– బీఎల్ఓలకు జేసీ వేణుగోపాల్ ఆదేశం
నవతెలంగాణ – అశ్వారావుపేట
రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లు (బీఎల్ఏలు)తో సమన్వయం చేసుకుంటేనే ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం వేగవంతంగా, సమర్థవంతంగా పూర్తవుతుందని నియోజకవర్గ ఎన్నికల అధికారి, సంయుక్త కలెక్టర్ వేణుగోపాల్ బీఎల్ఓలకు సూచించారు. మంగళవారం స్థానిక రైతు వేదికలో తహశీల్దార్ దాసరి కిశోర్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన బీఎల్ఓ–బీఎల్ఏ ల సమన్వయ సమావేశానికి జేసీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే అశ్వారావుపేట పట్టణంలో ఓటరు నమోదు (ఎన్రోల్మెంట్) ప్రక్రియ నెమ్మదిగా సాగుతోందని తెలిపారు. ఒక వార్డులో నివాసం ఉంటూ మరో వార్డులో ఓటు నమోదు చేసుకున్న వారు, ఉద్యోగరీత్యా వచ్చి ఓటు నమోదు చేసుకుని అనంతరం బదిలీపై వెళ్లిపోయిన వారు ఉండటంతో ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు.
ఇలాంటి ఓటర్లను గుర్తించడంలో రాజకీయ పార్టీల నాయకులు, బీఎల్ఏ ల సహకారం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అందువల్ల బీఎల్ఓలు బీఎల్ఏ లతో సమన్వయం చేసుకుని ఓటరు నమోదు, సవరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ జూపల్లి రమేష్ బాబు, ఎంపీడీవో వాల్మీకి కిశోర్,మున్సిపల్ కమిషనర్ దిలీప్ రెడ్డి, ఎన్నికల డీటీ సయ్యద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.



