Sunday, June 7, 2026
E-PAPER
Homeతాజా వార్తలుచేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధం

చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఆస్తమా, శ్వాసకోశ వ్యాధిగ్రస్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే మృగశిర కార్తె ‘చేప ప్రసాదం’ పంపిణీకి హైదరాబాద్ సిద్ధమైంది. రేపు (జూన్ 8, 2026) సోమవారం రాత్రి 9:00 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఈ పంపిణీ ఘనంగా ప్రారంభం కానుంది. మంగళవారం రాత్రి వరకు, దాదాపు 24 గంటల పాటు ఎలాంటి విరామం లేకుండా నిరంతరాయంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. బతిని హరినాథ్ గౌడ్ కుటుంబం గత 176 ఏళ్లుగా ఈ సాంప్రదాయాన్ని ఒక పవిత్ర యజ్ఞంలా, ఉచితంగా కొనసాగిస్తోంది. శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారికి బతికున్న కొర్రమీను చేప పిల్ల నోట్లో ఒక ప్రత్యేకమైన మూలిక ముద్దను ఉంచి, దానిని బాధితుల చేత మింగిస్తారు.

ఈ చేప పిల్ల గొంతు గుండా లోపలికి వెళ్లేటప్పుడు ఊపిరితిత్తుల్లోని కఫాన్ని క్లియర్ చేస్తుందని నమ్ముతారు. ఇక పూర్తి శాఖాహారుల కోసం బతిని కుటుంబం బెల్లంతో కలిపిన ప్రసాదాన్ని ప్రత్యేకంగా అందిస్తుంది. లక్షలాదిగా తరలివచ్చే జనం కోసం తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌ను సందర్శించి, పనులను పర్యవేక్షించారు. మత్స్య శాఖ ఆధ్వర్యంలో సుమారు 1.4 లక్షల కొర్రమీను చేప పిల్లలను సిద్ధంగా ఉంచారు. భక్తుల సౌకర్యార్థం ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లలో భారీ ఫ్యాన్లు, కూలర్లు, నిరంతర తాగునీటి సౌకర్యం కల్పించారు. ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు మెడికల్ క్యాంపులు, అంబులెన్సులు, ఫైర్ ఇంజన్లను మొహరించారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా నడుపుతోంది. అయతే ఈ చేప ప్రసాదం తీసుకున్న వారు లబ్ధి పొందాలంటే మందు తీసుకున్న తర్వాత 45 రోజుల పాటు అత్యంత కఠినమైన డైట్ (పథ్యం) పాటించవలసి ఉంటుందని నిర్వహకులు వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -