భువనగిరి కోట మీద మెరిసిన ‘గేయ సైక్లోపీడియా’

భువనగిరి కోట మీద మెరిసిన 'గేయ సైక్లోపీడియా'బడిలో చెప్పిన పాఠాలు విద్యార్థులను భవిష్యత్తు పౌరులుగా, వీరులుగా, వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి. వీటికి తోడు ఆటలు, పాటలు, కథలు కూడా నేర్పినప్పుడు వారి జ్ఞానం, మార్గం మరింతగా వికసిస్తుంది. మరి పాఠాలను పాటలుగా, ఆటలుగా చెప్పినప్పుడు… అది పిల్లలకు నచ్చడమేకాదు, వారిని మరింతగా పరిమళింపజేస్తుంది. ఈ కోవలోనే పాటలను తన బడి పిల్లలకు పాఠాలుగా బోధిస్తున్న ఉపాధ్యాయ సాహితీవేత్త, బాల వికాసకారుడు కుక్కడపు రమేశ్‌. ఈ ఉపాధ్యాయ సాహితీవేత్తది, బాల సాహితీవేత్త పెడెం జగదీశ్వర్‌ది ఒకే ఊరు… మునిపంపుల.
కుక్కడపు రమేశ్‌ నేటి యాదాద్రి భువనగిరి జిల్లా రామన్న పేట మండలం మునిపంపుల గ్రామంలో 10 జూన్‌, 1981 న పుట్టాడు. శ్రీమతి కుక్కడపు ఎల్లమ్మ- గోపాల్‌ ఈయన తల్లిదండ్రులు. వత్తిరీత్యా సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న రమేశ్‌ ‘విద్యార్థులు పాఠాలను, సామాజిక నైతిక విలువలను ఉపన్యాస పద్ధతిలో బోధన చేస్తే నేర్చుకోవడం లేదని గేయాలు, పాటల రూపంలో అందించినట్లయితే ఆసక్తిగా వింటూ పాఠ్యాంశాలలోని విస్తత పదజాలం వారి మెదళ్ళలో నిండిపోతుందని గ్రహించి, ఈ కోణంలో కషిచేసి, రాసిన గేయాలు వీరి తొలి పుస్తకం ‘పాటల పాఠాలు’. ఈ ‘పాటల పాఠాలు’ పుస్తకంగానే కాక ఆడియో సి.డి. గా కూడా విడుదల కావడం మరో విశేషం. రచయితగానే కాక అనేక అంశాలపై వందలాది వీడియోలు చేసి ప్రత్యేక చానల్‌ నడుపుతున్నాడు.
ఇవ్వాళ్టి పుస్తకాలలో మనం మన బాల్యంలో చదువుకున్న ‘అమ్మ, ఆవు, ఇల్లు, ఈగ, ఉడత, ఊయల’ వంటివి అనేకం చూడలేక పోతున్నాం. కారణాలేవైనా ఒకరకంగా భాషాభ్యసనంలో ఇబ్బందులు, చిన్నచూపును ఎదుర్కొంటున్నాం. ఈ సమయంలో మాతభాష మహత్తు పట్ల ఆసక్తి కలిగించేలా ఈ పుస్తకం రావడం బాగుంది. బాలసాహితీవేత్త పెండెం జగదీశ్వర్‌ అన్నట్టు ‘ప్రాథమిక తరగతుల నుండి ఉన్నత పాఠశాల, కళాశాల స్థాయిల వరకు విద్యార్థులకు ఉపయోగపడే అనేక అంశాలు ఇందులో ఉన్నాయి. ఇది నిజం… ప్రాథమిక దశలోని విద్యార్థుల తొలి నడకలకు ఈ గేయాలు చక్కని ఊతాన్నిస్తాయి కూడా. దీనికి కేవలం బాల సాహిత్యమో, మరోటో రాయాలన్న కోరిక, ఆసక్తి, పదసంపద ఉండడమొక్కటే సరిపోదు. అందులో మమేకమైతేనే సాధ్యమవుతుంది. ‘అ..ఆ.. ఇ.. ఈ’ పేరుతో ఈ కోవలోనే అక్షర గీతాలను రాసినవాడిగా ఉపాధ్యాయ కవి రమేశ్‌ పడిన తపన ఏంటో అర్థం చేసుకోగలను. ప్రతి గేయంలో పిల్లలకు వర్ణమాలలను, అందులోని అందాన్ని పరిచయం చేయాలన్న రమేశ్‌ తపన మనకు కనిపిస్తుంది. తొలి గేయం వర్ణమాలలోనే ఆయన తండ్లాట చదివేవారికి, వినేవారికి తెలుస్తుంది. ‘అ, ఆలు రాసేద్దాం/ అమ్మకు ఆకులు ఇచ్చేద్దాం/ ఇ, ఈ అని చదివేద్దాం/ ఇంటిలో ఈగలు కొట్టేద్దాం’ అంటూ అపరమైన పదసంపదను పిల్లలకు అందించే ప్రయత్నం చేశాడు. ‘అచ్చులు’, ‘మహా ప్రాణాక్షరాలు’ ఇలా ఒకటేమిటి అన్నింటిని ఆటల పాటల ‘పాఠాలు’గా చెబుతాడీ ఉపాధ్యాయ కవి. ప్రతి అక్షరాన్ని పాటలో ఒదిగేలా రాయడం మామూలు పనికాదు, సాధించి చూపించాడు రమేశ్‌. ఇందులోని మరో విశేషం అక్షరాలతో గేయాలు. ఇది మరింత కత్తిమీద సాములాంటిది. దీనిని ఈయన నేర్పుగానే దాటాడు. తెలుగు వర్ణమాలలోని దాదాపు యాభైఆరు అక్షరాలకు గేయాలు ఉన్నాయి. ‘త’ అక్షరంతో రాసిన ‘తప్పులు చేసి తక్కువగాకు/ తందానంటూ తలను తిప్పు/ తలుపులనూ తడి చేయవద్దు’ అంటూ సాగుతుందీ గేయం. ఇదే కోవలో ‘వ’ అక్షరంతో వనం గేయం ఉంది. ‘వందనం వందనం/ వనితకు వందనం/ వనం మనకు వరం/ వనవాసం అవసరం’ అంటాడు అందులో. ‘ం’తో వచ్చే పదాలపై కూడా ఇందులో ఒక పెద్ద గేయమే ఉంది. వర్ణమాల అనగానే ‘సరళ పదాల పరిచయ గేయాలు’, ‘భాషా భాగాల గేయాలు’, ‘సంయుక్తాక్షర గేయాలు’, ‘ద్విత్వాక్షర గేయాలు’, ‘ద్విత్వాక్షరం లేని గేయాలు’, ‘ద్వితం ఉన్న పదాలు’ వంటి గేయాలు రాశాడు. ఇంకా వారాలు, రాశులు మొదలుకుని అనేక గేయాలున్నాయి. కేవలం తెలుగు గేయాలే కాక అంతే సంఖ్యలో ఇంగ్లీషు గేయాలు ఇందులో చూడవచ్చు. ఇది ఒక రకంగా ‘బాలల వరమాలాక్షర గేయసైక్లోపీడియా’ కూడా.
కవి రమేశ్‌ ఆలోచనాపరునిగా విద్యార్థులు, విద్యా వ్యవస్థపై రాసిన మరో పుస్తకం ‘విద్య వికసించేదెలా?’. ఇది సామాజికాభివద్ధి, పాఠశాల, ఉపాధ్యాయుల బాధ్యత, వ్యక్తిత్వ వికాసం, విద్యా వికాసంలో విధులు, సహపాఠ కార్యక్రమాలు, పిల్లల సమస్యల పరిష్కారానికి మార్గాలు, సహజ సామర్ధ్యాలు, విద్యార్థుల్లో అభ్యసనాభివద్ధి వికాసానికి తీసుకోవాల్సిన చర్యలు, విధానాలు, పిల్లల సర్వతోముఖాభివద్ధి ఎలా సాధ్యం వంటి అనేక అంశాలను చర్చించింది. పాఠాలతో పాటు ఆటలు, పాటలు ఉండాలన్నది మన విద్యావేత్తలు, మనోవైజ్ఞానిక, బాలల వ్యక్తిత్వనిపుణుల అభిప్రాయాలు, సూచనలు. అయితే వీటికి మరింత మేలిమి బంగరు కాంతులు అద్దుతూ పాఠాలను ఇలా పాటలుగా చెప్పడం బాగుంది. ప్రతిభావంతుడైన ఈ ఉపాధ్యాయ కవి ఒక్కడితోనే ఆగిపోక మరిన్ని మంచి గేయాలను రాయాలని కోరుతున్న. రమేశ్‌ బాలల పట్ల, వాళ్ల వికాసం పట్ల చక్కని అవగాహన ఉన్న కవి కావడం వల్ల ఆ రచనలు మరింతగా రాణిస్తాయి. జయహో! బాల సాహిత్యం.
– డా|| పత్తిపాక మోహన్‌
9966229548

Spread the love