స్పీకర్‌ పదవిపై ఉత్కంఠ..

– తమ దగ్గరే ఉండాలనుకుంటున్న బీజేపీ
ఢిల్లీ : ఈ నెల 24 నుంచి 18వ లోక్‌సభ కార్యకలాపాలు మొదలు కానున్నాయి. ఈ సందర్భంగా లోక్‌సభకు ఎన్నికైన నూతన సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత స్పీకర్‌ ఎన్నిక జరగనుంది. ఈ క్రమంలో ఆ స్థానంలో ఎవరు కూర్చుంటారోననే చర్చ నడుస్తోంది. ఎన్డీఏ కూటమికి నేతత్వం వహిస్తోన్న బీజేపీ.. స్పీకర్‌ పదవిని తనవద్దే అట్టిపెట్టుకోవాలని చూస్తోందని సమాచారం. మోడీ 3.0 ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీ, జేడీయూ కీలకంగా మారిన విషయం తెలిసిందే. దీంతో ఆ రెండు పార్టీలు ఆ పదవిని ఆశించినట్లు వార్తలు వచ్చాయి. అయితే బీజేపీ మిత్రులకు డిప్యూటీ పోస్టు ఇవ్వాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే డిప్యూటీ స్పీకర్‌ పదవి తమ కూటమికి ఇవ్వకపోతే.. స్పీకర్‌ పోస్టుకు తమ అభ్యర్థిని దింపాలని విపక్ష ‘ఇండియా’ యోచిస్తున్నట్ల సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.అధికార పార్టీకి ఉన్న సంఖ్యాబలం ప్రకారం దానికి చెందిన వ్యక్తే స్పీకర్‌గా ఉంటారని జేడీయూ నేత కేసీ త్యాగి వెల్లడించారు. ”దీనిపై ఎన్డీయే భాగస్వాములు మొదట చర్చలు జరుపుతాయి. ఒకసారి అందరి ఆమోదం లభిం చిన తర్వాత మేం అభ్యర్థిని నిలబెడతాం. ఆ వ్యక్తికి కూటమి పార్టీలన్నీ మద్దతు తెలుపుతాయి” అని టీడీపీ పేర్కొంది. అయితే ప్రస్తుత సమాచారం ప్రకారం.. స్పీకర్‌ పదవి బీజేపీ వద్దే ఉంటే, రాజస్థాన్‌ కోటా స్థానం నుంచి లోక్‌సభకు ఎన్నికైన ఓం బిర్లాకు మరోసారి అవకాశం ఇవ్వొచ్చన్న అంచనాలూ ఉన్నాయి.

Spread the love