– త్వరలోనే ప్రవేశ పరీక్షల షెడ్యూల్
– తర్వాతే కన్వీనర్ల పేర్లు ప్రకటన
– ఉన్నత విద్యామండలి కసరత్తు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మే 10 నుంచి ఎంసెట్ రాతపరీక్షలను నిర్వహించాలని ఉన్నత విద్యామండలి భావిస్తున్నది. అందుకనుగుణంగా షెడ్యూల్‌ను రూపొందించింది. అయితే గతేడాది మే 10, 11 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం, 12 నుంచి 14 వరకు ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగం రాతపరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. అవే తేదీల్లో ఈ ఏడాది ఎంసెట్ రాతపరీక్షలను నిర్వహించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇతర ప్రవేశ పరీక్షలు ఈసెట్, ఎడ్‌సెట్, లాసెట్, ఐసెట్, పీజీఈసెట్, పీఈసెట్‌పైనా ఉన్నత విద్యామండలి కసరత్తును పూర్తి చేసింది. ఒకటి రెండు రోజుల్లో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి ఆమోదం తీసుకుని తర్వాత ప్రవేశ పరీక్షల రాతపరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశమున్నది. అనంతరం వాటి కన్వీనర్ల పేర్లను ఉన్నత విద్యామండలి ఖరారు చేస్తుంది. గతేడాది ఎంసెట్ కన్వీనర్ డీన్ కుమార్, పీజీఈసెట్ కన్వీనర్ రవీందర్‌రెడ్డి, ఈసెట్ కన్వీనర్ శ్రీరాంవెంకటేశ్, లాసెట్ కన్వీనర్ విజయలక్ష్మి, ఎడ్‌సెట్ కన్వీనర్ ఎ రామకృష్ణ, ఐసెట్ కన్వీనర్ పి వరలక్ష్మి, పీఈసెట్ కన్వీనర్ రాజేష్‌కుమార్ వ్యవహరించారు. వారిలో లాసెట్, ఎడ్‌సెట్ కన్వీనర్లు ఉద్యోగ విరమణ పొందడంతో వారి స్థానంలో కొత్త వారిని ఉన్నత విద్యామండలి నియమించింది. మిగిలిన సెట్స్ పాత వారినే కన్వీనర్లుగా కొనసాగించే అవకాశమున్నది. అయితే ఈ ఏడాది ఎంసెట్ పేరు మారనుంది. మెడికల్ సీట్లను నీట్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఎంసెట్ ద్వారా ఫార్మసీ సీట్లు భర్తీ అవుతున్నాయి. అందుకే ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ వచ్చేలా ఈఏపీ సెట్‌గా మార్చే అవకాశమున్నది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఉన్నత విద్యామండలి ఇప్పటికే ప్రభుత్వానికి పంపించింది. ఆ ఉత్తర్వులు త్వరలోనే విడుదలవుతాయని తెలిసింది.