అమలు కానీ గుట్కా నిషేధం..?

– మల్హర్ లో విచ్చలవిడిగా అమ్మకాలు
– పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ – మల్హర్ రావు
గుట్కా, పొగాకు తయారీ పదార్థాలను అరికట్టడానికి ప్రభుత్వం గతంలో అధికారిక ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ పట్టించుకోకపోవడంతో విక్రయాలు బహిరంగంగానే సాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.యువతపై ప్రభావం చూపుతున్న డ్రగ్స్, గంజాయిపై ఓవైపు ఉక్కుపాదం మోపుతూనే, మరోవైపు గుట్కా పాన్ మాసాలాలపై నిషేధం విధిస్తూ పుడ్ సేఫ్టీ కమిషనర్ ద్వారా ఇటీవల ఉత్తర్వులు జారీ చేయించింది.పొగాకు,నికోటిన్ కలిగిన గుట్కా,పాన్ మాసాలాలపై నిషేధం కొనసాగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వీటి తయారీ, నిల్వలు,పంపిణీ,రవాణా, అమ్మకాలపై పూర్తిస్థాయిలో నిషేధం విధించినట్లుగా పేర్కొన్నారు.మే 24 నుంచి ఏడాది పాటు నిబంధనలు అమల్లో ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొంది.తాజా ఉత్తర్వుల్లో ఆహారభద్రత ప్రమాణాల చట్టం 2006 ప్రకారం ఈ నిషేధం అమల్లోకి వస్తుందని తెలిసింది.అయిన మండలంలో తాడిచెర్ల, పెద్దతూoడ్ల,కొయ్యుర్,రుద్రారం,మల్లారం,కొండంపేట,వళ్లెంకుంట,కాపురం గ్రామాల్లో గుట్కా, పాన్ మసాల వ్యాపారం జోరుగా కొనసాగుతోంది. కొయ్యుర్, పెద్దతూoడ్ల గ్రామాలు కేంద్రాలుగా పెద్దయెత్తున కిరాణ దుకాణాల్లో నిల్వలు పెట్టి మండలంలోని పలు గ్రామాల్లోని కిరాణ దుకాణాల్లో చేరవేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇంతా జరిగినా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.
క్షేత్రస్థాయిలో అమలు కానీ ఆదేశాలు….
ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిషేధాన్ని అమలు చేయాలని చెప్పి పదిరోజులు కావస్తున్నా  క్షేత్రస్థాయిలో ఎక్కడ అమలు కావడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.ఆరోగ్యానికి హానికరమైన గుట్కా విక్రయాలను వెంటనే నిర్ముళించాలని,ఇదే అదునుగా బడా వ్యాపారులు సరుకును నల్ల బజారులో అధిక ధరకు విక్రయించే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నారు.ఇప్పటికే చిరు వ్యాపారులకు విక్రయించే గుట్కా ప్యాకెట్లు సామగ్రిని రెండింతల ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారని సమాచారం.ఇదే అదునుగా హోల్ సెల్ వ్యాపారులతోపాటు పలువురు అక్రమంగా దందా చేసేవారు గుట్కాను వేరువేరు చోట్ల  గోదాముల్లో రహస్యంగా నిల్వ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.దీంతో ప్రమాదకర క్యాన్సర్ తదితర వ్యాధుల నుంచి గుట్కా ప్రియులను దూరం చేయాలనే ప్రభుత్వ ఆలోచన ఆదిలోనే హంసపాదుగా మారుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.ఇది ఏమైనప్పటికి ఆరోగ్యానికి హాని కలిగించే గుట్కాను నిషేధించాలని ప్రజలు కోరుతున్నారు.
Spread the love