సమాన విద్యతోనే సమాజంలో సమానత్వం

With equal education Equality in society– ‘అభ్యసన సంక్షోభం’ సదస్సులో ఎస్డీఎఫ్‌ కన్వీనర్‌ ఆకునూరి మురళి
– అసమాన భావజాల పార్టీలు బీజేపీ, బీఆర్‌ఎస్‌
-పార్టీలను ఓడించాలి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
”అందరికి సమాన విద్య అందినప్పుడే సమాజంలో సమానత్వం వస్తుంది. ఆ సమాన విద్యనందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. అయితే కేంద్రం, రాష్ట్రంలో పాలిస్తున్న బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు అసమాన భావజాలాన్ని విశ్వసించేవి. అందుకే ఆ ప్రభుత్వాలు అందరికి సమాన విద్యనందించడం లేదు. అందరూ సమానంగా ఉండొద్దని కోరుకునే ఆ రెండు పార్టీలు నేడు సమాజాన్ని శాసిస్తున్నాయి. సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ విద్యను ధ్వంసం చేయాలని కంకణం కట్టుకున్నారు. మన ఊరు మన బడి పథకంతో ప్రభుత్వ స్కూళ్లను మెరుగు పరిచేందుకు రూ.7,278 కోట్లను వెచ్చించనున్నట్టు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. గతేడాది, ఈ ఏడాది బడ్జెట్లలో ఒక్క రూపాయి కేటాయించలేదు. దేశంలో 11 లక్షల ప్రభుత్వ పాఠశాలలున్నాయి. అందులో ఐదేండ్ల కాలంలో కేవలం 14,600 మాత్రమే అభివృద్ధి చేస్తామని బీజేపీ సర్కార్‌ ప్రకటించింది. సమాజంలో అందరికి సమాన అవకాశాలు, సమాన విద్యనందించే సంకల్పం లేనీ బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలను రాబోయే ఎన్నికల్లో ఓడించాలి….” అని సోషల్‌ డెమోక్రటిక్‌ ఫోరం (ఎస్డీఎఫ్‌) కన్వీనర్‌, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళీ ప్రజలను కోరారు.
ఎంవీ ఫౌండేషన్‌ (ఎంవీఎఫ్‌), చైల్డ్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ ఫోరం (సీఆర్పీఎఫ్‌), తల్లుల సంఘం సంయుక్తాధ్వర్యంలో సోమవారం బాగ్‌ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్రంలో దిగజారిన విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలని కోరుతూ రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సీఆర్పీఎప్‌ రాష్ట్ర కన్వీనర్‌ జి.వేణుగోపాల్‌, తల్లుల సంఘం కన్వీనర్‌ జి.భాగ్యలక్ష్మి, ఎంవీఎఫ్‌ జాతీయ కన్వీనర్‌ ఆర్‌.వెంకటరెడ్డి, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ మాజీ చైర్‌పర్సన్‌ ప్రొఫెసర్‌ శాంతాసిన్హా, తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్‌ కోదండరాం, టీపీటీఎఫ్‌ నాయకులు ఇ.రఘునందన్‌, అధ్యక్షులు వై.అశోక్‌ కుమార్‌, బహుజన టీచర్స్‌ ఫెడరేషన్‌ నాయకులు ఎన్‌.యాదగిరి, స్వచ్ఛంద సేవా సంస్థ సాధన డైరెక్టర్‌ సీహెచ్‌.మురళీ మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.
ప్రొఫెసర్‌ కోదండరాం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, నాణ్యమైన విద్య కోసం రాజకీయ పార్టీలు, ప్రజా ప్రతినిధులను నిలదీయాలని సూచించారు. ప్రభుత్వ స్కూళ్లను పట్టించుకుంటేనే ఓటేస్తామని చెబితే పాలకులు దిగి వస్తారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు టీచర్ల నియామకం చేపట్టడం లేదు. ఉపాధ్యాయులు లేని ప్రభుత్వ పాఠశాలలు వదిలి పిల్లలు ప్రయివేటుకెళ్తున్నారు. దీంతో పిల్లలు లేని పాఠశాలలెందుకంటూ వాటిని మూసేస్తూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ విద్యపై కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. 2014 లో ప్రభుత్వ విద్యపై పెట్టిన ఖర్చును 2023 నాటికి సగానికి తగ్గించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతాసిన్హా మాట్లాడుతూ , విద్యారంగం పూర్తిగా ప్రభుత్వమే నడపాలని డిమాండ్‌ చేశారు. విద్యలో రాష్ట్రం వెనుకబడిందనీ, దీంతో అంకెలను మార్చి ప్రగతిని చూపించేందుకు చేసే నేరపూరిత చర్యల్లో ఉపాధ్యాయులను కూడా భాగస్వాములు చేస్తారని ఆరోపించారు.
అత్యంత వెనుకబడిన తెలంగాణ
2021-22 సంవత్సరపు పర్ఫార్మెన్స్‌ గ్రేడింగ్‌ ఇండెక్స్‌ నివేదికలో 36 రాష్ట్రాలకుగాను తెలంగాణ 31వ స్థానంలో నిలిచిందని వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అభ్యసన ఫలితాల్లో 35వ స్థానంతో అత్యంత వెనుకబడిందని తెలిపారు. ఎంవీఎఫ్‌, సీఆర్పీఎప్‌ ఆధ్వర్యంలో 17 జిల్లాల్లో ఆరు నుంచి తొమ్మిదో తరగతి చదివే ప్రభుత్వ, ప్రయివేటు విద్యార్థుల్లో విద్యాసామర్థ్యాలను పరిశీలించినట్టు తెలిపారు. తెలుగులో 37 శాతం మంది విద్యార్థులు, పరిసరాల విజ్ఞానంలో 41 శాతం మంది విద్యార్థులు ఏమి రాయలేకపోయారనీ, 39 శాతం మంది లెక్కల్లో ప్రయత్నం చేయకుండానే వదిలేశారని తెలిపారు. విద్యాసామర్థ్యాలు అందించడం ప్రభుత్వాల చట్టబద్ధ బాధ్యతగా గుర్తించాలనీ, నాణ్యమైన విద్యనందిం చాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయాలన్నింటిని రాబోయే ఎన్నికల్లో రాజకీయ పార్టీలు, ఎమ్మెల్యేలు, అభ్యర్థుల దృష్టికి తీసుకెళతామని తెలిపారు.

Spread the love