్పడమంటే కూలీలను పనుల నుంచి దూరం చేయడమేనని పేర్కొన్నారు. నేటికీ 65 శాతానికిపైగా కూలీల ఆధార్‌ నెంబర్‌ జనరేట్‌ కాలేదని తెలిపారు. అలాంటప్పుడు ఆధార్‌ అనుసంధానం ఆధారితంగా వేతనాల చెల్లింపు ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు.
బ్యాంకుల విలీనం పేరుతో గ్రామీణ, మండల ప్రాంతాల్లో చాలా బ్యాంకులు మూసివేతకు గురయ్యాయనీ, ఆదివాసీ, గిరిజన ప్రాంతాలలో బ్యాంకు సౌకర్యం లేదని తెలిపారు. సరైన ఆధారాలు లేవని ఏడు కోట్లకు పైగా జాబ్‌ కార్డుదారులను తొలగించినట్టు పార్లమెంట్‌లో ప్రభుత్వం ప్రకటన చేయడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు.

Spread the love