కేసీఆర్‌.. నీ పార్టీని మూడు నెలల్లో బొంద పెడతాం

KCR.. your party in three months Let's cover it– కాంగ్రెస్‌ను టచ్‌ చేస్తే బీఆర్‌ఎస్‌ పునాదులుండవు
– కవిత జైలుకుపోయినా బుద్ధి రాలేదా?
– ధైర్యం లేకనే అసెంబ్లీకి దూరం
– ఎంపీ ఎన్నికల్లో 14 సీట్లు మావే.. : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నవతెలంగాణ-నల్గొండ కలెక్టరేట్‌
‘కెేసీఆర్‌ నిన్ను.. నీ పార్టీని మూడు నెలల్లో రాజకీయంగా బొంద పెడతాం. కాంగ్రెస్‌ను టచ్‌ చేస్తే బీఆర్‌ఎస్‌కు పునాదులుండవు. కుమార్తె కవిత జైలుకుపోయినా మీకు ఇంకా బుద్ధి రాలేదా’ అని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని తన క్యాంప్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ ఫోన్‌ ట్యాపింగ్‌ చేయించి.. ఇంట్లో భార్యాభర్తలు మాట్లాడుకునేవి కూడా విని దేశంలో ఎక్కడా లేని దరిద్రమైన పాలన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికైన ప్రభుత్వాన్ని ఏడాదిలో ఎలా పడగొడతావు? దోపిడీ దొంగవై మా ఎమ్మెల్యేలను కొనాలనుకుంటున్నావా అని ప్రశ్నించారు. తాము తలుచుకుంటే మీ బంధువులు ముగ్గురు, నలుగురు తప్ప ఎవరూ బీఆర్‌ఎస్‌లో ఉండరని అన్నారు. ”నువ్వు ఓ పాస్‌పోర్ట్‌ దొంగవు. నువ్వు సీఎం కాగా లేనిది.. కష్టపడి సీఎం పదవిని అలంకరించిన రేవంత్‌ రెడ్డికి నీకు పోలికా.. రేవంత్‌ రెడ్డికి మొఖం చూపించలేక రెండు సార్లు అసెంబ్లీ సమావేశాలైనా నువ్వు రాలేదు. నీ కొడుకు, నీ అల్లుడు తీహార్‌ జైలుకు వెళ్లడం ఖాయం” అని అన్నారు. కేసీఆర్‌ను చూస్తే జాలేస్తుందన్నారు. తాము తలుచుకుంటే 30 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీలో ఎప్పుడో చేరేవారని అన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు కూడా బీఆర్‌ఎస్‌కు రాదన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి 13 నుంచి 14 ఎంపీ సీట్లు రావడం ఖాయమని, జూన్‌ 5 నుంచి ప్రభుత్వ పాలనపై దృష్టి పెడతామని తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రిలో ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఎన్నికల కోడ్‌ ముగిశాక ప్రతి నియోజకవర్గానికీ 3500 ఇండ్లు ఇస్తామన్నారు. 10 సంవత్సరాల కాలంలో ఒక్క ఇల్లైనా కట్టించావా, ఒక్క రేషన్‌ కార్డు అయినా మంజూరు చేశావా.. అసలు పేదల కోసం ఏం చేశావని కేసీఆర్‌ను ప్రశ్నించారు. విటమిన్‌ డీ తీసుకొని దొంగ దీక్షలు చేసి చావు నోట్లో తల పెట్టి ఉద్యమం చేశానని చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. అవినీతి చేసిన కేసీఆర్‌ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కవిత జైలుకు పోయాక కేసీఆర్‌ మానసిక స్థితి దెబ్బతిన్నదని, రేవంత్‌ బీజేపీలోకి పోతున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కుట్రలు చేసినా పసిగట్టుతాం.. మీ కుటుంబానికి సరిపోయే డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు చర్లపల్లి జైల్లో కట్టిస్తామని చెప్పారు.
తినటానికి తిండి లేని జగదీశ్‌ రెడ్డి వేల కోట్లు ఎలా సంపాదించాడో చెప్పాలన్నారు. ఎస్‌ఎల్బీసీ సొరంగం పనులు రూ.3000 కోట్లతో నడుస్తున్నాయని, ఆగస్టులోపు కాలువలు కూడా తీసి అదనంగా సొరంగాన్ని పూర్తి చేసి నీటి సమస్యకు పరిష్కారం చూపబోతున్నామని చెప్పారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీకి కట్టుబడి ఉన్నామన్నారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ వంగూరు లక్ష్మయ్య, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షులు గుమ్ముల మోహన్‌ రెడ్డి తదితరులు ఉన్నారు.

Spread the love