నవతెలంగాణ–పరకాల : క్యాంపు కార్యాలయం, అమరవీరుల మైదానంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడారు. స్వాతంత్ర్య భారతదేశంలో రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుతూ దేశ అభివృద్ధి, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.దేశంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడం, వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడం ప్రభుత్వాల బాధ్యత అన్నారు. నేటికీ అనేక మంది ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో, ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచనల మేరకు రాష్ట్ర ప్రజల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి వారిని కోటీశ్వరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ సొంత నివాసం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటు రంగంలోనూ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో 60 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ఇందిరమ్మ కార్యక్రమంలో భాగంగా కుటీర పరిశ్రమలను అభివృద్ధి చేసి గ్రామీణ ప్రాంతాల్లోనే ఉపాధి అవకాశాలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.గత రెండున్నరేళ్ల పాలనను పరిశీలిస్తే విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో ప్రభుత్వం ప్రజలకు మెరుగైన ఫలితాలు అందించే దిశగా ముందుకు సాగుతోందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రజల ఆశీర్వాదం, సహకారం ఎల్లప్పుడూ ఉండాలని కోరుతూ మరోసారి ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ వేడుకల్లో డిఎస్ వెంకన్న ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్ పోతరాజు పవన్, తహసిల్దార్ విజయలక్ష్మి,మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్, మార్కేట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, కౌన్సిలర్లు,కొయ్యడ శ్రీనివాస్, గూడెల్లి సదన్ కుమార్, బండి శ్రీధర్, సూదమల్ల రమేష్, సమన్వయ కమిటీ సభ్యులు సోదా రామకృష్ణ,మార్త రఘుపతి గౌడ్, దేవేందర్ రెడ్డి,కొలుగూరి రాజేశ్వరరావు,అల్లం రామనారాయణ,బొచ్చు సాల్మన్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కోలెపాక చందు,పట్టణ అధ్యక్షులు ఒంటేరు శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.



