కమల సంకల్పం.. న్యాయ హస్తం

 Kamala Sankalpa.. hand of justice– పాత హామీలకే రంగులద్దిన కమలనాథులు
– కాంగ్రెస్‌ అమ్ములపొది నుంచి కొత్త అస్త్రాలు
– చర్చనీయాంశమవుతున్న బీజేపీ, కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలు
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల సమరానికి సిద్ధపడుతున్న బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఇప్పటికే తమ మ్యానిఫెస్టోలను ప్రజల ముందు ఉంచాయి. కాంగ్రెస్‌ తన ఎన్నికల ప్రణాళికకు ‘న్యారు పత్ర’ అని పేరు పెట్టింది. బీజేపీ తన ‘సంకల్ప్‌ పత్ర’ను విడుదల చేయడానికి పది రోజుల ముందే కాంగ్రెస్‌ తన ప్రణాళికను ఓటర్లకు చేర్చింది. ఈ రెండు ప్రణాళికలను పరిశీలిస్తే ప్రధాన రాజకీయ ప్రత్యర్థులైన బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు సార్వత్రిక ఎన్నికలను ఎలా చూస్తున్నాయో అర్థమవుతుంది. ఓటర్లపై ప్రభావం చూపేందుకు, సానుకూల ఫలితాలు రాబట్టేందుకు రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.
రాజకీయ పార్టీలు వరాల జల్లులు కురిపిస్తూ ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉంటాయి. కాంగ్రెస్‌ పార్టీ తన అమ్ములపొది నుండి అనేక వరాల అస్త్రాలను బయటికి తీసింది. బీజేపీ మాత్రం గతంలో తాను ఇచ్చిన హామీలనే గుర్తు చేస్తూ వాటి అమలును కొనసాగిస్తామని చెప్పుకొచ్చింది.
కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో రాష్ట్రాల ప్రణాళికలు
నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ తన మ్యానిఫెస్టోలో పలు విమర్శలు సంధించింది. బీజేపీ మాత్రం పాడిందే పాటరా పాచిపళ్ల దాసుడా అన్న చందంగా 2047 నాటికి భారత్‌ను సంపన్న దేశంగా తీర్చిదిద్దుతామని తెలిపింది. ఇక సంక్షేమానికి రెండు పార్టీలు కొత్త నిర్వచనాన్ని ఇచ్చాయి. పార్టీ పాలనలో ఉన్న రాష్ట్రాలలో అమలు చేస్తున్న కొన్ని సంక్షేమ పథకాలనే కాంగ్రెస్‌ తన మ్యానిఫెస్టోలో చేర్చింది. మహాలక్ష్మి పథకం కింద ప్రతి పేద కుటుంబానికి లక్ష రూపాయలు అందజేస్తామని, లక్ష రూపాయల వార్షిక స్టయిఫండ్‌తో అప్రెంటిస్‌షిప్‌ హక్కు కల్పిస్తామని, ప్రభుత్వ పరీక్షలు, నియామక టెస్టులకు దరఖాస్తు ఫీజును రద్దు చేస్తామని, విద్యా రుణాలను మాఫీ చేస్తామని, పాతిక లక్షల రూపాయల నగదు రహిత ఆరోగ్య బీమా కల్పిస్తామని…ఇలా హామీల వరద పారించింది. అన్నింటికంటే ముఖ్యంగా కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పిస్తామని తెలిపింది.
పాత పథకాలతోనే ముందుకొచ్చిన బీజేపీ
దీనికి భిన్నంగా బీజేపీ ప్రస్తుత సంక్షేమ పథకాల పైనే ఆధారపడింది. భారీ హామీలేవీ ఇవ్వలేదు. అంటే దీనర్థం బీజేపీ మ్యానిఫెస్టోలో హామీలే లేవని కాదు. ఆదాయంతో నిమిత్తం లేకుండా 70 సంవత్సరాలు దాటిన వృద్ధులకు ఐదు లక్షల రూపాయల వరకూ ఉచితంగా ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తామని వాగ్దానం చేసింది. పైప్‌లైన్ల ద్వారా చౌకగా వంట గ్యాస్‌ సరఫరా చేస్తామని గ్యారంటీ ఇచ్చింది. ముద్ర రుణాల పరిమితిని రూ.20 లక్షలకు పెంచుతామని చెప్పింది. అయినప్పటికీ ప్రత్యర్థి కాంగ్రెస్‌తో పోలిస్తే బీజేపీ ఇచ్చిన హామీలు తక్కువేనని చెప్పాలి.
రాష్ట్రాల పైనే భారం
హామీల విషయంలో తేడాలు ఉన్నప్పటికీ రెండు పార్టీలు ప్రధానంగా సంక్షేమ రాజకీయాల పైనే ఆధారపడ్డాయి. అధికారంలోకి వస్తే బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు చేపట్టబోయే సంక్షేమ కార్యక్రమాలు వాస్తవానికి రాష్ట్రాల పైనే ఆర్థిక భారం మోపుతాయి. పథకం లేదా కార్యక్రమం కేంద్రానిదే అయినప్పటికీ రాష్ట్రాలు తమ వంతు వాటాగా కొంత మొత్తాన్ని అందజేయాల్సి ఉంటుంది. దీంతో అసలే వనరుల కొరతతో కునారిల్లుతున్న రాష్ట్రాల పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారవుతోంది.
కులాలపై కాంగ్రెస్‌ దృష్టి
రాహుల్‌ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర, కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన పాతిక హామీలు యువత, మహిళలు, కార్మికులు, రైతులను పార్టీ వైపు ఆకర్షించేందుకు ఉపకరించవచ్చు. సమానత్వం, న్యాయం అనే నినాదాలతో కాంగ్రెస్‌ ప్రజల ముందుకు వెళుతోంది. కులగణన చేపడతామని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్‌ హమీ ఇచ్చింది. కాంగ్రెస్‌ ఇప్పటి వరకూ ఓట్ల కోసం కుల సమీకరణపై దృష్టి పెట్టలేదు. ఇప్పుడు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. అయితే దేశ రాజకీయాలలో గణనీయమైన ప్రభావం చూపగలిగిన పార్టీలకు కులాల అంశం తొలి ప్రాధాన్యత కాదు.
ఆ నాలుగు వర్గాల పైనే కన్ను
ఇక బీజేపీ ప్రధానంగా నాలుగు వర్గాలపై…గ్రామీణులు, యువత, రైతులు, మహిళలపై దృష్టి సారించింది. మోడీ ప్రభుత్వ విధానాలు కూడా ఈ వర్గాల చుట్టూనే తిరుగుతున్నాయి. గిరిజనుల ఓట్లపై కూడా కమలదళం కన్నేస్తోంది. కులగణనపై బీజేపీ పెదవి విప్పడం లేదు. అయితే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్‌) పది శాతం రిజర్వేషన్ల అమలుకు తీసుకుంటున్న చర్యలను ఓటర్లకు గుర్తు చేయడం మాత్రం మరచిపోవడం లేదు. ఏదేమైనా కులాల వారీగా లెక్కల సేకరణ రాబోయే కాలంలో ఒక రూపుదిద్దుకుంటుందని చెప్పవచ్చు.
అంతా మోడీ మయం
బీజేపీకి కర్త, కర్మ, క్రియ…అంతా ప్రధాని మోడీయే. ‘మోడీ కీ గ్యారంటీ’ అంటూ ఆయన తన పేరు మీదుగానే హామీలు కురిపిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఓటర్లను చేరుకునేందుకు బీజేపీ అధ్యక్ష తరహా మ్యానిఫెస్టోను రూపొందించిందని అనిపిస్తోంది. ఆర్టికల్‌ 370 రద్దు, అయోధ్యలో రామమందిర నిర్మాణం అంశాలను కూడా తన ఘనతలుగా కమలదళం చెప్పుకుంది. ఉమ్మడి పౌరస్మృతిని తీసుకొస్తామని, పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేస్తామని పునరుద్ఘాటించింది. అయితే 2019 మ్యానిఫెస్టోలో కన్పించిన ‘జాతీయ పౌరుల రిజిస్టర్‌’ ఇప్పుడు కనబడడం లేదు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వంపై తన మ్యానిఫెస్టోలో నిప్పులు చెరిగింది. రాజ్యాంగ సంస్థల పవిత్రతను పునరుద్ధరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చింది.

Spread the love