హీరో సుమంత్ ప్రభాస్ నటించిన కొత్త చిత్రం ‘గోదారి గట్టుపైన’. నూతన దర్శకుడు సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రంలో నిధి ప్రదీప్ కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా చిత్ర బృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ,’ఈ ట్రైలర్‌లో మీరు చూసింది సినిమాలో ఉంటుంది. సినిమాలో ఉన్నదే మన జీవితంలో ఉంటుంది. ఇది పూర్తిగా రిలేట్ అయ్యే సినిమా. గోదావరి ప్రాంతం చాలా అందంగా ఉంటుంది. అక్కడి లొకేషన్స్ నాకు కేరళ కంటే అందంగా అనిపించాయి. మే8న మీ ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాను చూడండి. గోదావరిలో పడితే బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది… కానీ మా ‘గోదారి గట్టుపైన’ ప్రేమలో పడితే బయటకు రావడం కష్టం. అంతగా మీరు సినిమాను ప్రేమిస్తారు. ఈ సమ్మర్‌లో సినిమా అందరికీ కూల్ వైబ్ ఇస్తుంది’ అని తెలిపారు.’ఈ ట్రైలర్ మీకు నచ్చడం చాలా ఆనందంగా ఉంది. తరాలు మారినా ప్రేమ మాత్రం మారదు. ఇందులో ప్రేమికుల ప్రేమతో పాటు తండ్రి-కూతురు ప్రేమను చూపించాం. సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకుడి ముఖంలో చిరునవ్వు ఉంటుంది. మా సినిమా ఈ వేసవిలో ఒక చలివేంద్రంలాంటిది’ అని డైరెక్టర్ సుభాష్ చంద్ర చెప్పారు. ప్రొడ్యూసర్ అభినవ్ రావు మాట్లాడుతూ,’సుభాష్ చాలా అద్భుతంగా తీశాడు. సుమంత్ అద్భుతంగా నటించాడు. చివరి 40 నిమిషాలు చాలా భావోద్వేగంగా ఉంటాయి. మే 8 తర్వాత ఈ సినిమా గురించి ఇంకా ఎక్కువగా మాట్లాడుకుందాం’ అని తెలిపారు.



